ఉండి: మండలంలోని పాములపర్రు గ్రామంలో శుక్రవారం జరిగిన విద్యుత్ ప్రమాదంలో థర్మాకోల్ లోడు లారీ దగ్ధమైంది. స్థానికులు,అగ్నిమాపక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ధర్మకోల్ లోడుతో గణపవరం నుంచి ఆకివీడు బయలుదేరిన లారీ పాములపర్రులోని పెదకాపవరం రోడ్డులోకి వెళ్లింది. రోడ్డులోకి తిరిగిన కొద్ది దూరంలోనే లారీకి విద్యుత్ తీగలు తగలడంతో ఒక్కసారిగా లారీలోని థర్మాకోల్‌కు మంటలు అంటుకుని పెద్దగా వ్యాపించాయి. ఇది గమనించని లారీ డ్రైవర్ ముందుకు వెళ్లడంతో స్థానిక మహిళలు గట్టిగా కేకలు వేశారు. దీంతో లారీ డ్రైవర్ లారీలో నుంచి కిందికి దూకేశాడు. అదే ప్రాంతంలో రోడ్డును ఆనుకుని ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌కు లారీ తాకడంతో ప్రమాదం మరింత పెద్దదైంది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడటంతో పాటుగా నల్లని పొగ గ్రామమంతా అలముకోవడంతో ప్రజలు భయబ్రాంతులకు గురైయ్యారు. సమాచారం అందుకున్న ఆకివీడు అగ్నిమాపక అధికారి వెంకటేశ్వరరావు తన సిబ్బందితో ప్రమాదస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. సుమారు రూ.5 లక్షల వరకు నష్టం వాటిల్లి ఉంటుందని ఆయన అంచనా వేశారు.


