ముగిసిన ధనుర్మాస ఉత్సవాలు
ద్వారకాతిరుమల: శ్రీవారి క్షేత్రంలో ధనుర్మాస ఉత్సవాలు బుధవారంతో ముగిశాయి. దాంతో నెలరోజుల పాటు తిరువీధుల్లో జరిగిన గ్రామోత్సవాలు సైతం ముగిశాయి. ఆఖరి రోజు స్వామి, అమ్మవార్లు, గోదాదేవి తొళక్క వాహనంపై క్షేత్ర పురవీధుల్లో అట్టహాసంగా ఊరేగారు. ముందుగా అర్చకులు ఆలయంలో స్వామి, అమ్మవార్లు, గోదాదేవి ఉత్సవ మూర్తులను తొళక్క వాహనంపై ఉంచి ప్రత్యేక పుష్పాలంకారాలు చేశారు. అనంతరం హారతులిచ్చారు. ఆ తరువాత స్వామివారి వాహనం ఆలయ ప్రధాన రాజగోపురం మీదుగా మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, అర్చకులు, పండితుల వేద మంత్రోచ్ఛరణలు, గజ, అశ్వ సేవల నడుమ క్షేత్ర పురవీధులకు పయనమైంది. ప్రతి ఇంటి ముంగిటా స్వామి, అమ్మవార్లకు భక్తులకు నీరాజనాలు సమర్పించారు. అనంతరం ఆలయ ప్రధాన కూడలిలోని విలాస మండపంలో శ్రీవారు, అమ్మవార్లకు అర్చకులు పూజలు నిర్వహించి, భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు.
ముదినేపల్లి రూరల్: స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న మల్లంపల్లి వెంకట సుబ్బారావు (50) బుధవారం మృతి చెందారు. ఈయనకు భార్య, ఇద్దరు కుమారులున్నారు. సుబ్బారావు అప్పుల బాధ భరించలేక ఈ నెల 6న పురుగుమందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించగా విజయవాడ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. బుధవారం ఆయన చికిత్స పొందుతూ మృతి చెందారు. ఎంపీడీవో వై రామకృష్ణతో పాటు కార్యాలయ సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు పలువురు సుబ్బారావు మృతికి సంతాపం తెలియజేశారు.
పెనుమంట్ర: మార్టేరు– పెంటపాడు స్టేట్ హైవే రోడ్డుపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. ఆలమూరు గ్రామానికి చెందిన నాగరాజు (40), చింటూ (15), ప్రభాస్ (19) అనే వ్యక్తులు మోటార్ సైకిల్‌పై వెళ్తుండగా గుర్తుతెలియని మరో మోటార్ సైకిలిస్టు వీరిని ఢీకొట్టి వెళ్లిపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 వాహనంలో తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నట్టు సమాచారం. పూర్తి వివరాలు రావాల్సి ఉందని పోలీసులు తెలిపారు.
ఉపాధి హామీ పథకం కొనసాగించాలి
తాడేపల్లిగూడెం రూరల్: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కొనసాగించాలని, కూలీలకు నష్టం కలిగించే పని దినాలు కోల్పోయే వీబీజీరామ్‌జీ పథకం వద్దని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు డిమాండ్ చేశారు. వీబీజీరామ్‌జీ పథకం వద్దంటూ రూరల్ మండలం నవాబుపాలెం, జగన్నాథపురం గ్రామాల్లో బుధవారం జాతీయ నేతలు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, బాబూజగ్జీవన్‌రామ్ విగ్రహాల వద్ద నిరసనలు తెలిపారు. వీబీజీరామ్‌జీ చట్టం ప్రతులను భోగి మంటల్లో దహనం చేశారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కండెల్లి సోమరాజు, నాయకులు కె.రమేష్‌బాబు, నూతంగి సూర్యారావు, విజయరుద్ర బూరయ్య, పెనుమాక నాగేశ్వరరావు, కొల్లి లక్ష్మి, పెనుమాక అరవిందు, వెంకట్రావు పాల్గొన్నారు.
ముగిసిన ధనుర్మాస ఉత్సవాలు
ముగిసిన ధనుర్మాస ఉత్సవాలు


