నవధాన్యాల సాగు.. పంటలకు బాగు | - | Sakshi
Sakshi News home page

నవధాన్యాల సాగు.. పంటలకు బాగు

Jun 6 2026 12:47 AM | Updated on Jun 6 2026 12:47 AM

నవధాన్యాల సాగు.. పంటలకు బాగు

పోషకాలు పుష్కలం

ముసునూరు : రసాయన ఎరువుల వాడకంతో భూసారం క్షీణించడంతో పాటు పర్యావరణ కాలుష్యం ఏర్పడి రైతులకు సాగు ఖర్చు పెరగడమే కాక దిగుబడులపై కూడా ప్రభావం చూపుతుంది. ఈ నేపథ్యంలో నేల ఆరోగ్యం, ఉత్పాదక శక్తి పెంపు, సేంద్రియ ఎరువుల వినియోగంపై అవగాహన పెరగడంతో పచ్చిరొట్ట సాగుపై రైతులు మొగ్గు చూపుతున్నారు. దీనికి తోడు పశువుల ఎరువులు, వర్మీ కంపోస్ట్‌ కొరత, ధరలు అధికం కావడంతో రైతులు పచ్చి రొట్ట ఎరువుగా నవధాన్యాల సాగు వైపు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం నెలకొన్న ఎల్‌నినో ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రకృతి వ్యవసాయంలో నవధాన్యాల సాగు బాగా దోహదపడుతుంది. దీనికి అనుగుణంగానే ప్రకతి వ్యవసాయ శాఖ అధికారులు నవధాన్యాల పంటల సాగుపై అవగాహన కల్పించి, విత్తనాలిచ్చి, రైతులను ప్రోత్సహిస్తున్నారు.

నవ ధాన్యాల రకాలు

వరి, గోధుమ, ఉలవ,పెసలు,కందులు, నువ్వులు, అనుములు,మినుములు, శెనగలు. వీటితోపాటు పచ్చిరొట్ట కోసం జొన్నలు, మొక్కజొన్నలు, సజ్జలు, జనుము, జీలుగ, పిల్లిపెసర, రాగులు, తదితర చిరు ధాన్యాలు కూడా పచ్చిరొట్ట సాగు కోసం వినియోగించుకోవచ్చు.

ప్రయోజనాలివే

● నేల నిర్మాణాన్ని మెరుగుపరుస్తుంది. నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచుతుంది. నేల కోతను నివారించి నష్టాన్ని తగ్గిస్తుంది.

● నవధాన్యాల విత్తనాలు ఎక్కువ రకాలుగా చల్లడం వల్ల మొక్కలు సన్నగా ఎదిగి, నేలలో కలియ దున్నినప్పుడు వేగంగా కుళ్లి, నేలలో కలిసిపోతాయి. దీంతో నేలలో సేంద్రియ కర్బనం పెరుగుతుంది.

● నేలలో ఉండే ప్రయోజనకర సూక్ష్మజీవుల సంఖ్యను మెరుగుపరుస్తుంది.

● వేర్లు భూమిలో ఎక్కువ లోతుకు వెళ్లడం వల్ల నేలను అధికంగా గుల్లబారేలా చేస్తుంది.

● రసాయన ఎరువుల వాడకాన్ని 35 నుంచి 45 శాతం వరకు తగ్గించడంలో సహాయపడతాయి.

● కలుపు మొక్కలను తగ్గించడంలోనూ సహాయపడతాయి. పశువుల మేతగా కూడా వాడవచ్చు.

పచ్చిరొట్టను కలిపే విధానం

పళ్లెపు నాగలితో పంటకు 60 నుంచి 80 రోజుల వ్యవధి వచ్చినపుడు నవ ధాన్యాల రొట్టను కలియ దున్నడం వల్ల మట్టిలో బాగా కలిసి పోతుంది. రోటవేటర్‌ ను ఉపయోగిస్తే జీవ పదార్ధం వేగంగా కుళ్లిపోతుంది.

పాడి–పంట

నవధాన్యాల పచ్చిరొట్టను పెంచి పొలంలో కలియదున్నడం ద్వారా పుష్కలమైన పోషకాలు పంటకు అందుతాయి. దీని వల్ల పంట సాగు ద్వారా రైతులు అధిక దిగుబడులు సాధిస్తారు. ప్రకతి సేద్యం విభాగం ద్వారా నవ ధాన్యాల విత్తన పంపిణీ కొనసాగుతోంది. రైతులు సద్వినియోగం చేసుకోవాలి.

– ఆలూరు చాముండేశ్వరి, మండల వ్యవసాయ శాఖాధికారి, ముసునూరు

Advertisement
 
Advertisement
Advertisement