
నాణ్యతా ప్రమాణాలు పాటించాలి
ఏలూరు(మెట్రో): ఉత్పత్తుల తయారీలో నాణ్యతా ప్రమాణాలు పాటించడం వల్ల వినియోగదారుల సంతృప్తితో బ్రాండ్ విలువ పెరుగుతుందని కలెక్టర్ కె. వెట్రిసెల్వి పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో పరిశ్రమల శాఖ, ఎఫ్‌ఎస్‌ఎంఈతో కలిసి భారతీయ నాణ్యతా ప్రమాణాలపై(బీఐఎస్) నిర్వహించిన వర్క్ షాప్‌ను కలెక్టర్ ప్రారంభించారు. పరిశ్రమలకు సంబంధించి ఎంఎస్‌ఎంఈ స్కీంలపై ఎంపీ పుట్టా మహేష్ కుమార్ రూపొందించిన పుస్తకాన్ని కలెక్టర్ ఆవిష్కరించారు. సమావేశ అనంతరం ఎంఎస్‌ఎంఈ పారిశ్రామికవేత్తలకు మంజూరు పత్రాలను అందజేశారు. ఎఈపం పుట్టా మహేష్ కుమార్ పార్లమెంటు నుంచి వర్చువల్‌గా ఇలాంటి కార్యక్రమాలు నిరంతరం నిర్వహించి పరిశ్రమలు రావడానికి కృషి చేస్తామని అన్నారు. ఎఫ్‌ఎస్‌ఎంఈ జాతీయ అధ్యక్షుడు ఏపీకె రెడ్డి, బీఐఎస్ డైరెక్టర్ శ్రీమతి ప్రేమ్ సజనీ పట్నాల తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో నానో ఎరువుల వినియోగాన్ని ప్రోత్సహించడంతోపాటు ఎరువుల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వ్యవసాయాధికారులను ఆదేశించారు. ఎరువుల లభ్యత, నానో ఎరువుల వినియోగం, కౌలు రైతులకు రుణాలు, ఉద్యానవనాల విస్తరణ, పాడి పశువులకు వ్యాక్సినేషన్, బీమా, మత్స్య శాఖల కార్యక్రమాలపై అధికారులతో కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి బుధవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్‌న్సె ద్వారా కలెక్టర్ సమీక్షించారు. అలాగే పురపాలక సంఘాల్లో పౌర సేవలపై ప్రజలలో సంతృప్తి స్థాయిని పెంచేందుకు కృషి చేయాలని కలెక్టర్ మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు.