మాజీ ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు
నూజివీడు: ఆగిరిపల్లి మండలంలోని శోభనాపురానికి చెందిన వైఎస్సార్‌సీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు నక్కనబోయిన సాంబశివరావుపై శనివారం జరిగిన హత్యాయత్నాన్ని మాజీ ఎమ్మెల్యే, నూజివీడు నియోజకవర్గ ఇన్‌చార్జి మేకా వెంకట ప్రతా్‌ప్ అప్పారావు తీవ్రంగా ఖండించారు. పట్టణంలోని ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సాంబశివరావును పరామర్శించారు. ఆసుపత్రి ఆర్‌ఏంఓ డాక్టర్ శ్రీనివాస్‌ను, వైద్యురాలు తనూజను అడిగి సాంబశివరావు పరిస్థితి తెలుసుకున్నారు. ఆయన విలేకర్లతో మాట్లాడుతూ దాడి చేయించిన నక్కనబోయిన వేణు గ్రామ టీడీపీ అధ్యక్షుడని, ఆగిరిపల్లి మండలంలో ఉన్న కొండలన్నింటిని దోచేసి కనుమరుగు చేస్తున్నాడంటూ అనేక మంది ఫిర్యాదులు చేస్తున్నారన్నారు. మట్టిని దోచేస్తున్న అనకొండ అనే పోస్ట్ ను సాంబశివరావు షేర్ చేశాడని, దీనికే రౌడీయిజం చేస్తూ దాడిచేసి చంపే ప్రయత్నం చేశారన్నారు. నూజివీడు నియోజకవర్గం ప్రశాంతమైన ఏరియా అని ఇలా దాడి జరగడం ఇదే ప్రథమమని అన్నారు. బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు ఎలాంటి అన్యాయం జరిగినా తాను ఊరుకోనని ఇటీవలే మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారని, ఇప్పుడు టీడీపీ వాళ్లే ఇలా దాడి చేయడం హేయమన్నారు. ఈ సంఘటనపై పోలీసులు తాత్సారం చేయకుండా దాడి చేయించిన నక్కనబోయిన వేణు, దాడి చేసి చంపడానికి ప్రయత్నించిన దొండపాటి ఇంద్రపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని మేకా వెంకట ప్రతాప్ అప్పారావు డిమాండ్ చేశారు. ఆయన వెంట పట్టణ అధ్యక్షులు శీలం రాము, మున్సిపల్ విభాగం అధ్యక్షులు మలిశెట్టి బాబీ, ఏలూరు జిల్లా అధికార ప్రతినిధి కంచర్ల లవకుమార్, తదితరులు పాల్గొన్నారు.


