విద్యుత్‌ ఉద్యోగుల్లో బదిలీల చర్చ | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ ఉద్యోగుల్లో బదిలీల చర్చ

May 30 2026 2:44 AM | Updated on May 30 2026 2:44 AM

మారనున్న సమీకరణాలు

బదిలీలకు పోటీ ఎక్కువే

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): తూర్పుప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఈపీసీడీసీఎల్‌) పరిధిలో జూన్‌ మొదటి వారంలో పదోన్నతులు జరుగనున్నాయని, ఏలూరు, భీమవరం సర్కిళ్లలో పలువురు అధికారులకు పదోన్నతులతో పాటు బదిలీలు జరగనున్నాయనే చర్చ ఉద్యోగుల్లో విస్తృతంగా జరుగుతోంది. అలాగే విద్యుత్‌ ఉద్యోగుల పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచే అంశంపై ప్రభుత్వం వచ్చేనెల 4న జరిగే కేబినేట్‌ సమావేశంలో ఓ నిర్ణయానికి రానుందని తెలిసింది. ఈ నేపథ్యంలో ఈపీడీసీఎల్‌ పరిధిలో గత ఆరు నెలలుగా పదవీ విరమణలు జరిగినా ఆయా స్థానాలను ఇప్పటివరకూ భర్తీ చేయలేదనే చర్చ కూడా నడుస్తోంది.

లైన్‌ లాసులు తగ్గించడంలో.. ప్రస్తుతం ఏలూరు ఆపరేషన్‌ సర్కిల్‌ సూపరింటెండింగ్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్న పి.సాల్మన్‌రాజుకు పదోన్నతి లభించనుందని సమాచారం. ఆయన్ను చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌గా విశాఖలోని సంస్థ కార్పొరేట్‌ కార్యాలయానికి బదిలీ చేయనున్నారని చర్చించుకుంటున్నారు. డిస్కం స్థాయిలో లైన్‌ లాసులను తగ్గించడంలో చేసిన విశేష కృషికి గుర్తింపుగా సంస్థ సీఎండీ ఇమ్మడి పృధ్వీతేజ్‌ ఆయనకు ప్రశంసాపత్రం కూడా అందించడం ఈ వాదనకు బలం చేకూర్చుతోంది. ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంచితే ఆయనకు పదోన్నతి లభించదని, ఇక్కడ మూడేళ్ల సర్వీస్‌ పూర్తిచేసుకోవడంతో బదిలీ మాత్రం తప్పదనే చర్చా జరుగుతోంది. ఆయన భార్య భీమవరంలో పశుసంవర్ధక శాఖలో జిల్లాస్థాయి అధికారిగా పనిచేస్తున్నందున సాల్మన్‌రాజును భీమవరం సర్కిల్‌కు బదిలీ చేసే అవకాశం ఉందంటున్నారు.

అంబేడ్కర్‌కు స్థానిక ప్రజాప్రతినిధి అడ్డు !

ఏలూరు డివిజన్‌ ఆపరేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్న కేఎం అంబేడ్కర్‌ పదోన్నతుల జాబితాలో ఉన్నారు. ఆయన సూపరింటెండింగ్‌ ఇంజనీర్‌ (ఎస్‌ఈ)గా పదోన్నతి పొందుతారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. అయితే అంబేడ్కర్‌కు ఏలూరులో పోస్టింగ్‌ ఇవ్వడాన్ని స్థానిక ప్రజాప్రతినిధి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఆయన ఒత్తిడికి సీఎండీ తలొగ్గితే అంబేడ్కర్‌ను కొత్తగా ఏర్పడిన పోలవరం సర్కిల్‌కు ఎస్‌ఈగా నియమించే అవకాశం ఉందంటున్నారు.

వచ్చేనెల 4న జరిగే కేబినెట్‌ సమావేశంలో విద్యుత్‌ సంస్థల్లో ఉద్యోగుల పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచే అవకాశం ఎక్కువగానే ఉందని ఉద్యోగులు అంటున్నారు. 60 ఏళ్లకు పదవీ విరమణ ఉంటే వందలాది మంది ఉద్యోగులు, అధికారులు పదవీ విరమణ చేస్తారని, వారికి పదవీ విరమణ ఫలాలు అందించాలంటే ప్రభుత్వం దగ్గర అంత విత్తం లేదంటున్నారు. ఈ నేపథ్యంలో పదవీ విరమణ వయసు పెంచితే పైన చెప్పుకున్న సమీకరణాల్లో చాలా మార్పులు ఉండను న్నాయి. దీనికి తోడు గత ఆరు నెలల క్రితం అంటే 2026 జనవరిలో పదవీ విరమణ చేసిన వారు కూడా తిరిగి ఉద్యోగాల్లో చేరతారని, అప్పుడు ఆయా ప్రాంతాల్లోని స్థానిక ప్రజాప్రతినిధుల ఆశీస్సులు ఎవరికి లభిస్తాయో వారికి కోరుకున్న స్థానాలు లభిస్తాయనే చర్చ వేడిగానే జరుగుతోంది.

సీజీఎంగా ఏలూరు ఎస్‌ఈ సాల్మన్‌రాజు!

ఏలూరు ఈఈకు ఎస్‌ఈగా అవకాశం

పదవీ విరమణ వయసు పెంచితే మారనున్న సమీకరణాలు

వచ్చేనెలలో పదోన్నతులు

వచ్చే నెల ప్రారంభం నాటికి డిస్కం స్థాయిలో బదిలీలు పూర్తి చేయాలని సీఎండీ చూస్తూ ఉండగా పలు స్థానాల కోసం ఇప్పటికే ప్రజాప్రతినిధుల ద్వారా సీఎండీకి లేఖలు సమర్పిస్తూ పలువురు అధికారులు ఒత్తిడి తీసుకువస్తున్నారని సమాచారం. కోనసీమ జిల్లాలో పనిచేస్తున్న విజయానంద్‌ పదోన్నతిపై భీమవరం ఎస్‌ఈగా రావడానికి, ఏలూరు సర్కిల్‌ పరిధిలోని జంగారెడ్డిగూడెం ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ పీర్‌ అహ్మద్‌ఖాన్‌ సైతం భీమవరం ఎస్‌ఈ స్థానానికి రావడానికి ప్రయత్నాలు చేస్తుండటంతో ఆ స్థానానికి పోటీ ఎక్కువగా ఉంది. భీమవరంలో ప్రస్తుతం పనిచేస్తున్న ఎస్‌ఈ ఉషారాణిని అమలాపురం ఎస్‌ఈగా, అమలాపురం ఎస్‌ఈ రాజేశ్వరిని కాకినాడకు బదిలీ చేస్తారని చెప్పుకుంటున్నారు. ఇలా పదోన్నతులు జరిగితే తాడేపల్లిగూడెం ఈఈ, భీమవరం డీఈ టెక్నికల్‌, నరసాపురం, నిడదవోలు తదితర ప్రాంతాల్లో పనిచేస్తున్న ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్లకు స్థానచలనం కలిగే అవకాశం ఉందంటున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement