భీమడోలు: బస్సు ఫుట్‌పాత్ నుంచి జారిపడి ఓ మహిళ దుర్మరణం పాలైన ఘటన సోమవారం భీమడోలు బస్టాండ్‌లో చోటుచేసుకుంది. గణపవరంనకు చెందిన గేదెల అనంతలక్ష్మి (41) జీవనోపాధి నిమిత్తం భర్త, పిల్లలతో తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం అనంతపల్లిలో నివసిస్తోంది. గత కొంతకాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్న ఆమె భీమడోలు జంక్షన్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం పొందుతోంది. ఈ క్రమంలో సోమ వారం తన కుమార్తె చింతా శృతితో కలిసి ఆస్పత్రికి వచ్చి మందులు తీసుకుని తిరిగి అనంతపల్లికి వెళ్లేందుకు భీమడోలు బస్టాండ్‌కు వచ్చారు. రాజమండ్రి బస్సు సర్వీసులు తక్కువగా ఉండడంతో గంటల తరబడి వేచి చూశారు. ఎట్టకేలకు వచ్చిన బస్సు ప్రయాణికులతో రద్దీగా ఉండటంతో ఆనంతలక్ష్మి బస్సు ఎక్కి ఫుట్‌పాత్‌పై నిలబడింది. కుమార్తె బస్సు ఎక్కలేదు. ఈలోపు బస్సు వేగంగా ముందుకు కదలడంతో ఒక్కసారిగా ఫుట్‌పాత్‌పై నుంచి అనంతలక్ష్మి జారి పడింది. ఇంతలోనే ఆమె పొట్ట పైనుంచి బస్సు వెనుక చక్రాలు వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందింది. కళ్లేదుటే తల్లి మరణం చూసిన కుమార్తె శృతి కన్నీరుమున్నీరుగా విలపించింది. సమాచారం అందుకున్న భీమడోలు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆనంతలక్ష్మి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతురాలి భర్త నరసింహమూర్తి ఫిర్యాదు మేరకు భీమడోలు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కొవ్వూరు ఆర్టీసీ డీఎం బస్టాండ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంపై ప్రయాణికులను విచారించారు.
ఆస్పత్రికి వచ్చి తిరిగి వెళుతుండగా ప్రమాదం


