కుక్కునూరు: జన్‌మన్ కార్యక్రమం ద్వారా మారుమూల గిరిజన పల్లెల్లో విద్యుత్ శాఖ ధికారులు సౌర వెలుగులు నింపారు. మండలంలోని పెద్దరావిగూడెం పంచాయతీ, చిపురుగూడెం గ్రామంలో 13 కిలోవాట్, బండారిగూడెం గ్రామంలో 12 కిలోవాట్‌ల సోలార్ ఆఫ్ గ్రిడ్ రూ.65 లక్షలతో ఏర్పాటు చేసి 85 ఆదివాసీ కుటుంబాలకు ఏపీఈపీడీసీఎల్ సంస్థ విద్యుత్ సౌకర్యం కల్పించింది. ఈ గ్రిడ్‌ను శనివారం ఏపీఈపీడీసీఎల్ ఏలూరు సర్కిల్ ఎస్‌ఈ పి.సాల్మాన్‌రాజు ప్రారంభించారు. కార్యక్రమంలో ఏపీ ట్రాన్స్‌కో డీఈ ఖాన్, ఏడీఈ కట్టా రమేష్, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
ద్వారకాతిరుమల: శ్రీవారి దివ్య క్షేత్రంలో చినవెంకన్న తిరువీధి సేవ శనివారం రాత్రి కన్నులపండువగా జరిగింది. చాత్మార్ తిరునక్షత్రాన్ని పురస్కరించుకుని ఈ వేడుకను క్షేత్ర పురవీధుల్లో అట్టహాసంగా నిర్వహించారు. ముందుగా ఆలయంలో అర్చకులు తొళక్క వాహనంపై స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను ఉంచి విశేష పుష్పాలంకారాలు చేశారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, అర్చకులు, పండితుల వేద మంత్రోచ్ఛరణల నడుమ స్వామివారి వాహనం ఆలయ ప్రధానరాజగోపురం మీదుగా క్షేత్ర పురవీధులకు పయనమైంది. ప్రతి ఇంటి ముంగిటకు వచ్చిన స్వామివారికి భక్తులు నీరాజనాలు సమర్పించారు.
బుట్టాయగూడెం: బుట్టాయగూడెం శివారు అల్లికాల్వ సమీపంలో ఉన్న కాలువ వద్ద శనివారం మధ్యాహ్నం ఒక కారు పల్టీ కొట్టింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. టి.సత్యనారాయణ అనే వ్యక్తి తన భార్యతో కలిసి కారులో బుట్టాయగూడెం నుంచి కన్నాపురం వైపు వెళ్తుండగా అల్లికాల్వ సమీపంలో ఉన్న కాల్వ సమీపంలో కారు అదుపు తప్పి పల్టీ కొట్టింది. ఈ ఘటనలో ఎటువంటి ప్రమాదం జరగలేదు. కారును స్థానికులు బయటకు తీశారు.


