చర్చనీయాంశంగా ఐటీడీఏ పీఓ ఆడియో
కుక్కునూరు: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అవినీతి పేట్రేగిపోయిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా విలీన మండలాల్లో నిర్వాసితుల పరిహారాన్ని ఆసరాగా చేసుకుని కూటమి నాయకులతో చేతులు కలిపిన అధికారులు వారు చెప్పినట్టుగా వ్యవహరిస్తూ నిర్వాసితుల వద్ద నుంచి పెద్దెత్తున వసూళ్లకు పాల్పడుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందుకు సంబంఽధించి కేఆర్‌పురం ఐటీడీఏ పీఓ ఆడియా సంచలనంగా మారింది. చిరవెల్లి గ్రామానికి చెందిన ఓ నిర్వాసితుడికి జమైన ఇంటిపరిహారం విషయంలో పీవో స్వయంగా ఫోన్ చేసి కూటమి నాయకుడి వద్దకు వెళ్లి సెటిల్‌మెంట్ చేసుకోమని, లేకుంటే క్రిమినల్ కేసు నమోదు చేస్తామని మాట్లాడిన ఆడియో ఓ చానల్‌లో బహిర్గతమైంది. ఈ ఆడియోతో కూటమి ప్రభుత్వంలో అధికారుల స్వామి భక్తి స్పష్టమవుతుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
జంగారెడ్డిగూడెం: పట్టణంలో ఓ స్వర్ణకారుడు సుమారు రూ.50 లక్షల వరకు బంగారం, నగదుతో పరారయ్యాడు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణానికి చెందిన కొందరు స్థానిక మునుసుబు గారి వీధిలో స్వర్ణకార వృతి చేసుకుంటున్న పడగా రాముకు కొత్త బంగారు ఆభరణాలు చేసేందుకు పట్టణానికి చెందిన కె.కృష్ణరాజు సుమారు 3.5 కాసుల బంగారం, రూ.3.50 లక్షల నగదు, నూకవరపు చంద్ర 3 కాసుల బంగారం, రూ.3.50 లక్షల నగదు, కె.సూర్యకాంతం 5 కాసుల బంగారం, కొంత వెండి, ఎస్.మల్లేశ్వరి 3 కాసుల బంగారం, రూ.2.85 లక్షల నగదు, తాకట్టు పెట్టేందుకు డి.నాగుదర్గ వరప్రసాద్ 3.5 కాసుల బంగారు ఇచ్చారు. వీటన్నింటిని తీసుకుని కుటుంబంతో సహ స్వర్ణకారుడు పడగా రాము పరారైనట్లు బాధితులు చెబుతున్నారు. దీంతో అతని బంధువులను సంప్రదించినా సమాధానం లేకపోవడంతో బాధితులు కలెక్టర్‌కు, ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. పోలీసులు దర్యాప్తు చేసి తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు.
దెందులూరు: జాతీయ రహదారిపై సత్యనారాయణపురం వద్ద మంగళవారం రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. మృతుడి వయస్సు సుమారు 50 సంవత్సరాలు ఉండవచ్చని దెందులూరు ఎస్సై రాచమల్లు శివాజీ చెప్పారు.
బుట్టాయగూడెం: జీలుగుమిల్లి మండలం సిర్రివారిగూడెం సమీపంలో ట్రాక్టర్‌పై నుంచి జారిపడి యువకుడు మృతి చెందాడు. ఎస్సై వి. క్రాంతికుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సిర్రివారిగూడెంకు చెందిన పొట్టా అఖిల్ (18) జీలుగుమిల్లికి ట్రాక్టర్‌పై వెళ్లి తిరిగి వస్తుండగా ట్రాక్టర్ అదుపు తప్పి మొద్దుపై ఎక్కి తిరగబడింది. ఈ ప్రమాదంలో అఖిల్‌పై ట్రాక్టర్ చక్రం ఎక్కి అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు.


