ఉపాధ్యాయుల ఆందోళన | - | Sakshi
Sakshi News home page

ఉపాధ్యాయుల ఆందోళన

Jun 5 2026 12:54 AM | Updated on Jun 5 2026 12:54 AM

కొయ్యలగూడెం: అన్నమో రామచంద్ర అని ఉపాధ్యాయులు ఉసూరుమన్నారు. గురువారం పరింపూడి జెడ్పీ హైస్కూల్లో సుమారు 250 మంది ఉపాధ్యాయులు మధ్యాహ్న భోజనం కల్పించలేదంటూ ఆందోళన బాటపట్టారు. ఆదివాసి టీచర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు జలగం రాంబాబు మాట్లాడుతూ ఆరు రోజులపాటు ఎఫ్‌ఎల్‌ఎన్‌ శిక్షణ తరగతులు తీసుకోవడానికి వచ్చిన తమకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. అయితే భోజనాన్ని అరకొరగా ఏర్పాటు చేయడంతో సగం మంది ఆకలితో అలమటించాల్సి వచ్చిందన్నారు. దీంతో కొయ్యలగూడెంలోని హోటల్స్‌కి వెళ్లి భోజనాలు చేసి అనంతరం శిక్షణ తరగతులకు హాజరు కావాల్సిన దుస్థితి అధికారులు కల్పించారని ఆరోపించారు. ఏ మండలానికి ఆ మండలంలోని శిక్షణ తరగతులు ఏర్పాటు చేయాలన్నారు. అసలే ఎండలు తీవ్రంగా ఉండడంతో ఉపాధ్యాయులు రాకపోకలు సాగించడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వడదెబ్బలకు గురి అవుతున్నారన్నారు. తమకు వసతి సౌకర్యం భోజన సౌకర్యం అరకొరగా కల్పించడంపై ఆందోళన చేసి శిక్షణ తరగతులను బహిష్కరించారు. ఇప్పటికై నా మిగిలిన రోజులలో ఉపాధ్యాయులకు సరైన వసతి సౌకర్యాలు కల్పించాలని ఉపాధ్యాయులు నినాదాలు చేశారు.

రైలు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి

ఏలూరు టౌన్‌: ఒక గుర్తు తెలియని వ్యక్తి రైలు నుంచి జారిపడి మృతిచెందాడు. ఏలూరు నగరంలోని సర్‌ సీఆర్‌ఆర్‌ అటానమస్‌ కళాశాల వెనుక వైపు రైల్వే ట్రాక్‌ సమీపంలో మృతదేహాన్ని గురువారం స్థానికులు గుర్తించారు. ఆలస్యంగా వెలుగు చూడటంతో మృతదేహాం కుళ్ళిన స్థితిలో ఉందని రైల్వే పోలీసులు చెబుతున్నారు. సంఘటనా స్థలానికి వెళ్ళిన రైల్వే పోలీస్‌ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. మృతుడి వయస్సు సుమారు 35 నుంచి 40 ఏళ్ల మద్య ఉంటుందని భావిస్తున్నారు. నలుపు రంగు షర్ట్‌, బ్రౌన్‌ కలర్‌ గళ్ళ చొక్కా ధరించి ఉన్నాడని రైల్వే పోలీసులు తెలిపారు. వివరాలు తెలిసిన వారు ఏలూరు రైల్వే ఎస్సై కృపాదానాన్ని సంప్రదించాలని కోరారు. మరిన్ని వివరాలకు 94404 11000నంబర్‌కు ఫోన్‌ చేయాలని కోరారు.

గుర్తుతెలియని వృద్ధురాలి మృతి

ఏలూరు టౌన్‌: స్థానిక రైల్వే ఫ్లైఓవర్‌ బ్రిడ్జి కింద గుర్తు తెలియని ఒక వృద్ధురాలు గురువారం రైలు ఢీకొని మృతి చెందింది. మృతురాలి వయస్సు సుమారు 75 సంవత్సరాలకు పైబడి ఉండవచ్చని, 5.5 అడుగుల ఎత్తు, నలుపురంగు శరీర చాయ కలిగి ఉందని తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్‌ మార్చురీకి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement