దివ్యాంగులకు ముఖ్యమంత్రి ఆర్థిక సాయం | - | Sakshi
Sakshi News home page

దివ్యాంగులకు ముఖ్యమంత్రి ఆర్థిక సాయం

Nov 21 2023 1:22 AM | Updated on Nov 21 2023 1:22 AM

ఏలూరు(మెట్రో): ఇటీవల నూజివీడు పర్యటనలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తనను కలిసిన 12 మంది దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వ్యాధిగ్రస్తులకు ఆర్ధిక సాయం అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీనిలో భాగంగా ముఖ్యమంత్రి పర్యటన రోజునే 9 మందికి జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ బి.లావణ్య వేణి, నూజివీడు సబ్‌ కలెక్టర్‌ ఆదర్శ్‌ రాజేంద్రన్‌ ఆర్థిక సాయం చెక్కులను లబ్ధిదారులకు అందించారు. వారిలో మిగిలిన ముగ్గురికి సోమవారం జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో జిల్లా రెవిన్యూ అధికారి ఎం.వెంకటేశ్వర్లు ఆర్థిక సాయం చెక్కులను అందించారు. వీరిలో బానోతు సావిత్రికి రూ. 2,00,000 (దివ్యాంగురాలు), తాళ్లూరి గోపాల స్వామికి రూ.1,00,000 (కిడ్నీ వ్యాధి బాధితుడు), వీరమల్ల తంబిబాబుకు రూ.1,00,000 (దివ్యాంగుడు) ఆర్ధిక సాయం చెక్కులను డీఆర్‌ఓ అందజేశారు.

డిసెంబరు 3న ఎన్‌ఎన్‌ఎంఎస్‌ పరీక్ష

ఏలూరు (టూటౌన్‌): 2023–24 విద్యాసంవత్సరానికి జాతీయ ఉపకార వేతన పరీక్ష(ఎన్‌ఎన్‌ఎంఎస్‌) వచ్చే నెల 3న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి పి.శ్యాంసుందర్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్షకు హాజరవుతున్న విద్యార్థుల హాల్‌ టికెట్లను ప్రభుత్వ పరీక్షల సంచాలకుడి కార్యాలయం వెబ్‌సైట్‌ స్కూల్‌ లాగిన్‌లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఉపాధ్యాయులు పాఠశాల యూ–డైస్‌ కోడ్‌ను ఉపయోగించి విద్యార్థుల హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవాలన్నారు.

22న డయల్‌ యువర్‌ డీపీటీఓ కార్యక్రమం

ఏలూరు (టూటౌన్‌): రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఈనెల 22వ తేదీ బుధవారం డయల్‌ యువర్‌ డీపీటీఓ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రజా రవాణా శాఖ అధికారి ఎన్‌వీఆర్‌ వరప్రసాద్‌ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ఏలూరు, జంగారెడ్డిగూడెం, నూజివీడు డిపోల బస్సులకు సంబంధించి 22వ తేదీ ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకూ ఈ కార్యక్రమం నిర్వహిస్తారన్నారు. ప్రయాణికులు 99592 25526 నెంబరుకు ఫోన్‌ చేసి సమస్యలు తెలియజేయాలన్నారు.

26లోగా దరఖాస్తు చేసుకోవాలి

ఏలూరు (టూటౌన్‌): పదవ తరగతి, ఇంటర్‌లో 2023–24 సంవత్సరానికి అడ్మిషన్ల కోసం ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక విద్యాపీఠం, సంచాలకులు ఆదేశాల మేరకు అపరాధ రుసుం లేకుండా ఈ నెల 26 వరకు, రూ.200 అపరాధ రుసుంతో ఈ నెల 30 వరకూ దరఖాస్తు చేసుకోవచ్చని జిల్లా విద్యాశాఖాధికారి పి.శ్యాంసుందర్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు రిజిస్ట్రేషన్‌ ఆన్‌లైన్‌ చేసుకోవచ్చునని, సంబంధిత ఓపెన్‌ స్కూల్‌ అధీకృత స్టడీ సెంటర్ల ద్వారా, గ్రామ, వార్డు సచివాలయం ద్వారా అడ్మిషన్‌లు పొందవచ్చన్నారు. ఫీజును ఏపీ ఆన్‌లైన్‌ ద్వారా చెల్లించవచ్చని తెలిపారు.

బాల కార్మికుల గుర్తింపునకు తనిఖీలు

ఏలూరు(మెట్రో): బాల కార్మికుల గుర్తింపు, పునరావాసం కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నట్లు కార్మిక శాఖ ఉప కమిషనర్‌ పి.శ్రీనివాస్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 20 నుంచి డిసెంబర్‌ 10 వరకు తనిఖీలు నిర్వహిస్తామన్నారు. ఈ నేపధ్యంలో సోమవారం జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వర్లు అధ్యక్షతన జిల్లా టాస్క్‌ ఫోర్స్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లా టాస్క్‌ఫోర్స్‌ కార్యాచరణపై చర్చించి సూచనలు ఇచ్చారు. తనిఖీల్లో భాగంగా స్థానిక వంగాయగూడెం సెంటర్‌లో బాలుడిని గుర్తించి విద్యా సంస్థలో చేర్పించారు.

వ్యభిచార గృహంపై దాడి

ఏలూరు టౌన్‌: ఏలూరు వన్‌టౌన్‌ గాంధీమైదానం సమీపంలో బొమ్మల గుడి సమీపంలో వైఎస్సార్‌ కాలనీ 15వ రోడ్డు ప్రాంతానికి చెందిన ఒక మహిళ నిర్వహిస్తోన్న వ్యభిచార గృహంపై పోలీసులు దాడి చేశారు. వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తోన్న మహిళతోపాటు, విటుడు, బాధితురాలిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రూ.31 వేలు నగదు, మూడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వీరిపై సీఐ రాజశేఖర్‌ కేసు నమోదు చేశారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement