భీమడోలు: జాతీయ రహదారి పాతూరు వద్ద గురువారం చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఓ రైతు మృతి చెందాడు. వివరాల ప్రకారం సూరప్పగూడెం పంచాయతీ పరిధిలోని పాతూరుకు చెందిన రైతు వెజ్జు సత్యనారాయణ(53) ఉదయం సూరప్పగూడెంలోని వ్యవసాయ పనుల నిమిత్తం తన బైక్‌పై వెళ్లాడు. అక్కడ పనులు ముగించుకుని తిరిగి తన స్వగ్రామానికి బైక్‌పై వస్తూ జాతీయ రహదారిని దాటుతుండగా.. నరసాపురం నుంచి ఏలూరు వైపుగా వెళ్తున్న కారు అతివేగం వచ్చి బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రైతు వెజ్జు సత్యనారాయణకు తీవ్ర గాయాలతో అపస్మారక స్థితికి చేరుకున్నాడు. అయితే బైక్‌ను ఢీకొట్టిన కారు పల్టీలు కొట్టి నుజ్జునుజ్జయ్యింది. అతనిని చికిత్స నిమిత్తం నిమిత్తం ఓ ప్రైవేటు అంబులెన్స్‌లో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. పోస్టుమార్టమ్ నిమిత్తం సత్యనారాయణ మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రైతు సత్యనారాయణ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతుని భార్య వెజ్జు సుబ్బలక్ష్మీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు భీమడోలు హెచ్‌సీ సూరిశెట్టి శ్రీనివాసరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


