వెన్నుపోటుకు రెండేళ్లు | - | Sakshi
Sakshi News home page

వెన్నుపోటుకు రెండేళ్లు

Jun 3 2026 12:51 AM | Updated on Jun 3 2026 12:51 AM

ఏలూరు టౌన్‌: టీడీపీ కూటమి అధికారం చేపట్టి రెండేళ్లలో ప్రజలను దారుణంగా మోసం చేస్తూ... తన అసమర్థ పాలనతో ప్రజలను నట్టేట ముంచిందని వైఎస్సార్‌సీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు ధ్వజమెత్తారు. అధికారం చేపట్టిన రెండేళ్లలో ప్రజలకు చేసిందేమీ లేదని, వారి ‘సూపర్‌ సిక్స్‌’ పథకాలు ‘సూపర్‌ ఫాల్స్‌’గా మారాయని విమర్శించారు. ఏలూరులోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఏలూరు సమన్వయకర్త మామిళ్లపల్లి జయప్రకాష్‌తో కలిసి ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. చంద్రబాబు పాలనతో ప్రజలు ఏవిధంగా నష్టపోయారో వివరిస్తూ... రెండేళ్ల వెన్నుపోటుపై ప్రత్యేకంగా రూపొందించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా డీఎన్నార్‌ మాట్లాడుతూ.. సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు అండ్‌ కో ప్రజలకు ఇచ్చిన హామీలు, మేనిఫెస్టోను అమలు చేయకుండా ఏవిధంగా మాయచేశారో ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. నిరుద్యోగ యువత, రైతన్నలు, మహిళలు, విద్యార్థులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలను ఎంత దారుణంగా మోసం చేశారో ప్రజలు గుర్తించాలని కోరారు.రాష్ట్రంలోని రైతన్నలకు కేంద్రంతో సంబంధం లేకుండా రూ.20 వేల ఆర్థిక సాయం చేస్తూ ఆదుకుంటానని నమ్మబలికారని, తీరా అధికారంలోకి వచ్చాక రైతులకు తీవ్ర ద్రోహం చేశారని మండిపడ్డారు. కనీసం పంటలకు గిట్టుబాటు ధర కల్పించకుండా నిర్లక్ష్యం ప్రదర్శించారన్నారు. బ్యాంకు రుణాలు తీర్చలేక, తుఫానుల పంట నష్టపరిహారం, బీమా సదుపాయం లభించక రైతులు దైన్యస్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గోదావరి జిల్లాల్లో ఆక్వా రైతుల పాట్లు వర్ణనాతీతంగా ఉన్నాయని, టీడీపీ హామీలు ఏమయ్యాయో తెలియని దుస్థితి ఏర్పడిందన్నారు.

మహిళలను మోసగించారు

మహిళల దృష్టిలో చంద్రబాబు నయవంచకుడిగా మారారని ఆరోపించారు. మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మహిళలను ఆర్థికంగా బలోపేతం చేస్తే... చంద్రబాబు వారిని దివాళా తీసేలా చేశారన్నారు. 50 ఏళ్లు నిండిన బీసీ, ఎస్సీ, ఎస్టీలకు పింఛను ఇస్తానని మోసం చేశారన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఆడబిడ్డకూ నెలకు రూ.1,500 ఇస్తామని చెప్పి హ్యాండిచ్చారని, గతంలో జగన్‌ ఏటా ఇచ్చిన రూ.18,750 పథకానికి చంద్రబాబు పూర్తిగా ఎగనామం పెట్టారని గుర్తుచేశారు. నిరుద్యోగ యువత భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తూ ఎన్నికల హామీలపై నీళ్లు చల్లారని విమర్శించారు. ఏటా జనవరిలో జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తామని నిరుద్యోగులను నమ్మించి మోసం చేశారన్నారు. ఉద్యోగ కల్పన లేకుంటే ప్రతి నెలా రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామన్న హామీని రెండేళ్లు కావస్తున్నా నెరవేర్చలేదని నిలదీశారు.

చంద్రబాబు మోసాలపై ఉద్యమబాట

కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజాసంఘాలు, ఉద్యోగ సంఘాలతో కలిసి ఉద్యమిస్తామని డీఎన్‌ఆర్‌ స్పష్టం చేశారు. ఈ నెల 4వ తేదీ నుంచి 12వ తేదీ వరకు ప్రజల పక్షాన పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ప్రకటించారు. జూన్‌ 4న మండల కేంద్రాల్లో టీడీపీ కూటమి మేనిఫెస్టో ప్రతులు, బాబు–పవన్‌ సంతకాల బాండ్ల దగ్ధం, జూన్‌ 8, 9 తేదీల్లో నియోజకవర్గ కేంద్రాల్లో వెన్నుపోటుకు రెండేళ్లు పేరుతో యువత, రైతులు, మహిళలకు బాబు మోసాలపై అవగాహన కల్పించేందుకు రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు, జూన్‌ 12న రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో చంద్రబాబు వెన్నుపోటుకు నిరసనగా భారీ ర్యాలీలు చేపడతారని తెలిపారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ పోలవరం నియోజకవర్గ పరిశీలకుడు కనుమూరి శివాజీ, కై కలూరు పరిశీలకుడు నూకపెయ్యి సుధీర్‌బాబు, చింతలపూడి పరిశీలకుడు దాసరి రమేష్‌, జెడ్పీ వైస్‌ చైర్మన్‌ పెనుమాల విజయ్‌బాబు, వడ్డీల కార్పొరేషన్‌ అధ్యక్షుడు ముంగర సంజయ్‌కుమార్‌, జిల్లా అధికార ప్రతినిధి మున్నుల జాన్‌గురునాథ్‌, వైఎస్సార్‌టీయూ జిల్లా అధ్యక్షులు పల్లి శ్రీనివాస్‌, ఏలూరు నగర అధ్యక్షుడు గుడిదేశి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

ఈ నెల 4 నుంచి 12 వరకు వైఎస్సార్‌సీపీ పోరుబాట

యువత, రైతులు, మహిళలతో ఆందోళనలు

పోస్టర్‌ ఆవిష్కరించిన జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు

Advertisement
 
Advertisement
Advertisement