వ్యసనాలకు బానిసలై చోరీలు | - | Sakshi
Sakshi News home page

వ్యసనాలకు బానిసలై చోరీలు

Jun 5 2026 12:54 AM | Updated on Jun 5 2026 12:54 AM

యలమంచిలి : చెడు వ్యసనాల కోసం దొంగతనాలు చేస్తున్న ఇద్దరిలో ఒకరిని గురువారం అరెస్టు చేసినట్లు నరసాపురం డీఎస్పీ ఎం.సుధాకరరావు తెలిపారు. పాలకొల్లు పోలీస్‌స్టేషన్‌లో గురువారం నిందితుడిని మీడియాకు చూపించారు. నరసాపురం మండలం రుస్తుంబాద గ్రామానికి చెందిన కొత్తపల్లి నరేష్‌, రాజమహేంద్రవరానికి చెందిన గోడి సతీష్‌ కుమార్‌ ఆలియాస్‌ కాకి ఇద్దరు చెడు వ్యసనాలుకు అలవాటు పడి సులభంగా డబ్బులు సంపాదించాలని దొంగతనాలకు అలవాటుపడ్డారు. గత కొంతకాలంగా వీరిరువురు కలసి పాలకొల్లు, పోడూరు, నరసాపురం, పెనుమంట్ర, కాళ్ల మొదలగు ప్రాంతాల్లో సంచరించి తాళాలు వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని రాత్రి సమయంలో దొంగతనాలు చేస్తున్నారు. వీరిపై పాలకొల్లు రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో 2 నేరాలు, పోడూరు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో 3, నరసాపురం రూరల్‌, పెనుమంట్ర, కాళ్ళ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఒక్కొక్కటి చొప్పున మొత్తం 8 నేరాలు చేశారు. నరసాపురం డీఎస్పీ ఎం సుధాకరరావు పర్యవేక్షణలో ప్రత్యేక బృందం ఈ నెల 3వ తేదీ బుధవారం నరసాపురం మండలం రుస్తుంబాద గ్రామానికి చెందిన కొత్తపల్లి నరేష్‌ను పట్టుకున్నారు. అతని వద్ద నుంచి 142 గ్రాముల బంగారు ఆభరణాలు, 4 కిలోల వెండి వస్తువులు రికవరీ చేశారు. నరేష్‌తో పాటు దొంగతనాల్లో పాల్గొన్న గోడి సతీష్‌ కుమార్‌ (కాకి) పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. కొత్తపల్లి నరేష్‌ పట్టుకోవడంలో చాకచక్యంగా పని చేసిన పాలకొల్లు రూరల్‌ సీఐ గుత్తుల శ్రీనివాస్‌, పాలకొల్లు రూరల్‌ ఎస్సై బొంతు సురేంద్ర కుమార్‌, పోడూరు ఎస్సై కె సుధాకర్‌రెడ్డి, కానిస్టేబుల్స్‌ బాలాజీ, కె.ప్రసాద్‌బాబులను ప్రత్యేకంగా ఎస్పీ అద్నాన్‌ నయీం అస్మీ అభినందించినట్లు ఆయన తెలిపారు.

ఒకరి అరెస్టు, పరారీలో మరొకరు

Advertisement
 
Advertisement
Advertisement