వేసవి శిబిరం.. నిర్వాహకులకు శిరోభారం | - | Sakshi
Sakshi News home page

వేసవి శిబిరం.. నిర్వాహకులకు శిరోభారం

Jun 5 2026 1:00 AM | Updated on Jun 5 2026 1:00 AM

స్నాక్స్‌కు కూడా డబ్బులు లేవు

భీమవరం: గతంలో ‘జన్మభూమి’ అంటూ గ్రామాలు, పట్టణాల అభివృద్ధికి దాతలపై ఆధారపడ్డ తెలుగుదేశం ప్రభుత్వం... నేడు గ్రంథాలయాల్లో ఏర్పాటు చేసిన వేసవి విజ్ఞాన తరగతుల నిర్వహణ భారాన్ని కూడా దాతలపైనే వేసి వేడుక చూస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విజ్ఞాన తరగతుల నిర్వహణకు ప్రభుత్వం నిధులు కేటాయించకపోగా... ఈ తరగతులను తప్పనిసరిగా నిర్వహించాలని, దీనికోసం దాతల సహకారం తీసుకోవాలని ఆదేశించడం గమనార్హం.

విద్యార్థుల మేలు కోసమే అయినా... వేసవి కాలంలో పాఠశాలలకు సెలవులు ఇవ్వడంతో విద్యార్థులు బయట తిరుగుతూ ఎండబారిన పడకుండా ఉండేందుకు ప్రతి ఏటా శాఖా గ్రంథాలయాల్లో వేసవి విజ్ఞాన తరగతులు నిర్వహిస్తుంటారు. సుమారు 40 రోజుల పాటు చిన్నారులకు విజ్ఞానంతో పాటు వినోదం, సృజనాత్మకతకు పదును పెట్టే విధంగా ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు ఈ తరగతులు జరుగుతాయి. ఇందులో భాగంగా విద్యార్థులకు కంప్యూటర్‌ బేసిక్స్‌, పుస్తక పఠనం, డ్యాన్స్‌, క్యారమ్స్‌, నీతికథల బోధన, చెస్‌, యోగా, చిత్రలేఖనం, సంగీతం వంటివి నేర్పించాలని ప్రభుత్వం గ్రంథాలయాధికారులను ఆదేశించింది. ఇంతవరకు బాగానే ఉన్నా... ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని 74 శాఖా గ్రంథాలయాలకు గాను, 40 రోజుల పాటు చిన్నారులకు శిక్షణ ఇవ్వడానికి శిక్షకులను (ట్రైనర్స్‌) ఏర్పాటు చేయడం... కార్యక్రమాలకు అతిథులుగా వచ్చే ప్రజాప్రతినిధులు, అధికారులకు పుష్పగుచ్ఛాలు, అల్పాహారం (స్నాక్స్‌) వంటివి అందించడం గ్రంథాలయాధికారులకు తలకు మించిన భారంగా మారింది. ఏప్రిల్‌ 28వ తేదీన ప్రారంభమైన ఈ వేసవి విజ్ఞాన శిబిరాలు ఈ నెల 6వ తేదీతో ముగియనున్నాయి.

సర్టిఫికెట్లు, జ్ఞాపికలకూ దాతలదే భారం!

చిన్నారులకు వివిధ అంశాల్లో శిక్షణ ఇచ్చి, వారికి పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు ఇవ్వడానికి కూడా దాతలను ఆశ్రయించాల్సి వచ్చింది. చిన్నారుల కోసం నిర్వహించిన పోటీల్లో విజేతలకు ప్రభుత్వం తరపున ఎటువంటి బహుమతులు ఇవ్వకపోవడంతో... గ్రంథాలయాధికారులు, గ్రంథాలయ అభివృద్ధి కమిటీలు తమ పరువు కాపాడుకోవడానికి దాతలను ఆశ్రయించి ‘మమ’ అనిపించాల్సి వస్తోందనే ఆందోళన వ్యక్తమవుతోంది.

మున్ముందు మంగళమేనా

భీమవరం పట్టణంలోని డాక్టర్‌ వైఎస్సార్‌ మెమోరియల్‌ శాఖా గ్రంథాలయంలో నిర్వహించిన విజ్ఞాన తరగతుల్లో పాల్గొన్న విద్యార్థులకు ‘మానవత’ సంస్థ స్నాక్స్‌ అందించగా... ‘దాట్ల శ్రీదేవి ట్రస్ట్‌’ ఆధ్వర్యంలో జ్ఞాపికలు, ప్రశంసాపత్రాలు అందజేశారు. జిల్లాలోని అన్ని గ్రంథాలయాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ప్రతి ఏటా ఇదే పరిస్థితి కొనసాగితే.. మున్ముందు ఈ వేసవి విజ్ఞాన తరగతులకు మంగళం పాడాల్సి వస్తుందని నిర్వాహకులు స్పష్టం చేస్తున్నారు.

భీమవరం వంటి గ్రేడ్‌–1 శాఖా గ్రంథాలయంలో ప్రతిరోజూ సుమారు 70 మంది వరకు చిన్నారులు హాజరై శిక్షకులు చెప్పే అంశాలను శ్రద్ధగా విన్నారు. అయితే, మూడు గంటలకు పైగా ఎంతో ఓపికగా కూర్చునే పిల్లలకు కనీసం స్నాక్స్‌ ఇవ్వడానికి కూడా ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడం విశేషం. గతంలో ప్రతి గ్రంథాలయానికి విజ్ఞాన శిబిరాల నిర్వహణ కోసం రూ. 15 వేల వరకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయగా... నేడు ఒక్క పైసా కూడా ఇవ్వకుండా చేతులెత్తేసింది. దీంతో నిర్వాహకులు దాతల వద్దకు వెళ్లి చేయి చాచాల్సి వచ్చింది.

నిధులు ఇవ్వకుండా... చేతులెత్తేసిన ప్రభుత్వం

వేసవి విజ్ఞాన తరగతుల నిర్వహణ భారం దాతలపైనే !

ఇలాగైతే కష్టమే అంటున్న గ్రంథాలయాధికారులు

Advertisement
 
Advertisement
Advertisement