కై కలూరు: దైవదర్శనానికి వెళ్లి రాత్రి గుడిలో నిద్రించిన మహిళ ఉదయం చూసేసరికి మరణించిన ఘటన కృష్ణాజిల్లా మోపిదేవి సుబ్రహ్మేణ్యేశ్వర ఆలయంలో బుధవారం జరిగింది. మృతురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం కై కలూరు సంతమార్కెట్ సెంటర్‌లో నివసిస్తున్న మానుపాటి శ్రీదేవి(50)కి భర్త మరణించగా కుమార్తె సాయిపూజితకు వివాహమై భీమవరంలో ఉంటుంది. మృతురాలు శ్రీదేవి సమీప గృహాల్లో పనులు చేసుకుని ఒంటరిగా జీవిస్తోంది. ఈమె వివిధ దైవదర్శనాల నిమిత్తం ఆదివారం ఇంటి నుంచి వెళ్లినట్లు బంధువులు చెబుతున్నారు. మంగళవారం పగలు ఎండలో మోపిదేవి సుబ్రహ్మేణ్యేశ్వర ఆలయానికి చేరుకుంది. రాత్రి గుడివద్ద నిద్ర చేసింది. ఆమెకు నిద్ర పట్టక మధ్య రాత్రిలో ఆందోళనతో తిరిగినట్లు సమీప వ్యక్తులు చెబుతున్నారు. బుధవారం మరణించి ఉండటాన్ని భక్తులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. మోపిదేవి ఎస్సై గౌతంకుమార్ శ్రీదేవి మృతదేహానికి అవనిగడ్డ ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం బంధువులు గ్రామంలో దహస సంస్కారాలు పూర్తి చేశారు. శ్రీదేవి పగలు ఎండలో నడవడం వలన వడదెబ్బకు గురై మృతి చెందినట్లు తెలిపారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లాలో అటవీ, అడవి వంటి ప్రాంతాల గుర్తింపు డిజిటలైజ్ పనులు వేగవంతం చేసి నివేదికలు సమర్పించాలని కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో బుధవారం అటవీ భూములు, ప్రాంతాలను గుర్తించి డిజిటలైజ్ ప్రగతిపై కలెక్టర్ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో నోటిఫైడ్ అడవులు, అన్–నోటిఫైడ్ అడవులు, ఆక్రమణలు, చెట్లు లేని భూములు, ప్రైవేట్ తోటల పెంపకంపై డేటా సేకరించాలన్నారు. జలధార– జలహారతి కార్యక్రమంలో భాగంగా భూగర్భ జలాల రీఛార్జ్ షాఫ్ట్‌లు ఏర్పాటుకు అనుకూలమైన ప్రాంతాలను గుర్తించాలని కలెక్టర్ ఆదేశించారు. జలధార– జలహారతిలో కాల్వలు, చెరువులలో పూడికతీత పనులను సక్రమంగా చేపట్టి నీటినిల్వ సామర్థ్యం గతం కన్నా పెరిగేలా చూడాలన్నారు. ఈ నెల రెండవ వారం నుంచి వర్షాలు ప్రారంభం కానున్న దృష్ట్యా, కురిసిన ప్రతి నీటి బొట్టును పరిరక్షించుకునేందుకు పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.


