ద్వారకాతిరుమల: శ్రీవారి క్షేత్రంలో ఇటీవల ప్రారంభమైన అభివృద్ధి పనులను, అలాగే త్వరలో చేపటనున్న మరిన్ని పనులకు సంబంధించిన ప్రణాళికలను రాష్ట్ర దేవాదాయశాఖ రిటైర్డ్ ఎస్‌ఈ, టెక్నికల్ కమిటీ సభ్యుడు ఎస్.సుబ్బారావు ఆలయ ఈఓ వేండ్ర త్రినాధరావు, ఈఈ భాస్కర్‌లతో కలిసి గురువారం పరిశీలించారు. అలాగే ఆలయ తూర్పు ప్రాంతంలోని షాపింగ్ కాంప్లెక్స్ వెనుక ప్రాంతంలో త్వరలో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రణాళికలను, మాస్టర్ ప్లాన్‌ను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ముందుగా ఆయన స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు.
ఏలూరు (టూటౌన్): జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లోని గౌతమీ సమావేశపు హాలులో గురువారం వ్యవసాయ, అనుబంధ రంగాలు, జలధార, సూర్యఘర్ యోజన, తదితర కార్యక్రమాల అమలుపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ నిర్ధేశించిన లక్ష్యాల మేర ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు త్వరితగతిన ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. జలధార కార్యక్రమం ద్వారా నీటి సంరక్షణ పనులను ఈనెల 15వ తేదీ లోగా పూర్తిచేయాలన్నారు. సూర్యఘర్ ప్రయోజనాలపై ప్రజలకు గ్రామ స్థాయిలో అవగాహన కల్పించాలన్నారు.
ఏలూరు (టూటౌన్): ఏలూరు జిల్లా సమీక్షా సమావేశం శుక్రవారం ఉదయం 10 గంటలకు ఏలూరు కలెక్టరేట్‌లోని గోదావరి సమావేశపు హాలులో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ, జిల్లా ఇన్‌చార్జి మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన జరుగుతుందని కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఒక ప్రకటనలో తెలిపారు. సమావేశంలో ఖరీఫ్–2026 సన్నద్ధత, వ్యవసాయ, అనుబంధ రంగాల లక్ష్యాలు, జలధార, ఇరిగేషన్ శాఖ ఓఅండ్‌ఎం పనులు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు, సూర్యఘర్ యోజన లక్ష్యాల ప్రగతి, తదితర అంశాలపై సమీక్ష జరుగుతుందన్నారు.
భీమవరం(ప్రకాశంచౌక్): పశ్చిమగోదావరి జిల్లా ముఖ్య ప్రణాళిక శాఖలో సహాయ సంచాలకులుగా విధులు నిర్వహిస్తున్న కంటిపూడి శ్రీనివాసరావుకు డిప్యూటీ డైరెక్టర్ హోదా లభించింది. 2022 నుంచి ఆయన ఇక్కడ సేవలందిస్తున్నారు. రెండుసార్లు ఇన్‌చార్జి సీపీఓగా బాధ్యతలు నిర్వర్తించారు. డిప్యూటీ డైరెక్టర్ పదోన్నతితో త్వరలో ఏలూరు జిల్లా ముఖ్య ప్రణాళికాధికారిగా బాధ్యతలు స్వీకరించనున్నట్టు ఆయన చెప్పారు.
తణుకు అర్బన్: భారతీయ టెక్స్‌టైల్స్ ఉత్పత్తులకు ప్రోత్సాహం అందించాలని ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్ ధాయిలాండ్‌లో జరుగుతున్న ట్రేడ్ సదస్సులో కోరారు. బ్యాంకాక్‌లో జరుగుతున్న ఆసియన్ సోర్సింగ్ ఫెయిర్‌లో భారతీయ ఎంబాసిడర్ పునీత్ అగర్వాల్‌తో జరిగిన సమావేశంలో రవీంద్రనాథ్ మాట్లాడారు. థాయిలాండ్‌లో వస్త్ర పరిశ్రమ అభివృద్ధి చెందుతుందని, ఈ నేపథ్యంలో భారతీయ నూలు ప్రాముఖ్యతను బ్యాంకాక్‌లోని ఇండియన్ ఎంబసీ అధికారులు వాణిజ్య సంస్థలకు భారతీయ ఉత్పత్తుల సరఫరాపై అవగాహన కల్పించాలని కోరారు. అంతర్జాతీయ ట్రేడ్ ఫెయిర్‌లో వివిధ వస్త్ర పరిశ్రమల ఉత్పత్తులను ప్రదర్శించగా ఆంధ్రప్రదేశ్ నుంచి రవళి స్పిన్నర్ల నూలు ఉత్పత్తులు పట్ల ఇతర దేశాల వస్త్ర తయారీదారులు ఆసక్తి చూపించినట్లు ఎమ్మెల్సీ రవీంద్రనాథ్ తెలిపారు.


