● ఇప్పటికే 120 మందికిన్యాయస్థానాల్లో జరిమానాలు
● తల్లిదండ్రులు తమ పిల్లలను అదుపులో ఉంచుకోవాలని వినతి
తణుకు అర్బన్ : పుట్టినరోజంటూ రహదారులపై సంబరాలు చేసుకుంటున్నారా? బాణసంచా కాల్చి కేకులు కట్ చేస్తున్నారా? అయితే మీకోసమే.. పుట్టినరోజు సంబరాలు రహదారులపై చేసుకుంటూ ప్రయాణికులకు ఇబ్బందులు కలిగిస్తున్న అంశాన్ని తణుకు పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. ఇటీవల కాలంలో కొందరు యువత స్నేహితుల పుట్టినరోజును గ్రాండ్‌గా సెలబ్రేషన్స్ చేసుకోవాలనే తపనతో రహదారులపై విచ్చలవిడిగా చేస్తున్న సంబరాలు ప్రయాణికులు, స్థానికులకు ఇబ్బందులకు గు రిచేస్తున్నాయి. దీంతో పోలీసులకు వచ్చిన ఫిర్యాదులను అనుసరించి చట్టపరంగా చర్యలకు దిగారు. గత నెలన్నర రోజుల కాలంలో తణుకులో 120 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరు పరిచి జరిమానాలు వేయించారు. కొందరిపై ఎఫ్‌ఐఆర్‌లు సైతం వేశారు. దీంతో తల్లిదండ్రులు తమ బిడ్డలను పుట్టినరోజును ఇళ్లలోనే చేసుకునేలా చూసుకోవాలని పోలీసులు కోరుతున్నారు.
పుట్టినరోజు సంబరాలకు కేంద్రాలుగా..
తణుకు జాతీయ రహదారి షర్మిష్ట సెంటర్ సర్వీస్ రోడ్డు ప్రాంతంతోపాటు ఎన్టీఆర్ పార్కు, ప్రధాన కూడళ్లు, వెంకటేశ్వర థియేటర్ ప్రాంతాల్లో యువత తమ స్నేహితుల పుట్టినరోజు వేడుకలను నిర్వహిస్తూ హద్దులు దాటే పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఇటీవల తణుకు వెంకటేశ్వర థియేటర్ సెంటర్‌లో నిర్వహించిన పుట్టినరోజు వేడుకల్లో బాణసంచా కాల్చడంతో ద్విచక్రవాహనదారులు, పాదచారులపైకి వెళ్లి దుస్తులు కాలిపోయి ఒంటికి గాయాలయ్యాయి. దీంతో పాటు తణుకు జాతీయ రహదారి షర్మిష్ట సెంటర్ సర్వీసు రోడ్డులో కొందరు యువకులు నిత్యం ఏదో ఒక పుట్టినరోజు వేడుక నిర్వహిస్తూ ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు సృష్టిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో నిలదీసిన ప్రయాణికులపైకి దూసుకువస్తున్న విషయాలు పోలీసుల దృష్టికి వచ్చాయి. అంతేకాకుండా ఈ వేడుకల్లో అదే ప్రాంతాల్లో మద్యం సేవిస్తూ, బైక్ స్టంట్‌లు చేస్తున్న ఆగడాలు కూడా మితిమీరిపోయిన పరిస్థితుల్లో పోలీసులు చర్యలకు దిగారు.
పోస్టర్ విడుదల
స్టేషన్‌కు వస్తున్న ఫిర్యాదులతో విసుగెత్తిన పోలీసులు ఇటీవల కాలంలో 120 మంది యువకులను అదుపులోకి తీసుకుని జరిమానాలు విధించి, కౌన్సెలింగ్‌లు ఇచ్చారు. అంతేకాకుండా వేడుకల్లో ఏర్పడిన తీవ్రతతో కొందరిపై ఎఫ్‌ఐఆర్ కూడా నమోదుచేశారు. దీంతో తణుకు పోలీసు అధికారులు యువత తమ పుట్టినరోజులను తల్లిదండ్రులు, కుటుంబసభ్యుల మధ్య నిర్వహించుకోవాలని తెలిపే పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో బహిరంగంగా నిర్వహించుకోవడం ద్వారా ఏర్పడుతున్న ఇబ్బందులను సైతం చిత్రాల ద్వారా తెలియపరిచారు. ఇకపై ఇలాంటి పనులు నిషేధమని, నిబంధనలు మీరితే చట్టరీత్యా చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇబ్బందులు సృష్టిస్తే టోల్‌ఫ్రీ నంబర్ 112, తణుకు పట్టణ సీఐ 9440796640, పట్టణ ఎస్సై 9154965934 నంబర్లకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని కోరుతున్నారు.


