గిన్నిస్‌ బుక్‌లో హవిలాకు చోటు | - | Sakshi
Sakshi News home page

గిన్నిస్‌ బుక్‌లో హవిలాకు చోటు

May 31 2026 1:06 AM | Updated on May 31 2026 1:06 AM

గిన్నిస్‌ బుక్‌లో హవిలాకు చోటు తెలంగాణలో పవన్‌పై రాజకీయ కుట్ర లైంగిక వేధింపుల కేసులో కానిస్టేబుల్‌ సస్పెన్షన్‌ డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులో ముగ్గురికి జరిమానా

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) : నగరంలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన పోలగాని హవిలా గిన్నిస్‌ బుక్‌ రికార్డు సాధించింది. గత ఫిబ్రవరి 2న హైదరాబాదులో గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ ప్రతినిధుల ఆధ్వర్యంలో హలేల్‌ మ్యూజిక్‌ స్కూల్‌ గిన్నిస్‌ కీబోర్డ్‌ ఆధ్వర్యంలో వాయిద్య కారులు కీబోర్డు ఆగకుండా వాయించే పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో 22 దేశాల నుంచి దాదాపు 2 వేల మంది పాల్గొనగా అందులో 777 మంది ఎంపికయ్యారు. వారిలో హవిలా ఎంపికై హలేల్‌ మ్యూజిక్‌ స్కూల్‌ గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్‌ సాధించింది. ఈ సందర్భంగా హలేల్‌ మ్యూజిక్‌ స్కూల్‌ వ్యవస్థాపకుడు అగస్టన్‌ దండింగి ఇటీవల హైదరాబాదులో గిన్నిస్‌ అచీవర్స్‌ మీట్‌లో హవిలాకు సర్టిఫికెట్లు అందజేసి అభినందించారు. హవిలాకు నగరానికి చెందిన పలువురు సంగీత కళాకారులు, కళాభిమానులు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.

భీమవరం: ఉప ముఖ్యమంత్రి కె పవన్‌ కళ్యాణ్‌పై తెలంగాణలో జరుగుతున్న ఆందోళనల వెనుక రాజకీయ కుట్ర దాగి ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌ అభిప్రాయపడ్డారు. భీమవరంలో శనివారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఒక్కరూ ఎక్కడికై నా స్వేచ్ఛగా వెళ్లొచ్చని, కానీ పవన్‌ పర్యటనలను అడ్డుకుంటామంటూ హెచ్చరికలు చేయడం తగదన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మిగిలిన నాయకులు ఈ తరహా పరిణామాలపై పునరాలోచించుకోవాలని, లేకుంటే వారికే తీవ్ర నష్టం కలిగిస్తాయని హెచ్చరించారు.

కుక్కునూరు: లైంగిక వేధింపుల కేసులో కుక్కునూరు పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న వెంకటేశ్వర్లును సస్పెండ్‌ చేసినట్టు కుక్కునూరు ఎస్సై రాజారెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మండలంలోని పెద్దరావిగూడెం గ్రామానికి చెందిన వివాహితను కానిస్టేబుల్‌ వెంకటేశ్వర్లు లైంగికంగా వేధించినట్టు పోలీస్‌స్టేషన్‌కు ఫిర్యాదు అందిందని, దీనిపై శాఖాపరమైన చర్యల నిమిత్తం ఎస్పీ కార్యాలయానికి నివేదిక పంపగా, కానిస్టేబుల్‌ వెంకటేశ్వర్లును సస్పెండ్‌ చేస్తూ ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపారు.

పెదపాడు : డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులో కోర్టు ముగ్గురికి జరిమానా విధించింది. పెదపాడు పోలీసులు తెలిపిన వివరాలు ఇవి. మండలంలోని కలపర్రు టోల్‌గేట్‌ వద్ద నిర్వహించిన వాహన తనిఖీల్లో మద్యం సేవించి వాహనం నడుపుతున్న వసంతవాడకు చెందిన జుజ్జువరపు చరణ్‌, పెనమలూరుకు చెందిన షేక్‌ అబ్దుల్‌ ఖాదర్‌, నూజివీడు ఎంఆర్‌ అప్పారావు కాలనీకి చెందిన జలసూత్రం అప్పారావు అను ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం వారిని కోర్టులో హాజరుపర్చగా వారికి ఒక్కొక్కరికి రూ.10వేల జరిమానా విధించారు.

Advertisement
 
Advertisement
Advertisement