బుట్టాయగూడెం: రైతుల పంటలకు మద్దతు ధరల పెంపు మోసపూరితమని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్ ఆరోపించారు. కేంద్రం ప్రకటించిన మద్దతు ధరల ఉత్తర్వుల కాపీలను ఆ సంఘం ఆధ్వర్యంలో నాయకులు స్థానిక ప్రభుత్వాస్పత్రి వద్ద శనివారం దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ ఎరువులు, పెట్రోల్, డీజిల్ ధరలు 20 శాతం పెంచి పంటలకు మద్దతు ధరలు కేవలం 8 శాతమే పెంచి కేంద్రం రైతులను మోసం చేసిందన్నారు. కనిష్టంగా వరికి కిలో 0.72 పైసలు, మొక్కజొన్నకు కిలో 0.10 పైసలు పెంచారని చెప్పారు. కాంప్లెక్స్ ఎరువులపై ఒక్కో బస్తాకు సగటున రూ.200 నుంచి రూ.300 వరకు ధర పెంచేందుకు ఎరువుల కంపెనీలకు కేంద్రం అనుమతి ఇచ్చిందని ఆరోపించారు. ఎరువుల ధరలు సుమారు 15 నుంచి 20 శాతం వరకు పెరిగాయని చెప్పారు. పంటల మద్దతు ధర ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని, పెంచిన ఎరువులు, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆ సంఘ నాయకులు కోర్సా జలపాలు, సిరిబత్తుల సీతారామయ్య, వెట్టి వీరయ్య, బాలరాజు, తదితరులు పాల్గొన్నారు.


