భీమవరం : పోలీసుల సేవలను పోలీసు శాఖ ఎప్పటికీ గుర్తించుకుంటుందని పదవీ విరమణ చేసినా వారి కుటుంబాలకు వెన్నుదన్నుగా ఉంటుందని ఎస్పీ అద్నాన్ నయీం అస్మి అన్నారు. పదవీ విరమణ పొందని పలువురు పోలీసులను శనివారం ఆయన సత్కరించారు. పదవీ విరమణ చేసిన జిల్లా పోలీసు కార్యాలయం అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కె వెంకటేశ్వరరావు, పాలకోడేరు ఎస్సై ఎన్ హరిబాబు, భీమవరం ట్రాఫిక్ ఎస్సై టీవీజీ రాజు, పోడూరు ఏఎస్సై పి.విజయ్‌కుమార్, తాడేపల్లిగూడెం ట్రాఫిక్ ఏఎస్సైలు పి.సింగరాజు, ఎం.గోవిందరావు, పెనుమంట్ర హెడ్ కానిస్టేబుల్ పి శ్రీనివాసరావు, జిల్లా పోలీస్ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ పి రామకృష్ణ, డిస్ట్రిక్ట్ ఆర్మర్‌డ్డ్ రిజర్వ్ హెడ్ కానిస్టేబుల్స్ కె నాగ మునీంద్రరావు, కె.సువర్ణరాజు, పాలకొల్లు టౌన్ పోలీస్ స్టేషన్ హోమ్‌గార్డ్ వై ప్రభాకర్‌లను సత్కరించారు. కార్యక్రమంలో డీఎస్పీ రఘువీర్ విష్ణు, జిల్లా ఆర్మ్‌ర్డ్ రిజర్వ్ డీఎస్పీలు ఎంవీవీ సత్యనారాయణ, కె వెంకట్రావు, జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ కేవీవీఎన్ సత్యనారాయణ, జిల్లా పోలీసు అసోసియేషన్ ప్రెసిడెంట్ సీహెచ్ మోజేష్ తదితరులు పాల్గొన్నారు.
భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లాలో గర్భస్థ శిశు లింగ నిర్ధారణ పరీక్షలు జరిపితే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ చదలవాడ నాగరాణి హెచ్చరించారు. శనివారం జిల్లా కలెక్టర్ ఛాంబర్‌లో గర్భస్థ శిశు లింగ నిర్ధారణ నివారణ చట్టం (పీసీపీఎన్‌డీటీ చట్టం) అమలుతీరుపై వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ, గర్భస్థ శిశు లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్న స్కానింగ్ కేంద్రాలపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అలాగే లింగ నిర్ధారణ కోసం ప్రయత్నించే గర్భిణులు, కుటుంబ సభ్యులు కూడా చట్టపరంగా శిక్షార్హులేనని హెచ్చరించారు. సమాజంలో బాలికల సంఖ్య తగ్గిపోకుండా, ఆడ శిశువుల హక్కులను పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు జిల్లాలోని స్కానింగ్ కేంద్రాలపై తరచూ తనిఖీలు నిర్వహించి, రికార్డులను సమగ్రంగా పరిశీలించాలని ఆదేశించారు.
జంగారెడ్డిగూడెం : చేసిన పనికి డబ్బులు చెల్లించలేదని మనస్తాపానికి గురైన ఓ తాపీమేసీ్త్ర పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. బుట్టాయగూడెం మండలం రెడ్డిగణపవరానికి చెందిన దాసరి వెంకటేశ్వరరావు తాపీమేసీ్త్రగా పనిచేస్తున్నాడు. అతడు జంగారెడ్డిగూడెంనకు చెందిన కాంట్రాక్టర్ వద్ద పనులు ఒప్పుకుని కూలీలతో రెండు నెలల క్రితమే పనులు పూర్తి చేశాడు. దానికి సంబంధించి కాంట్రాక్టర్ తాపీమేస్త్రి వెంకటేశ్వరరావుకు రూ.2 లక్షలు చెల్లించాల్సి ఉంది. అయితే కాంట్రాక్టర్ డబ్బులు ఇవ్వకపోవడం, మరోవైపు డబ్బుల కోసం కూలీల నుంచి ఒత్తిడి ఎదురవడంతో మనస్ధాపానికి గురైన వెంకటేశ్వరరావు జంగారెడ్డిగూడెం వచ్చి పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు అతడిని స్ధానిక ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు.


