బాస్కెట్‌బాల్‌ రాష్ట్ర పోటీలకు మార్టేరు విద్యార్థులు | Sakshi
Sakshi News home page

బాస్కెట్‌బాల్‌ రాష్ట్ర పోటీలకు మార్టేరు విద్యార్థులు

Published Tue, Nov 21 2023 1:22 AM

విద్యార్థులతో పీడీ కృష్ణారెడ్డి 
 - Sakshi

పెనుమంట్ర: తూర్పుగోదావరి జిల్లా రాయవరంలో ఈనెల 24 నుంచి 26వ తేదీ వరకు జరిగే అండర్‌–17 రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్‌ పోటీలకు మార్టేరు శ్రీవేణుగోపాల జెడ్పీ హైస్కూల్‌కు చెందిన ఏడుగురు విద్యార్థులు ఎంపికై నట్లు పీడీ, జిల్లా బాస్కెట్‌బాల్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు కర్రి కృష్ణారెడ్డి సోమవారం తెలిపారు. టీమ్‌ కెప్టెన్‌గా నక్కా సందీప్‌తో పాటు సకిలే కిశోర్‌, గుళ్లపూడి వరప్రసాద్‌, మునకాల సాంబసూర్య, షేక్‌ సీరజ్‌బాషా, మామిడి సోమశేఖర్‌, జుత్తిగ అనిష్‌ పశ్చిమగోదావరి జిల్లా జట్టు తరపున ఆడనున్నారన్నారు. వీరికి బాస్కెట్‌బాల్‌ అకాడమీ తరపున మార్టేరులో శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు.

23న మహిళా కబడ్డీ జిల్లా జట్టు ఎంపిక

తణుకు అర్బన్‌: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా మహిళా కబడ్డీ జట్టు ఎంపిక పోటీలు తాడేపల్లిగూడెం మండలం పెదతాడేపల్లిలోని శ్రీవాసవి ఇంజనీరింగ్‌ కళాశాలలో ఈనెల 23న నిర్వహించనున్నట్లు జిల్లా అసోసియేషన్‌ ఆర్గనైజింగ్‌ సెక్రటరీ వై.శ్రీకాంత్‌, అధ్యక్షులు కౌరు శ్రీను, చైర్మన్‌ అప్పలరాజు సోమవారం తెలిపారు. ఆసక్తి కలిగిన క్రీడాకారులు తమ ఆధార్‌ కార్డుతో ఆరోజు మధ్యాహ్నం 2 గంటలకు రిపోర్టు చేయాలని, క్రీడాకారుల బరువు 75 కేజీలలోపు మాత్రమే ఉండాలని సూచించారు. ఇతర వివరాలకు 94913 33906, 96424 96117 నంబర్లలో సంప్రదించాలని కోరారు.

వివాహితను వేధిస్తున్న అత్త, మామపై కేసు నమోదు

జంగారెడ్డిగూడెం: అత్త మామ వేధింపులు తాళలేక ఓ వివాహిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఆర్‌.మల్లికార్జునరెడ్డి చెప్పారు. ఆయన తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నూతి రేణుకకు ఏడేళ్ల క్రితం వివాహం కాగా, భర్త, అత్తమామలతో వేగవరంలో నివాసం ఉంటోంది. రేణుక భర్త జంగారెడ్డిగూడెంలో ఓ ప్రైవేట్‌ కాలేజ్‌లో అధ్యాపకునిగా పనిచేస్తున్నాడు. అయితే భర్త ఇంట్లో లేని సమయంలో అత్తమామలు వేధింపులకు గురిచేస్తున్నారని, మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నారని రేణుక పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

నేడు కై కలూరులో మత్స్యకార దినోత్సవం

కైకలూరు: ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా కైకలూరు మత్స్యశాఖ కార్యాలయంలో మంగళవారం ఆక్వా రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నామని మత్స్యశాఖ సహాయ సంచాలకులు షేక్‌ చాంద్‌ బాషా సోమవారం చెప్పారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్‌) హాజరవుతారన్నారు. కై కలూరు నియోజకవర్గం నాలుగు మండలాల్లో 75,304 ఎకరాల్లో ఆక్వా సాగు జరుగుతోందన్నారు. నియోజకవర్గంలో 70 ఫిషర్‌మెన్‌ సొసైటీలలో 5,911 మంది సభ్యులు ఉన్నారన్నారు. నియోజకవర్గంలో 16 ఐస్‌ ఫ్యాక్టరీలు, మూడు ప్రొసెసింగ్‌ ప్లాంట్లు, నాలుగు మేతల తయారీ కంపెనీలు ఉన్నాయన్నారు. ఆక్వా రైతులకు ప్రభుత్వం విద్యుత్‌ సబ్సిడీ, పలు పథకాలు, రుణాలు అందిస్తోందన్నారు. మత్స్యకార దినోత్సవ కార్యక్రమాన్ని ఆక్వా రైతులు విజయవంతం చేయాలని కోరారు.

Advertisement
Advertisement