భీమవరం: ఎండ వేడిని తట్టుకోలేక ఆరుబయట కూర్చున్న వ్యక్తిపై తాడిచెట్టుపడి మృతి చెందిన ఘటన భీమవరం గరువుపేటలో శుక్రవారం చోటుచేసుకుంది. భీమవరం వన్‌టౌన్ ఎస్సై బీవై కిరణ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని 11వ వార్డు గరువుపేటకు చెందిన పాలపర్తి రాజ్ కుమార్ (29) క్యాటరింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇతడికి వివాహం కాగా భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. శుక్రవారం మధ్యాహ్నం విద్యుత్ సరఫరా లేకపోవడంలో ఇంట్లో వేడిని భరించలేక రాజ్‌కుమార్ తన ఇంటి ముందు ఖాళీ స్థలంలో మంద్రు సత్తి, ఏలేటి జీవరత్నం, పాలపర్తి చిన్ని మరికొందరితో కలిసి కూర్చున్నాడు. అయితే నాలుగు రోజుల క్రితం కురిసిన వర్షం, ఈదురు గాలుల వల్ల ఖాళీ స్థలంలో ఉన్న తాటి చెట్టు వంగిపోయి బలహీనమైంది. శుక్రవారం మధ్యాహ్నం వీచిన గాలికి తాటి చెట్టు విరిగి రాజ్ కుమార్‌పై పడడంతో వెంటనే స్పహ కోల్పోయాడు. ఈ ప్రమాదంలో మంద్రు సత్తి కాలుకు గాయమైంది. బాధితులను వెంటనే బంధువులు ఆటోలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు రాజ్‌కుమార్ మరణించినట్లు ధ్రువీకరించారు. పాలపర్తి చిన్నరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు కిరణ్ కుమార్ చెప్పారు.


