● వైఎస్సార్‌సీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు డీఎన్నార్ ● బీఎల్‌ఏలకు ‘సర్’ ప్రక్రియపై అవగాహన
కై కలూరులో సర్‌పై అవగాహన సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా అధ్యక్షుడు డీఎన్నార్. సమావేశానికి హాజరైన బీఎల్‌ఏలు, నాయకులు
కై కలూరు: కూటమి ప్రభుత్వం మన ఓట్లును కొల్లగొట్టడానికి ‘సర్’ను ఆయుధంగా ఉపయోగించడానికి ప్రయత్నిస్తోందని, వైఎస్సార్‌సీపీకి బీఎల్‌ఏలు పెద్ద బలని, బూత్ స్థాయి నుంచి సైనికుల్లా పనిచేయాలని వైఎస్సార్‌సీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు(డీఎన్నార్) బీఎల్‌ఏలకు దిశానిర్దేశం చేశారు. పార్టీ నియోజకవర్గ బూత్ లెవల్ ఏజెంట్స్‌కు సర్ ప్రక్రియపై అవగాహన సమావేశం కై కలూరు సీతారామ ఫంక్షన్ హాలులో శనివారం జరిగింది. జిల్లా అధ్యక్షుడు డీఎన్నార్ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఆకట్టుకున్న పవర్ పాయింట్ ప్రజంటేషన్
ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ(సర్)పై పార్టీ కేంద్ర కార్యాలయ రాష్ట్ర కార్యదర్శి, సర్ జిల్లా ఇన్‌చార్జి పోతుల శివారెడ్డి, కోఆర్డినేటర్ బీవీఆర్ చౌదరిలు సర్ ప్రక్రియలో తీసుకోవల్సిన జాగ్రత్తలపై చెప్పిన పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఆకట్టుకుంది. బీఎల్‌ఏలు 45 రోజులు దీక్షలా ఓట్లను పరిశీలించాలని చెప్పారు. రెండు, మూడు ఓట్ల తేడాతో ముఖ్యమంత్రుల పీఠం కోల్పోయిన ఘటనలను వివరించారు. జూన్ 15 నుంచి జూలై 14 వరకు ఓటర్ల వెరిఫికేషన్ కార్యక్రమం జరుగుతుందన్నారు. కై కలూరు నియోజకవర్గంలో రాష్ట్రంలోనే అత్యధికంగా 19,000 మంది పార్టీ కేడర్ ఉందన్నారు. నియోజకవర్గ సర్ పరిశీలకులుగా డీ.నారాయణను నియమించారన్నారు. బీఎల్‌ఏలు ఓట్లు తొలగింపు, మార్పుల విషయంలో తుది సంతకం నియోజకవర్గ ఇన్‌చార్జితో సంప్రదించి చేయాలన్నారు. ఓటరు వద్దకు ముందుగానే వెళ్ళి కావాల్సిన గుర్తింపు కార్డులు, కలర్ ఫొటోలు, ధరఖాస్తులపై అవగాహన కల్పించాలన్నారు. అనంతరం చంద్రబాబు వెన్నుపోటు పాలనపై ఇటీవల ముద్రించిన పుస్తకంలో విషయాలను వివరించారు.
భారీగా తరలివచ్చిన బీఎల్‌ఏలు, పార్టీ నాయకులతో కై కలూరు సీతారామ ఫంక్షన్ హాలు కిక్కిరిసింది. ఎండను లెక్క చేయకుండా భారీగా తరలివచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ముదిరాజుల సంఘ విభాగ అధ్యక్షుడు కోమటి విష్ణువర్థనరావు, ఎంపీపీలు రామిశెట్టి సత్యనారాయణ, పెద్దిరెడ్డి శ్రీరామదుర్గాప్రసాద్, రాష్ట్ర పార్టీ నాయకులు గుమ్మడి వెంకటేశ్వరరావు, సయ్యపురాజు గుర్రాజు, గంటా సంధ్య, ఐనాల బ్రహ్మాజీ, బలే నాగరాజు, గాదిరాజు కిట్టు, గాలిబ్‌బాబు, ముదినేపల్లి జెడ్పీటీసీ సభ్యురాలు ఈడే వెంకటేశ్వరమ్మ, రాచూరి రాధా, రఫీ, మేరీ నవరత్నకుమారి తదితరులు పాల్గొన్నారు.


