న్యాయం చేయాలని గిరిజనుల ధర్నా | - | Sakshi
Sakshi News home page

న్యాయం చేయాలని గిరిజనుల ధర్నా

May 31 2026 1:06 AM | Updated on May 31 2026 1:06 AM

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): డీ– నమూనా పట్టాల భూములను ఆన్‌లైన్‌ చేయడంలో జరుగుతున్న అవకతవకలను నిలువరించి గిరిజనులకు న్యాయం చేయాలని శరత్‌ ఛారిటబుల్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ వడ్లపట్ల సాయి శరత్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు అన్యాయానికి గురౌతున్న జీలుగుమిల్లి మండలం పాలచర్ల రాజవరం గ్రామానికి చెందిన గిరిజనులతో కలిసి శనివారం స్థానిక జిల్లా కలెక్టర్‌ కార్యాలయం వద్ద ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శరత్‌ మాట్లాడుతూ 1984, 2003 సంవత్సరాల్లో ప్రభుత్వమే డీ–నమూనా పట్టాలు మంజూరు చేసినా, ప్రస్తుతం రికార్డులు లేవనే కారణంతో భూములను ఆన్‌న్‌లైన్‌ చేయకపోగా, గిరిజనేతరుల పేర్లు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంపై ఐటీడీఏ పీవో, ఎస్డీసీ, జంగారెడ్డిగూడెం ఆర్డీఓ తదితర అధికారులను పలుమార్లు ఆశ్రయించినా న్యాయం జరగలేదని తెలిపారు. పైగా అధికారుల నిర్లక్ష్యానికి బాధ్యత తమపై మోపుతూ దొంగ పట్టాలు సృష్టించారని ఆరోపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సాగు చేసేందుకు భూముల్లోకి వెళ్తే పోలీసులతో తప్పుడు కేసులు పెడతామని బెదిరిస్తున్నారని, పీజీఆర్‌ఎస్‌లో ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా పరిష్కారం లభించలేదన్నారు. స్థానిక ఎమ్మెల్యే,, అధికార యంత్రాంగం తమ సమస్యను అర్థం చేసుకోకుండా చిన్నచూపు చూస్తున్నారని పేర్కొంటూ, పూర్తి విచారణ జరిపి తమ భూములను వెంటనే ఆనన్‌లైన్‌ చేయాలని కలెక్టర్‌ను కోరారు. కలెక్టరును కలిసినవారిలో సోయం కాంతమ్మ, సోడెం అరుణ, సోడెం రాజు, పూనెం మహాలక్ష్మమ్మ, కొర్స లక్ష్మి, పూనెం దుర్గారావు, తాటి ముత్యాల రావు తదితరులున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement