పెనుగొండ: గోదావరిలో స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తూ జారి పడి ఓ యువకుడు మరణించాడు. వివరాల్లోకి వెళితే కరుగోరుమిల్లి పుష్కరాల రేవులో స్నేహితులతో కలసి వల్లూరు గెద్దాడ వారి పాలెంకు చెందిన జక్కంశెట్టి భానుప్రసాద్(18) స్నానానికి వెళ్లాడు. అయితే మధ్యాహ్నం రెండుగంటల సమయంలో ప్రమాదవ శాత్తు జారి పడిపోవడంతో గల్లంతయ్యాడు. స్నేహిహితులు రక్షించడానికి ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది, దీంతో స్థానికులు, పోలీసులు, పాలకొల్లు అగ్నిమాపక సిబ్బంది కలసి గాలించగా సాయంత్రం 6 గంటల ప్రాంతంలో మృత దేహాం లభ్యమైంది. దీంతో బంధువుల ఆర్తనాదాలు స్థానికులను కలచివేశాయి. మృతుడి బావ దొంగ విఘ్నేశ్వరరావు ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కట్టా వెంకట రమణ తెలిపారు.
ఏలూరు టౌన్: జిల్లాలో ఆపరేషన్ రిస్టోర్‌లో భాగంగా తమ విలువైన మొబైల్ ఫోన్లను పోగొట్టుకున్న లేదా చోరీకి గురైన వాటిని ఎంతో శ్రమించి రివకరీ చేసి శుక్రవారం బాధితుల ఇంటివద్దకే వెళ్లి పోలీసులు అందజేశారు. ఏలూరు జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ ఆదేశాలతో ఆపరేషన్ రిస్టోర్‌లో ఏలూరు సైబర్‌సెల్ సీఐ దాసు తమ టెక్నికల్‌టీమ్‌తో ఏలూరు జిల్లాలో సుమారు 322 మొబైల్ ఫోన్లు రికవరీ చేశారు. ఈ సెల్‌ఫోన్ల విలువ సుమారుగా రూ.60 లక్షల 40 వేలు ఉంటుందని పోలీస్ అధికారులు పేర్కొన్నారు. ఏలూరు, జంగారెడ్డిగూడెం, పోలవరం, నూజివీడు పోలీస్ సబ్‌డివిజన్ల పరిధిలో పోలీస్ అధికార యంత్రాంగం నేరుగా బాధితుల ఇళ్లకే వెళ్లి సెల్‌ఫోన్లు అందజేశారు. జిల్లా వ్యాప్తంగా ఆయా పోలీస్‌స్టేషన్లలో నమోదైన కేసులపై దర్యాప్తు చేపట్టి మొబైల్ ట్రాకింగ్ సిస్టమ్‌తో కొద్దిరోజుల్లోనే 322 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఏలూరులో వన్‌టౌన్ సీఐ రామకృష్ణ బాధితుల ఇంటికి వెళ్లి ఫోన్లను అందజేయడంతో వారు పోలీసు శాఖకు కృతజ్ఞతలు తెలిపారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఖతార్ దోహాలో హోమ్‌కేర్ నర్స్ రంగంలో ఉద్యోగావకాశాల కోసం దరఖాస్తులు కోరుతున్నట్టు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎన్.జితేంద్రబాబు శుక్రవారం ప్రకటనలో తెలిపారు. 21 నుంచి 40 సంవత్సరాల మధ్య వయసున్న పురుషులు, సీ్త్రలు ఈ ఉద్యోగాలకు అర్హులని పేర్కొన్నారు. అలాగే 2 సంవత్సరాల అనుభవం ఉన్న అభ్యర్థుల నుంచి 2 సంవత్సరాల కాంట్రాక్ట్ ఉద్యోగాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని వివరించారు. నెలకు సుమారుగా రూ.1,30,000 వరకు జీతం ఉంటుందని స్పష్టం చేశారు. అభ్యర్థులు చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్ట్, సంబంధిత ఎడ్యుకేషన్ సర్టిఫికెట్, అనుభవం ధ్రువీకరణ పత్రాలు, గుడ్ స్టాండింగ్ సర్టిఫికెట్, గ్రాడ్యుయేషన్ అటెస్టేషన్ సమర్పించాలని కోరారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు నైపుణ్యం వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవచ్చని లేదా హెల్ప్‌లైన్ నెంబర్ 9988853335కు ఫోన్ చేయాలని కోరారు.


