పెద్దింట్లమ్మా.. పాహిమాం | - | Sakshi
Sakshi News home page

పెద్దింట్లమ్మా.. పాహిమాం

Jun 1 2026 1:08 AM | Updated on Jun 1 2026 1:08 AM

పెద్దింట్లమ్మా.. పాహిమాం వనదేవతా.. నమోస్తుతే కాళ్లకూరు వెంకన్నకు రూ.3 లక్షల విరాళం పేకాట శిబిరంపై పోలీసుల మెరుపుదాడి నిలిచిన సత్యసాయి శుద్ధి జలాల సరఫరా

కైకలూరు: అమ్మా.. పెద్దింట్లమ్మా.. నీ చల్లని దయ మాపై చూపవమ్మా.. అంటూ భక్తులు ఆర్తితో కొల్లేటికోట పెద్దింట్లమ్మను వేడుకున్నారు. సమీప జిల్లాల నుంచి వేసవి సెలవులు ముగియనుండటంతో వేలాదిగా భక్తులు అమ్మవారిని ఆదివారం దర్శించకున్నారు. అమ్మవారికి మహిళలు వేడి నైవేద్యాలు సమర్పించారు. ఆలయ ఉప ప్రధాన అర్చకుడు పేటేటి పరమేశ్వర శర్మ ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఆలయ ఈవో కూచిపూడి శ్రీనివాసు మాట్లాడుతూ ఒక్క ఆదివారం అమ్మవారికి ప్రత్యేక, అంతరాలయ దర్శనాలు, కేశఖండన, పెద్ద, చిన్న తీర్థాలు, లడ్డూ ప్రసాదం, గదుల అద్దెలు, అమ్మ ఫొటోల విక్రయం, వాహన పూజలు, విరాళాల ద్వారా రూ.81,206 ఆదాయం వచ్చిందని తెలిపారు.

బుట్టాయగూడెం: బుట్టాయగూడెం మండలం కామవరం సమీపంలో అటవీ ప్రాంతంలో కొలువై ఉన్న గుబ్బల మంగమ్మ గుడికి ఆదివారం భక్తులు పోటెత్తారు. ద్విచక్ర వాహనాలు, ఆటోలు, ప్రత్యేక బస్సుల్లో తెల్లవారుజాము నుంచే భక్తులు అమ్మవారి సన్నిధికి చేరుకున్నారు. అనంతరం దూపదీప నైవేద్యాలతో అమ్మవారికి పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అధికంగా తరలివచ్చిన భక్తుల వల్ల ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ కమిటీ వారితోపాటు పోలీసులు కూడా బందోబస్తు నిర్వహించారు.

కాళ్ల: స్వయంభూ కాళ్ళకూరు శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానం అభివృద్ధి పనులకు ఆకివీడు మండలం ఐ.భీమవరం గ్రామానికి చెందిన దివంగత వేగేశ్న అప్పలరాజు జ్ఞాపకార్థం భార్య నాగమణి, కుమారులు బాపిరాజు, గోపాలకృష్ణంరాజు, ప్రసాదరాజు రూ.3 లక్షలు విరాళం అందించారు. దేవాలయం చుట్టూ మాడవీధుల విస్తరణలో భాగంగా స్థలం కొనుగోలు నిమిత్తం దాతలు ఈ విరాళం అందించినట్లు దేవస్థానం చైర్మన్‌ అడ్డాల శివరామరాజు, ఈవో మోకా అరుణ్‌ కుమార్‌ ఆదివారం తెలిపారు. ఈసందర్భంగా దాతలకు ప్రత్యేక దర్శనం కల్పించి స్వామివారి ప్రతిమతో సత్కరించారు.

నూజివీడు: పట్టణ పరిధిలోని మామిడి తోటల్లో పార్టీ పేరుతో నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై పోలీసులు ఆదివారం మెరుపుదాడి చేశారు. సీఐ పీ సత్యశ్రీనివాస్‌ తెలిపిన వివరాల ప్రకారం విశ్వసనీయ సమాచారం మేరకు సిబ్బందితో కలిసి సీఐ పేకాట శిబిరంపై దాడి చేశారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న 22 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.39,700 నగదును సీజ్‌ చేయడంతో పాటు 18 సెల్‌ఫోన్లు, 13 మోటర్‌ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. పేకాట ఆడుతూ పట్టబడిన వారిపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.

బుట్టాయగూడెం: గిరిజన గ్రామాలకు సరఫరా అవుతున్న సత్యసాయి గోదావరి శుద్ధి నీటి సరఫరా గత మూడు రోజులూగా నిలిచిపోయింది. దీంతో ప్రజలు తాగునీటి కోసం అవస్థలు పడుతున్నారు.గోదావరి నీటి వల్ల కీళ్ల నొప్పులు, ఇతర వ్యాధులు ప్రబలకుండా ఉంటాయనే ఉద్దేశంతో సింగన్నపల్లి, బూసరాజుపల్లి సమీపంలోని సత్యసాయి మెయిన్‌ వాటర్‌ ట్యాంక్‌ నుంచి ప్రజలు గోదావరి శుద్ధి జలాలను తెచ్చుకుని తాగుతున్నారు. అసలే వేసవి కాలం.. ఈ సమయంలో గోదావరి శుద్ధి జలాలు ఆగిపోవడంతో ప్రజల బాధలు వర్ణనాతీతంగా మారాయి. అధికారులు స్పందించి నీటి సరఫరాకు కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు. దీనిపై సత్యసాయి ఉద్యోగులను వివరణ కోరగా కొవ్వాడ, పోలవరం సమీపంలో పైప్‌లైన్‌ల మరమ్మతు పనులు జరుగుతున్నాయని మంగళవారం తిరిగి సత్యసాయి శుద్ధి జలాలను అన్ని గ్రామాలకు అందిస్తామని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement