దెందులూరు: దెందులూరు నియోజకవర్గం పెదపాడు మండలం కొత్తముప్పర్రు గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ మాజీ సర్పంచ్ కోటా గోవర్ధన్ తండ్రి శ్రీరాములు కిడ్నీ సమస్యతో ఇబ్బంది పడుతూ, డయాలసిస్ చేయించుకుంటున్నారు. పూర్తి చికిత్సకు ఖర్చు భారీగా ఉండడంతో, వారు మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి సాయం కోరారు. ఆయన వెంటనే స్పందించి, స్వయంగా శ్రీరాములును మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వద్దకు తీసుకువెళ్లి పరిస్థితిని వివరించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధితుడితో మాట్లాడి, వారికి అండగా నిలబడతామని భరోసా ఇచ్చారు. మెరుగైన చికిత్సకు ఏర్పాట్లు చేసే బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు. వైఎస్సార్‌సీపీ కుటుంబ సభ్యుల కోసం తక్షణమే స్పందించిన అబ్బయ్య చౌదరిని ప్రజలు మెచ్చుకుంటున్నారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లా వ్యాప్తంగా 10వ తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయి. శనివారం నిర్వహించిన భౌతికశాస్త్రం పరీక్షకు 3,734 మందికి గాను 2900 మంది హాజరు కాగా 834 మంది గైర్హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో దూరవిద్యా విధానంలో నిర్వహించిన ఎస్‌ఎస్‌సీ సోషల్ పరీక్షకు మొత్తం 195 మంది విద్యార్థులకు 166 మంది హాజరుకాగా 29 మంది గైర్హాజరయ్యారు. దూరవిద్య ఇంటర్ గణితం పరీక్షకు 93 మందికి 83 మంది హాజరు కాగా 10 మంది గైర్హాజరయ్యారు. చరిత్ర పరీక్షకు 30 మందికి గాను 24 మంది హాజరయ్యారు.
ఏలూరు(టూటౌన్): రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల అసోసియేషన్ ఏలూరు జిల్లా ఎన్నికలు శనివారం ఏలూరు కోటదిబ్బ అసోసియేషన్ హాలులో జరిగాయి. జిల్లా అధ్యక్షుడిగా డి మహాలక్ష్ముడు, ప్రధాన కార్యదర్శిగా జి.గంగాధర్ రావు, కోశాధికారిగా కే పద్మనాభరావు ఎన్నికయ్యారు. జిల్లా అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అసోసియేషన్ సలహా మండలి సభ్యులుగా టి.రామారావు, ఆర్.వెంకటేశ్వర్లు, ఏ.అప్పలరాజును ఎన్నుకున్నారు.
జంగారెడ్డిగూడెం: గుర్వాయిగూడెంలో వేంచేసియున్న మద్ది ఆంజనేయస్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. ధర్మకర్తల మండలి అధ్యక్షుడిగా రాజన సత్యనారాయణ(పండు), సభ్యులుగా ఓబిళ్ళనేని సూర్యభవాని, చింతపల్లి రత్నసురేష్, ధూళిపాళ్ల సూర్యచంద్ర ప్రభాకరరావు, వల్లూరి సునీత, జగన్నాథం వెంకటమ్మ, తిరుమలశెట్టి నాగ వరలక్ష్మి, దూనబోయిన నారాయణమూర్తి, గెడా దుర్గా హరిసాగర్, నడిపల్లి విద్యాధర్, ఆరుగొల్లు సావిత్రిలు ప్రమాణస్వీకారం చేశారు. దేవస్థానం సీనియర్ అర్చకులు వెంకటాచార్యులు ఎక్స్‌అఫిషియో మెంబరుగా ప్రమాణస్వీకారం చేశారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ పరీక్షలకు శనివారం ప్రథమ, ద్వితీయ సంవత్సరాల విద్యార్థులు మొత్తం 1,846 మంది హాజరయ్యారు. ఉదయం 29 కేంద్రాల్లో ప్రథమ సంవత్సరం విద్యార్థులకు నిర్వహించిన కామర్స్–1 పరీక్షకు 688 మంది జనరల్ విద్యార్థులకు 605 మంది హాజరు కాగా మధ్యాహ్నం ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు నిర్వహించిన ఫిజిక్స్–2 పరీక్షకు 1396 మంది జనరల్ విద్యార్థులకు 1241 మంది హాజరు కాగా 155 మంది గైర్హాజరయ్యారు.


