ఉంగుటూరు: ఉంగుటూరు మండలం నల్లమాడు ఆయకట్టు ప్రాంతంలోని జీడిమామిడి తోటల్లో తల్లి గంటా అంథోబాయి (60), కుమార్తె వెంకటలక్ష్మి (47) హత్యలకు సంబంధించి మృతదేహాలకు అధికారులు సోమవారం శవపంచనామా నిర్వహించారు. ఏలూరు డీఎస్పీ శ్రావణకుమార్ నేతృత్వంలో చేబ్రోలు ఎస్సై సూర్యభగవాన్, సీఐ రజనీకుమార్, నల్లమాడు, ఎ.గోకవరం వీఆర్వోలు నాగరాజు, భారతి శవపంచనామాలో పాల్గొన్నారు.
ముమ్మర దర్యాప్తు
కేసు దర్యాప్తులో భాగంగా పోలీసు జాగిలాలు ఘ టనా ప్రదేశం నుంచి వెనుక వైపు ఉన్న పొలాల్లోకి వెళ్లి ఆగిపోయాయి. అంధురాలు వెంకటలక్ష్మిని ముందుగా హతమార్చగా.. తల్లి అంథోబాయి పారిపోయే ప్రయత్నం చేయగా ఆమెనూ హతమార్చినట్టు తెలుస్తోంది. రెండు మృతదేహాలు సుమారు 50 మీటర్ల దూరంలో పడి ఉండటాన్ని బట్టి ఇది అర్థమవుతోంది. క్లూస్ టీము ఎస్సై ఆనందబాబు, శంకరరావు ఘటనా ప్రదేశాలను పరిశీలించారు. నాలుగు బృందాలుగా పోలీసులు ఏర్పడి దర్యాప్తు ముమ్మరం చేశారు. త్వరలోనే కేసును ఛేదిస్తామని డీఎస్పీ శ్రావణ్‌కుమార్ తెలిపారు.
అంధుల సంఘాల ఖండన
అంధురాలు వెంకటలక్ష్మిని హతమార్చడాన్ని అంధుల సంఘాల నాయకులు ఖండించారు. విజువల్లీ చాలెంజ్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు జీడీఎస్ వీరభద్రరావు మృతుల కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి హత్యలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.


