నవధాన్యాల సాగు మేలు | - | Sakshi
Sakshi News home page

నవధాన్యాల సాగు మేలు

May 31 2026 1:06 AM | Updated on May 31 2026 1:06 AM

నవధాన్యాల సాగు మేలు

ఏలూరు (టూటౌన్‌): ప్రకృతి వ్యవసాయ విధానంలో నవధాన్యాల సాగు ఎంతో మేలు చేస్తుందనే అంశంపై రైతులకు అవగాహన కలిగించాలని కలెక్టర్‌ కె. వెట్రిసెల్వి చెప్పారు. ఎల్‌నినో తీవ్ర ప్రభావం – ప్రకృతి సాగు ఆవశ్యకతపై అవగాహన కరపత్రాన్ని శనివారం కలెక్టరేట్‌లో కలెక్టర్‌ ఆవిష్కరించారు. సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ నవధాన్యాల సాగు ద్వారా వర్షాభావ పరిస్థితులను తట్టుకునే శక్తి పెరుగుతుందని, తక్కువ నీటితోనే సాగు సాధ్యమవుతుందని పేర్కొన్నారు. జిల్లాలో 2,55,816 మంది పింఛనుదారులకు జూన్‌ నెలకు రూ.113.29 కోట్లు పంపిణీ చేస్తారని, 1వ తేదీన 100 శాతం పంపిణీకి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

అవకతవకలకు పాల్పడితే సస్పెన్షన్‌

జిల్లాలో జలధార– జలహారతి కార్యక్రమంలో అవకతవకలకు పాల్పడితే సస్పెన్షన్‌ తప్పదని కలెక్టర్‌ హెచ్చరించారు. పోలవరం నియోజకవర్గంలోని ఏడు మండలాలు, చింతలపూడి నియోజకవర్గం చింతలపూడి, టి.నర్సాపురం మొత్తం తొమ్మిది మండలాలు వారీగా పనుల ప్రగతిపై కలెక్టరు సమీక్షించారు. జలధార–జలహారతి కాల్వలు, చెరువులలో పూడికతీత పనులను సక్రమంగా చేపట్టడం లేదని తన దృష్టికి వచ్చిందన్నారు. ఎంపీడీఓలు, డ్వామా, ఇరిగేషన్‌ అధికారులు నిబంధనల మేరకు పూర్తి అయ్యాయా లేదా అన్నది పరిశీలించకుండా, కేవలం 6 అంగుళాలు పూడికతీత పనులను కూడా పనులు పూర్తయినట్లుగా చూపిస్తున్నారన్నారు. జలధార– జలహారతి కార్యక్రమంలో నిర్లక్ష్యం, అలసత్వం వ్యవహరిస్తే శాఖా పరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో వ్యవసాయశాఖ పీడీ హబీబ్‌బాషా, డ్వామా పీడీ కె.వెంకట సుబ్బారావు, ప్రకృతి వ్యవసాయ విభాగం జిల్లా పీడీ బీ. వెంకటేష్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement