కావాల్సిన వారికే ఉద్యోగాలు | - | Sakshi
Sakshi News home page

కావాల్సిన వారికే ఉద్యోగాలు

Jun 3 2026 12:51 AM | Updated on Jun 3 2026 12:51 AM

న్యూస్‌రీల్‌

ఇది దగా డీఎస్సీ

అక్రమాలపై విచారణ చేయాలి

హారిజాంటల్‌ రిజర్వేషన్‌ ఉద్యోగాన్ని దూరం చేసింది

డీఎస్సీలో నూతన విధానంపై రచ్చ

అన్నీ అవకతవకలే అంటూ అభ్యర్థుల నిరసన

పట్టించుకోని ప్రభుత్వం

బుధవారం శ్రీ 3 శ్రీ జూన్‌ శ్రీ 2026

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): డీఎస్సీ కోసం సంవత్సరాలుగా ఎదురుచూసిన అభ్యర్థులకు ప్రభుత్వం ఝలక్‌ ఇచ్చింది. గత ఏడాది జరిగిన డీఎస్సీ అంతా తప్పుల తడకగా నిర్వహించి ప్రభుత్వం పారదర్శకతను ప్రశ్నార్థకం చేసింది. కూటమి ప్రభుత్వం ఏర్పడితే తొలి సంతకం డీఎస్సీ ఫైలుపైనే అని చెప్పిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత డీఎస్సీని పక్కకు పెట్టేశారు. నిరుద్యోగులు, యువత నుంచి వచ్చిన తీవ్ర వ్యతిరేకతకు భయపడి ఎట్టకేలకు గత ఏడాది చివర్లో డీఎస్సీ ప్రకటించింది. అభ్యర్థులు ఆశించిన మేరకు డీఎస్సీ పారదర్శకంగా మాత్రం జరగలేదని అప్పట్లోనే పలువురు నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం అవేమీ పట్టించుకోకుండా డీఎస్సీని నిర్వహించడం, అనంతరం తమకు కావాల్సిన వారికి, డబ్బులిచ్చిన వారికి ఉద్యోగాలు కట్టబెట్టిందని.. డీఎస్సీలో తప్పక ఉద్యోగం వస్తుందని ఆశించిన ఎంతోమంది నిరుద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

అన్నీ అవకతవకలే అంటూ నిరసన

కూటమి ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీ అంతా అవకతవకలేనని అభ్యర్థులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. డిస్ట్రిక్ట్‌ సెలక్షన్‌ కమిటీ ఆధ్వర్యంలో జిల్లాకు సంబంధించిన ఉద్యోగాల ఎంపిక జరగాల్సి ఉండగా, అందుకు భిన్నంగా ఈ డీఎస్సీలో జిల్లా సెలక్షన్‌ కమిటీ నామమాత్రపు పాత్రే పోషించిందని, ఎంపికలన్నీ రాష్ట్ర స్థాయిలోనే చేశారనే విమర్శలు కూడా వచ్చాయి. ఎంపికలన్నీ ముఖ్యనేత కనుసన్నల్లో డబ్బులిచ్చిన వారినే ఎంపిక చేసేలా సింగిల్‌ విండో ప్రాతిపదికన నిర్వహించి సొమ్ములు దండుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ డీఎస్సీలో అక్రమాలు జరిగాయి అని చెప్పడానికి స్పోర్ట్స్‌ కోటానే చక్కని నిదర్శనం అంటున్నారు. విచిత్రంగా విద్యా శాఖకు ఎటువంటి సంబంధం లేకుండా స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ (శాప్‌) పంపిన జాబితాలోని అభ్యర్థులనే ఉద్యోగాలకు ఎంపిక చేయడం కూడా విమర్శలకు తావిచ్చింది. స్పోర్ట్స్‌ కోటాకు సంబంధించి జిల్లాలో 23 మంది అభ్యర్థులకు రిజర్వేషన్‌ ఉంది. ఎప్పటిలా ఎంపికలు నిర్వహిస్తే ప్రతి ఉద్యోగానికీ 1:3 గానీ, కనీసం 1:2 నిష్పత్తిలో గానీ అభ్యర్థులను పిలవాల్సి ఉంటుంది.

ఈ మేరకు జిల్లాలో కావాల్సిన 23 ఉద్యోగాలకు కేవలం ఒక్కొక్క అభ్యర్థి పేరునే ప్రతిపాదిస్తూ శాప్‌ అధికారులు కేవలం 23 మంది పేర్లతోనే జాబితా పంపడం, ఆ జాబితాలోని వారికే ఉద్యోగాలు దక్కడం కూడా అవకతవకలు జరిగాయనడానికి బలం చేకూర్చుతోంది.

మెగా డీఎస్సీ అంటూ కాలం గడిపిన కూటమి ప్రభుత్వం, ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోవాల్సిన పరిస్థితుల్లో దగా డీఎస్సీగా మార్చేశారు. టెట్‌, డీఎస్సీ లేకుండా స్పోర్ట్స్‌ కోటాలో ఉద్యోగాలివ్వడం ఎంతవరకు సబబు? పారదర్శకంగా చేపట్టాల్సిన డీఎస్సీని స్పోర్ట్స్‌ కోటాలో ఇస్తే నాణ్యతకు కొలమానం ఏముంటుంది? తక్షణమే డీఎస్సీ విషయంలో సీబీఐతో విచారణ జరిపించాలని కోరుతున్నాం.

ఎస్‌.వీ.జాకబ్‌బాబు, వైఎస్సార్‌సీపీ టీచర్స్‌

వింగ్‌ అధ్యక్షుడు, తణుకు అర్బన్‌

డీఎస్సీ 2025లో న్యాయపరమైన, సాంకేతిక సమస్యలను వెంటనే పరిష్కరించాలి. స్పష్టమైన గైడ్‌లైన్స్‌ లేకుండా నోటిఫికేషన్‌ ఇవ్వడం వల్లే డీఎస్సీ నియామకాలు కోర్టు కేసుల గందరగోళంలో చిక్కుకున్నాయి. నియామకాల్లో పూర్తి పారదర్శకత పాటించి, అక్రమాలపై విచారణ జరపాలి. ప్రభుత్వం ఇప్పటికై నా తన మొండివైఖరిని వీడి నిరుద్యోగుల ప్రశ్నలకు సమాధానం చెప్పాలి.

– కోటే వరుణ్‌, భైరవపట్నం, మండవల్లి మండలం

డీఎస్సీలో గతంలో ఎన్నడూ లేని విధంగా కూటమి ప్రభుత్వం ఈ దఫా డీఎస్సీలో హారిజాంటల్‌ రిజర్వేషన్‌ విధానాన్ని తెరపైకి తీసుకొచ్చింది. ఈ విధానంలో మహిళలు, దివ్యాంగులు, వివిధ క్రీడల్లో ప్రతిభ చూపిన వారు, ఎక్స్‌–సర్వీస్‌మెన్లను చేర్చారు. సాధారణంగా ప్రతీ డీఎస్సీలో జనరల్‌ కేటగిరీలో ఈ నాలుగు కేటగిరీలకు చెందిన వారు ఉద్యోగాలకు ఎంపికై నా, ఇదే కేటగిరీకి చెందిన ఇతరులకు రిజర్వేషన్‌ వర్తిస్తుంది. కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన హారిజాంటల్‌ రిజర్వేషన్‌ విధానంలో ఈ నాలుగు కేటగిరీలకు చెందిన అభ్యర్థుల్లో ఎవరైనా జనరల్‌ కేటగిరీలో ఉద్యోగం సాధిస్తే ఇక ఆ కేటగిరీలో రిజర్వేషన్‌ ఉండకుండా చేసి ఆయా అభ్యర్థులకు ఉద్యోగాలను దూరం చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement