ఏలూరు రూరల్: కొందరు నాయకులు తనను టీడీపీ నుంచి గెంటేయాలని కుట్ర చేస్తున్నారని ఉమ్మడి పశ్చిమగోదావరి జెడ్పీ చైర్‌పర్సన్ గంటా పద్మశీ ఆరోపించారు. దీనిపై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేసే పిరికివాళ్లం కాదని, ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా ధైర్యంగా ఎదుర్కొంటానన్నారు. బుధవారం జిల్లా పరిషత్ కార్యాలయంలో భర్త ప్రసాద్‌తో కలిసి విలేకర్ల సమావేశం నిర్వహించారు. గతంలో రాజకీయ ప్రత్యర్ధులుగా ఎదుర్కొన్న నాయకులు నేడు అప్రతిష్ట పాలు చేయాలని చూస్తున్నారన్నారు. కొద్దిరోజుల క్రితం ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా ఎన్నికై న ఎమ్మెల్యే బడేటి చంటిని కలిసి శుభాకాంక్షలు చెప్పామని, ఈ సమయంలో కొందరు దెందులూరు నియోజకవర్గ టీడీపీ నాయకులు వైఎస్‌ఆర్‌సీపీ నుంచి వచ్చిన వలస పక్షులు అంటూ గేలి చేస్తూ, పలు పత్రికల్లో వార్తలు రాయించారని గుర్తు చేశారు. పార్టీలో అందరికీ మేం నచ్చాలని లేదని, మాకు కూడా కొందరు నచ్చరన్నారు. బాధ్యతలు చేపట్టిన సీఈఓ నేటికీ చైర్‌పర్సన్‌ను కలవలేదన్నారు. జెడ్పీ ఉద్యోగులు సైతం రెండు వర్గాలుగా విడిపోయి, పాలనను సాగనీయడం లేదన్నారు. ఎవరెన్ని కుట్రలు పన్నిన మా బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తామన్నారు.


