విద్యార్థులకు నష్టం
విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చర్యలు
బుట్టాయగూడెం: ఏజెన్సీ గిరిజన ప్రాంతాల్లోని విద్యా వ్యవస్థలో మరో కీలకమైన మార్పుకు శ్రీకారం చుట్టారు. గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో గత 16 సంవత్సరాలుగా కొనసాగుతున్న 3, 4 తరగతుల ప్రవేశానికి జరిగే అడ్మిషన్లు ఈ సంవత్సరం నుంచి నిలిచిపోనున్నాయి. ఇకపై ఆశ్రమ పాఠశాలల్లో నేరుగా 5వ తరగతి నుంచే ప్రవేశాలు కల్పించాలని ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విద్యా సంవత్సరం నుంచే 3, 4 తరగతులకు అడ్మిషన్లు నిలిపివేయనున్నారు. పసి పిల్లలను చిన్న వయస్సులోనే ఇళ్లకు, తల్లిదండ్రులకు దూరంగా ఉంచి ఆశ్రమ పాఠశాలల్లో ఉంచడం వల్ల ఎదురవుతున్న ఇబ్బందులను గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ గుర్తించారు. ఈ నేపథ్యంలోనే గిరిజన సంక్షేమ శాఖ తాజా నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతి మండలంలో కేవలం రెండు, మూడు ఎంపిక చేసిన పాఠశాలల్లో మాత్రమే 3, 4 తరగతులను కొనసాగించే అవకాశం కల్పించారు. మిగిలిన అన్ని ఆశ్రమ పాఠశాలల్లో ఈ ఏడాది నుంచి నేరుగా 5వ తరగతి నుంచి అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది.
ఐటీడీఏ పరిధిలో 25 ఆశ్రమ పాఠశాలలు
కేఆర్‌పురం ఐటీడీఏ పరిధిలో 25 గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 12 బాలుర, 13 బాలికల పాఠశాలలు నిర్వహిస్తున్నారు. వీటిలో సుమారు 5 వేల మందికి పైగా గిరిజన విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఈ ఏడాది నుంచి గిరిజన విద్యాలయాల్లో నూతన విద్యావిధానం అమలులోకి రానుంది. ఈ నేపథ్యంలో అధికారులు దీనికి సంబంధించిన కసరత్తును చేస్తున్నారు. ఇటుకులకోట, కొయిదా (బాలురు), రెడ్డికోపల్లి, పులిరామన్నగూడెం ఆశ్రమ పాఠశాలలో 3 నుంచి 7వ తరగతి వరకూ క్లాస్‌లు నిర్వహించనున్నారు.
గతంలో ఇలా
గత చరిత్రను పరిశీలిస్తే ఆశ్రమ పాఠశాలల్లో కేవలం 6వ తరగతి నుంచే అడ్మిషన్లు ఉండేవి. విద్యార్థులు తమ స్వగ్రామాల్లో జీపీఎస్ పాఠశాలలు, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలల్లో 5వ తరగతి వరకూ చదువుకుని ఆ తర్వాతే ఆశ్రమ పాఠశాలల్లో చేరేవారు. అనంతరం వచ్చిన మార్పుల్లో 3వ తరగతి నుంచే విద్యార్థులను ఆశ్రమ పాఠశాలల్లో చేర్పించేలా నిబంధనలను మారుస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. అప్పటి నుంచి ఈ విధానమే అమలు జరుగుతుండగా తాజాగా ఈ ఏడాది మళ్లీ పాత పద్ధతిలోనే అడ్మిషన్లు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు.
గిరిజన విద్యార్థులకు అన్యాయం
గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో కొత్తగా తీసుకువచ్చిన మార్పులతో విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందని గిరిజన సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. ఎంపిక చేసిన పాఠశాలలోనే విద్యార్థులను చేర్పించడం ద్వారా అనేక మంది విద్యార్థులు డ్రాప్‌అవుట్స్‌గా మారిపోతారని వారు ఆరోపిస్తున్నారు. ఈ విధానంపై అధికారులు, ప్రభుత్వం పునరాలోచన చేసి పాత పద్ధతినే అమలు చేయాలని కోరుతున్నారు.
ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన విద్యా సంస్కరణల వల్ల గిరిజన విద్యార్థులకు నష్టం వాటిల్లే అవకాశం ఉంది. కేవలం మూడు పాఠశాలల్లోనే 3వ నుంచి 7వ తరగతి వరకూ ఏర్పాటు చేయడం వల్ల పలు గ్రామాల్లోని గిరిజన విద్యార్థులు చదువులకు దూరమయ్యే ప్రమాదం ఉంది. ఈ విద్యా సంస్కరణలపై ప్రభుత్వం పునరాలోచన చేయాలి.
– ఎస్. రామ్మోహన్, అఖిల భారత ఆదివాసీ వేదిక జాతీయ కన్వీనర్
ఈ విద్యా సంవత్సరం నుంచి ఆశ్రమ పాఠశాలలో కీలకమైన మార్పులు వచ్చినప్పటికీ విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా చదువుకునేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. మూడు పాఠశాలల్లో 3 నుంచి 7 వరకూ విద్యను అభ్యసించేలా ఏర్పాట్లు చేస్తున్నాం. 22 పాఠశాలల్లో 5 నుంచి 10వ తరగతి వరకూ చదువుకునేలా ఏర్పాటు చేస్తున్నాం.
– పి. జనార్థన్‌రావు, డీడీ, కేఆర్‌పురం ఐటీడిఏ, బుట్టాయగూడెం మండలం
ఇకపై ఐదో తరగతి నుంచే ఆశ్రమ బాట
16 ఏళ్లగా కొనసాగుతున్న
3, 4 తరగతుల అడ్మిషన్ల నిలిపివేత
ఈ విద్యా సంవత్సరం నుంచే మార్పులు
గిరిజన విద్యార్థులు నష్టపోతారంటున్న విద్యార్థి సంఘాలు


