
సందిగ్ధంలో ఎంపీడీఓ పోస్ట్
కొయ్యలగూడెం: కొయ్యలగూడెం మండల పరిషత్ అభివృద్ధి అధికారి పోస్టు విషయంలో సందిగ్ధత నెలకొంది. ఇప్పటివరకు ఇక్కడ ఎంపీడీవోగా కె.కిరణ్‌కుమార్ విధులు నిర్వహిస్తుండగా, ఆయన స్థానంలో మరో ఎంపీడీఓకి పోస్టింగ్‌ని ఇస్తూ సిఫార్సు లెటర్ అందినట్లు తెలిసింది. అయితే సిఫార్సు లెటర్ తీసుకున్న ఎంపీడీవో ఇటీవలే దేవరపల్లి నుంచి తాళ్లపూడి ఎంపీడీవోగా బదిలీ అయ్యి అక్కడ చార్జీ తీసుకోవడం, అనంతరం మండల పరిషత్తు సర్వసభ్య సమావేశం కూడా నిర్వహించడం జరిగింది. అయితే హఠాత్తుగా కొయ్యలగూడెం ఎంపీడీవోగా సిఫార్సు లెటర్ తీసుకోవడం, ఆగమేఘాలపై జెడ్పీ ద్వారా కొయ్యలగూడెం ఎంపీడీవో పోస్టింగ్ చేయించుకోవడానికి ఆయన ప్రయత్నాలు చేస్తుండడం అటు రాజకీయ వర్గాల్లో, ఇటు ఉద్యోగ వర్గాల్లో కలకలం లేపుతోంది. కిరణ్‌కుమార్ ఎంపీడీవోగా బాధ్యతలు స్వీకరించి పది నెలలు కూడా గడవకముందే మరో ఎంపీడీవోని అది కూడా నిబంధనలకు విరుద్ధంగా నియమించడం వెనుక ఎంపీడీవో కార్యాలయంలోని ఓ సీనియర్ ఉద్యోగి చక్రం తిప్పినట్లు విశ్వసనీయంగా తెలిసింది. బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఏవిధమైన ఒత్తిళ్లకు లొంగకుండా ఎంపీడీవో విధులు నిర్వహిస్తూ ఉండగా ఆయనకు తెలియకుండానే బదిలీల ప్రక్రియ కొనసాగిందంటూ ఎంపీడీవో కార్యాలయంలో ప్రచారం సాగుతోంది. కార్యాలయంలోని సీనియర్ ఉద్యోగి చేస్తున్న అక్రమాలను ఎంపీడీవో అడ్డుకుంటున్న నేపథ్యంలో చేసేదిలేక సీనియర్ ఉద్యోగి రాజకీయ పెద్దలను ఆశ్రయించినట్లు తద్వారా తనకు అనుకూలంగా ఉన్న వేరొక ఎంపీడీవోకి పోస్టింగ్ ఆర్డర్స్ ఇప్పించినట్లు ప్రచారం సాగుతోంది.
పోస్టింగ్ చేపట్టి పది నెలలు గడవకుండానే వేటు?
రాజకీయ ఒత్తిళ్లకు లొంగకపోవడమే కారణమా!