కై కలూరు: ఆకస్మిక వరదల సమయంలో ముందస్తు హెచ్చరికలకు కోసం కై కలూరు మండలం జంగంపాడు ప్రభుత్వ పాఠశాల 7, 8 తరగతుల విద్యార్థులు జలరక్ష అనే యాప్‌ని సృష్టించి రాష్ట్ర స్థాయిలో ప్రతిష్టాత్మక ‘ఇన్నోవేషన్ చాంపియన్’ అవార్డును సొంతం చేసుకున్నారు. ఈ నెల 25 నుంచి 29 వరకు వైజాగ్ గీతం యూనివర్సిటీలో హాక్ టూ ది ఫ్యూచర్ హ్యాకథాన్ పోటీలు జరిగాయి. రాష్ట్రంలో 8 జిల్లాల నుంచి 100 మంది విద్యార్థులు పోటీపడ్డారు. ఈ పోటీల్లో జంగంపాడు విద్యార్థులు నాగసాయి, యేసురాజు, శ్రీబాలాజీ, పవన్ తేజ, లీలా వెంకట్ జలరక్ష యాప్ రూపొందించారు. ఈ యాప్‌లో నార్మల్, చెక్ స్టేటస్, ప్లే ఎలర్ట్, ఫిషర్‌మెన్ సెప్టీ, ఎమర్జన్సీ, హెల్ప్ అనే ప్యూచర్‌లు ఉన్నాయి. సెల్‌లో యాప్ డౌన్‌లోడ్ చేసుకున్న కొల్లేరు ప్రాంత ప్రజలకు వరదల సమయంలో సెన్సర్ ఆధారంగా ముందే హెచ్చరిక చూపిస్తోంది. ఎవరైనా వరద నీటిలో చిక్కుకుంటే అక్కడ లోకేషన్‌తో సహా అత్యవసర సేవల విభాగాలకు సమాచారాన్ని చేరవేస్తోంది. ఈ యాప్‌ను రూపొందించినందుకుగాను విశాఖపట్నం గీతం యూనివర్సిటీలో విశాఖపట్నం ప్రాంతీయ విద్యా శాఖ జాయింట్ డైరెక్టర్ (ఆర్‌జేడీ) బీ.విజయభాస్కర్ నుంచి విద్యార్థులు ఇన్నోవేషన్ చాపియన్ అవార్డును అందుకున్నారు. ఈ సంరద్భంగా విద్యార్థులను, పాఠశాల గైడ్ టీచర్ పి.సురేష్‌బాబును గ్రామపెద్దలు అభినందించారు.


