పంచాయతీ కార్మికుల ఆకలికేకలు | - | Sakshi
Sakshi News home page

పంచాయతీ కార్మికుల ఆకలికేకలు

Jun 6 2026 12:41 AM | Updated on Jun 6 2026 12:41 AM

సమస్యలు పరిష్కరించాలి

కొన్నిచోట్ల ఏడాదిగా బకాయిలు

పారిశుద్ధ్య సేవల్లో వీరే కీలకం

నెలల తరబడి వేతనాలు అందక ఆందోళన

భీమవరం: స్వచ్ఛాంధ్ర.. క్లీన్‌ స్వీప్‌ అంటూ అధికారులు, ప్రజాప్రతినిధులు చీపుర్లు పట్టి ఫొటోలకు ఫోజులిస్తుంటే గ్రామాల్లో నిరంతరం రోడ్లు, డ్రెయిన్లు శుభ్రం చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు, గ్రీన్‌ వెహికల్స్‌ డ్రైవర్లు, పంపు ఆపరేటర్లు, ఎలక్ట్రీషియన్లు నెలల తరబడి జీతాలందక అవస్థలు పడుతున్నారు. జిల్లాలోని 20 మండలాల పరిధిలో 406 పంచాయతీల్లో వందలాది మంది కార్మికులు పనిచేస్తున్నారు. దాదాపు 200 పంచాయతీల్లో సుమారు మూడు వేల మంది కాంట్రాక్ట్‌ టెండర్‌ పద్ధతిలో సేవలందిస్తున్నారు. రోజూ తెలవారక ముందే రోడ్లను శుభ్రం చేయడం, చెత్తను ట్రాక్టర్‌, ఆటోరిక్షాల్లో ఎక్కించి దూరప్రాంతాలకు తరలించడం, డ్రెయినేజీలను శుభ్రం చేయడం వంటి పనులు చేస్తున్నారు.

రోజంతా కష్టపడ్డా.. రోజంతా వీరు సేవలందించినా నెలకు రూ.15 వేల వేతనం మాత్రమే అందు తోంది. జిల్లాలో పెనుగొండ, అత్తిలి, ఉండి, వీరవాసరం, రేలంగి, ఇరగవరం, రాయకుదురు వంటి మేజర్‌ పంచాయతీల్లో సుమారు 30 మంది వరకు పనిచేస్తున్నారు. వీరంతా ఉదయం, సాయంత్రం తప్పనిసరిగా మస్తర్లు వేయాల్సి ఉంటుంది. ఒకపూట పనికి వెళ్లకపోయినా వేతనంలో కోత విధిస్తారు. ఇదిలా ఉండగా కొన్ని పంచాయతీల్లో తొమ్మిది నెలలుగా కార్మికులకు జీతాలు ఇవ్వడం లేదు. మరికొన్ని పంచాయతీల్లో మూడు నుంచి ఆరు నెలల వేతన బకాయిలు ఉన్నాయి.

సామగ్రి భారం : ఓ పక్క వేతనాలు అందక నానా అవస్థలు పడుతున్న కార్మికులపై గోరు చుట్టుపై రోకలి పోటు మాదిరిగా పారిశుద్ధ్య పనులకు వినియోగించే చీపుర్లు, పారలు వంటి పనిముట్ల భారం పడుతోంది. వీరు సొంత ఖర్చులతో వీటిని కొనుగోలు చేసి విధులు నిర్వహించాల్సి వస్తోందది. కొన్ని పంచాయతీల్లో కార్మికులందరికీ ఒకేరకంగా వేతనాలు ఇస్తున్నా పని కేటాయింపులో వివక్ష చూపుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వేతనాలు అందకపోవడంతో ఇటీవల పెనుగొండ పంచాయతీ సిబ్బంది ఆందోళనకు దిగారు. అలాగే యలమంచిలి మండలంలో మేడపాడు పంచాయతీ సిబ్బంది సమావేశమై తక్షణం జీతాలు ఇవ్వకుంటే సమ్మె బాట పట్టాలని నిర్ణయం తీసుకున్నారు. గ్రామాల అభివృద్ధి లక్ష్యమని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ చెబుతున్నా క్షేత్రస్థాయిలో పారిశుద్ధ్య కార్మికుల సమస్యల పరిష్కారానికి మాత్రం చొరవ చూపడం లేదనే విమర్శలు ఉన్నాయి.

అరకొర జీతాలతో జీవితాలు నెట్టుకొస్తున్న పంచాయతీ పారిశుద్ధ్య, ఇతర కార్మికులకు నెలల తరబడి జీతాలు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తక్షణం ప్రభుత్వం జీతాలు చెల్లించాలి.

– ఎం.ఆంజనేయులు, ఏపీ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా గౌరవాధ్యక్షుడు

జిల్లాలో కార్మికులు సమస్యలతో సతమతమవుతున్నారు. కొన్ని పంచాయతీల్లో ఏడాది కాలంగా జీతాలు ఇవ్వడం లేదు. చీపుర్లు, పారలు వంటివి కూడా కార్మికులే కొనుగోలు చేసుకోవడం భారంగా మారింది.

– మానుకొండ శివరావు,

యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు

Advertisement
 
Advertisement
Advertisement