భీమవరం: డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణంరాజు వైఖరి కారణంగా రాష్ట్రంలోని సుమారు 1.10 కోట్ల మంది దళితులు, దళిత క్రైస్తవులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని జై భారత్ పార్టీ వ్యవస్థాపకుడు జడా శ్రవణ్‌కుమార్ అన్నారు. శుక్రవారం భీమవరం అంబేడ్కర్ భవన్‌లో విలేకరులతో మాట్లాడారు. రఘురామకృష్ణంరాజు వ్యవహార శైలికి నిరసనగా అల్టిమేటం ఇవ్వడానికి ఈనెల 28న ఏలూరులో లక్ష మంది దళితులు, దళిత క్రైస్తవ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్టు చెప్పారు. రాజ్యాంగ హోదాలో ఉన్న రఘురామకృష్ణంరాజు కుల ధ్రువీకరణ సర్టిఫికెట్లు రద్దు చేయా లని హైకోర్టులో కేసులు ఎలా వేస్తారని ప్రశ్నించారు. రాష్ట్రంలో 113 చర్చిలను తొలగించాలని, చర్చిలపై మైకులను తీసివేయాలని డీజీపీకి రఘురామకృష్ణంరాజు ఏ అధికారంతో లేఖ రాశారో చెప్పాలన్నారు. రాజ్యాంగ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఆయన్ను డిప్యూటీ స్పీకర్ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రఘురామకృష్ణంరాజు దళం పేరుతో కొందరు అర్ధరాత్రు లు తిరుగుతున్నారని, దళిత శ్మశానాల్లో సమాధులు ఎవరికి కట్టారు, ఏ సమాధులపై సిలువ గుర్తులున్నాయో ఫొటోలు తీస్తున్నారన్నారు. దళితులు, దళిత క్రైస్తవుల ఓట్లు వద్దని చెబుతున్న డిప్యూటీ స్పీకర్ వారు కడుతున్న పన్ను నుంచి జీతంగా ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. అనంతరం బహిరంగ సభ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఏపీ బహుజన జేఏసీ నాయకులు పాల్గొన్నారు.


