మంత్రి పేరు చెప్పి భూములు కబ్జా చేస్తే ఊరుకోం
నూజివీడు : ఏలూరు జిల్లా నూజివీడు మండలంలోని సీతారామపురానికి చెందిన టీడీపీ నాయకుడు మంత్రి పేరు చెప్పి భూములను కబ్జా చేయాలని చూస్తే ఊరుకునే ప్రసక్తే లేదని జనసేన ఉమ్మడి కృష్ణాజిల్లా అధికార ప్రతినిధి మరీదు శివరామకృష్ణ హెచ్చరించారు. మండలంలోని మీర్జాపురానికి చెందిన బీసీల భూమిని ఆక్రమిస్తున్న నాయకుడి నుంచి బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ మరీదు శివరామకృష్ణతో పాటు మండల అధ్యక్షుడు యర్రంశెట్టి రాము, నాయకుడు ముమ్మలనేని సునీల్‌కుమార్ మంగళవారం తహసీల్దార్ గుగులోతు బద్రూనాయక్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ బాధిత రైతులు ఇప్పటికే తమకు న్యాయం చేయాలని కోరుతూ సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను, స్థానిక మంత్రిని కోరారని చెప్పారు. పామర్తి చిట్టిబాబు, బుచ్చిబాబులు సాగు చేసుకునే భూమిని కబ్జా చేయాలని చూస్తే ఎవరూ ఊరుకోరన్నారు. సాగు చేసుకుంటున్నవారిని బెదిరించి లాక్కోవాలని చూసినా అలాంటివి నెరవేరవన్నారు. భూమిని రీ సర్వే చేయనీయకుండా అడ్డుకోవడమే కాకుండా రికార్డుల్లోకి సైతం ఎక్కనివ్వడం లేదని విమర్శించారు. మంత్రి కొలుసు పార్థసారథి పేరు చెప్పి అరాచకాలు చేయాలని చూస్తున్నాడన్నారు. ఇలాంటివి మానుకోవాలని హెచ్చరించారు.
జనసేన నాయకుడు మరీదు శివరామకృష్ణ


