కూటమిది దగా డీఎస్సీ | - | Sakshi
Sakshi News home page

కూటమిది దగా డీఎస్సీ

Jun 2 2026 3:06 AM | Updated on Jun 2 2026 3:06 AM

కూటమిది దగా డీఎస్సీ నిరుద్యోగులను దగా చేస్తారా? వ్యవస్థలను నిర్వీర్యం చేశారు

ఏలూరు టౌన్‌ : కూటమి ప్రభుత్వానిది మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ అంటూ వైఎస్సార్‌సీపీ శ్రేణులు గళమెత్తాయి. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో సోమవారం ఏలూరులో వైఎస్సార్‌సీపీ జిల్లా యువజన అధ్యక్షుడు కామిరెడ్డి నాని ఆధ్వర్యంలో డీఎస్సీ–25 అవినీతి కుంభకోణంపై భారీ ధర్నా చేపట్టారు. ముఖ్య అతిథులుగా వైఎస్సార్‌సీపీ యువజన విభాగం రీజనల్‌ కో–ఆర్డినేటర్‌, ఏలూరు పార్లమెంట్‌ ఇన్‌చార్జి కారుమూరి సునీల్‌కుమార్‌, ఏలూరు నియోజకవర్గ సమన్వయకర్త మామిళ్లపల్లి జయప్రకాష్‌, యువజన విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి కందుల దినేష్‌రెడ్డి హాజరయ్యారు.

భారీ ర్యాలీ.. బైఠాయింపు

వైఎస్సార్‌సీపీ నాయకులు ఏలూరు ఎన్‌ఆర్‌పేట ప్రధాన రహదారి నుంచి భారీ ర్యాలీగా ఏలూరు కలెక్టరేట్‌ ధర్నా చౌక్‌ వరకూ వెళ్లారు. అనంతరం రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ అంటూ పెద్దెత్తున నినాదాలు చేశారు. రూ.15 లక్షలకు స్పోర్ట్స్‌ కోటాలో పోస్టుల బేరాలా?, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగికి డీఎస్సీ లో మొదటి ర్యాంకు ఎలా వచ్చింది?, డేటా ఎందుకు డిలీట్‌ చేశారు, మెరిట్‌ లిస్ట్‌ ఎందుకు దాచారు అంటూ ప్రశ్నలతో కూడిన ప్లకార్డులను ప్రదర్శిస్తూ టీడీపీ ప్రభుత్వ అవినీతిని ఎండగట్టేలా ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. జిల్లావ్యాప్తంగా ఏడు నియోజకవర్గాల నుంచి హాజరైన వైఎస్సార్‌సీపీ యువజన విభాగం మండల అధ్యక్షులు, కార్యదర్శులు, ఉపాధ్యక్షులు, గ్రామ యువజన కమిటీల నేతలు భారీ సంఖ్యలో హాజరై ప్రభుత్వ విధానాలపై తమ అసంతృప్తిని చాటుకున్నారు. నిరుద్యోగ యువత సైతం పెద్దసంఖ్యలో ధర్నాకు హాజరై తమ మద్దతు తెలిపారు. అనంతరం పార్టీ ముఖ్యనేతలు కలెక్టర్‌ వెట్రిసెల్వికి వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు నగర అధ్యక్షుడు గుడిదేశి శ్రీనివాసరావు, బీసీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు నెరుసు చిరంజీవి, ఎస్సీ సెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూకపెయ్యి సుధీర్‌బాబు, క్రిస్టియన్‌ మైనార్టీ జిల్లా అధ్యక్షుడు పిల్ల చరణ్‌, ఎస్సీసెల్‌ జిల్లా అధ్యక్షుడు తేరా ఆనంద్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆళ్ల సతీష్‌చౌదరి, ఏడు నియోజకవర్గాల నుంచి యువజన విభాగం అధ్యక్షులు, కమిటీ సభ్యులు హాజరయ్యారు.

రాష్ట్రంలోని సుమారు 3 లక్షల మంది నిరుద్యోగ గ్రాడ్యుయేట్ల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోంది. డీఎస్సీ–25లో ప్రశ్నపత్రాల లీకేజీ, డేటా డిలీషన్‌, మెరిట్‌ లిస్ట్‌ల మాయం వంటి అక్ర మాలపై ప్రభుత్వం సమాధానం చెప్పడం లేదు. పైగా అవినీతిని ప్రశ్నిస్తే క్రిమినల్‌ కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. విద్యాశాఖ మంత్రి లోకేష్‌ పరిధిలోనే ఇన్ని అక్రమాలు జరుగుతున్నా పట్టించుకోకపోవడం దారుణం. విచారణ పూర్తయ్యే వరకు ఆయన్ను మంత్రి పదవి నుంచి పక్కన పెట్టాలి. నిజంగా ప్రభుత్వం అవినీతికి పాల్పడకపోతే విచారణకు ఎందుకు భయపడుతున్నారు? డబ్బులు ముట్టజెప్పిన వారికే ఉద్యోగాలు కల్పించడం నిరుద్యోగులను దగా చేయడం కాదా.

– కారుమూరి సునీల్‌కుమార్‌, యువజన విభాగం రీజనల్‌ కో–ఆర్డినేటర్‌, ఏలూరు పార్లమెంట్‌ ఇన్‌చార్జి

వ్యవస్థలను గుప్పిట్లో పె ట్టుకుని టీచర్‌ పోస్టుల భర్తీ పేరుతో రాష్ట్రంలోని లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాల్లో టీడీపీ ప్రభుత్వం చెలగాటం ఆడుతోంది. ఉపాధ్యాయ పోస్టుల భర్తీ పేరుతో నిరుద్యోగుల జీవితాలను అంధకారం చేస్తున్నారు. కలెక్టర్‌ చైర్మన్‌గా, విద్యాశాఖాధికారి కన్వీనర్‌గా ఉండే జిల్లా సెలెక్షన్‌ కమిటీ (డీఎస్సీ) పాత్రను పూర్తిగా నిర్వీర్యం చేశారు. ‘తొలి సంతకం’ అంటూ ప్రచారం చేసుకున్నది కేవలం తమ అవినీతి కోసమేనని తేలిపోయింది. ఈ బోగస్‌ డీఎస్సీ అక్రమాలపై నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో పోరాటం కొనసాగిస్తాం. రాష్ట్రంలో అర్హులైన నిరుద్యోగులకు న్యాయం చేయండి.

– కందుల దినేష్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి

వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను కలెక్టరేట్‌లోకి వెళ్లనీయకుండా అడ్డుకుంటున్న పోలీసులు

కలెక్టర్‌ వెట్రిసెల్వికి వినతిపత్రం అందిస్తున్న నాయకులు

డీఎస్సీ–25పై సీబీఐతో సమగ్ర దర్యాప్తునకు డిమాండ్‌

రాష్ట్రంలో 4 వేల మంది అభ్యర్థులకు అన్యాయం

ఏలూరు కలెక్టరేట్‌ వద్ద నిరసన

వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలతో భారీ ర్యాలీ

Advertisement
 
Advertisement
Advertisement