వరికి ప్రత్యామ్నాయ పంటలు వేయడం మేలు | - | Sakshi
Sakshi News home page

వరికి ప్రత్యామ్నాయ పంటలు వేయడం మేలు

Jun 6 2026 12:47 AM | Updated on Jun 6 2026 12:47 AM

పెనుమంట్ర: దేశంలో ప్రస్తుతం వరి ఉత్పత్తి అవసరాలకు మించి పెరిగిందని, అందువల్ల రైతులు వరికి ప్రత్యామ్నాయంగా వేరే పంటలు వేయాలని ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ ఉపకులపతి పీవీ సత్యనారాయణ అన్నారు. మార్టేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ఆధ్వర్యంలో శుక్రవారం సార్వా విత్తన దినోత్సవం, ఖేత్‌ బచావో అభియాన్‌ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న సత్యనారాయణ మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్ర అవసరాలకు కేవలం 55 లక్షల టన్నుల బియ్యం సరిపోతాయని, మన రాష్ట్ర ఉత్పత్తి 90 లక్షల టన్నులకు పైచిలుకు ఉందని తెలిపారు. వరి సాగు విస్తీర్ణాన్ని క్రమంగా తగ్గించి, ఆ స్థానంలో నూనె గింజలు, పప్పు ధాన్యాల సాగును ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని సూచించారు. దీని ద్వారా దేశంలో వంటనూనెల దిగుమతులపై ఆధారపడటం తగ్గడంతో పాటు, పప్పుధాన్యాల ఉత్పత్తి పెరిగి పోషకాహార భద్రత మెరుగుపడుతుందని పేర్కొన్నారు.

పురుగు మందుల వాడకాన్ని తగ్గించాలి

అలాగే రైతులు రసాయన ఎరువులు, పురుగు మందులను విచక్షణారహితంగా ఉపయోగించడం వలన నేల ఆరోగ్యం క్షీణిస్తుందని సత్యనారాయణ ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం భూ సారాన్ని కాపాడటానికి ఖేత్‌ బచావో అభియాన్‌ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందని తెలిపారు. ఈ పథకంలో భాగంగా జూన్‌ 1 నుంచి 30 వరకు క్షేత్ర స్థాయిలో రసాయన ఎరువులు తగ్గించడం, జీవన ఎరువులు, సేంద్రియ ఎరువుల వాడకం పెంచడం వంటి విషయాలపై రైతులకు అవగాహన కల్పించాలని శాస్త్రవేత్తలను ఆదేశించారు. సహ పరిశోధనా సంచాలకుడు సీహెచ్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ రైతులు ధ్రువీకరించిన నాణ్యమైన విత్తనాలను ఉపయోగించడం ద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చని చెప్పారు. వరి శాస్త్రవేత్త ఎం.గిరిజా రాణి మాట్లాడుతూ వివిధ వాతావరణ పరిస్థితులు, మార్కెట్‌ అవసరాలకు అనువైన వరి వంగడాలపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. అనంతరం బుట్టాయగూడెం పరిసర గ్రామాల నుంచి వచ్చిన 50 మంది గిరిజన రైతులకు గిరిజన ఉపప్రణాళికా పథకంలో భాగంగా ఎంటీయూ 1318 ఫౌండేషన్‌ విత్తనం ఉచితంగా అందజేశారు.

Advertisement
 
Advertisement
Advertisement