
చాలా తరచుగా మాటలు మార్చే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తాజాగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై కత్తిగట్టారు. 50 రోజుల్లోగా ఉక్రెయిన్‌తో శాంతి ఒప్పందానికి రాకపోతే ‘కఠినాతి కఠినమైన’ సుంకాలు విధించటంతోపాటు, తీవ్రమైన ఆంక్షలు మొదలుపెడతానని హెచ్చరించారు. అంతేకాదు... ఉక్రెయిన్ కోసం నాటో దేశాలకు పేట్రియాట్ క్షిపణి రక్షణ వ్యవస్థనూ, ఇతరేతర ఆయుధాలనూ విక్రయిస్తారట. మూడేళ్ల క్రితం ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణకు దిగినప్పుడు రిపబ్లికన్ పార్టీ వైఖరికీ, ట్రంప్ అప్పట్లో చేసిన ప్రకటనలకూ తాజా హెచ్చరికలు పూర్తి విరుద్ధం.
ఉక్రెయిన్ విషయంలో బైడెన్ ప్రభుత్వానికి మద్దతునిచ్చారంటూ తమ పార్టీకి చెందిన అప్పటి స్పీకర్ కెవిన్ మెకార్తీకి ఉద్వాసన పలికింది రిపబ్లికన్‌లే. అటు తర్వాత వచ్చిన మైక్ జాన్సన్‌ను సైతం ఇబ్బంది పెట్టారు. చిత్రమేమంటే అప్పట్లో ఉక్రెయిన్‌కు సాయం అందించటాన్ని గట్టిగా వ్యతిరేకించినవారంతా ఇప్పుడు ట్రంప్ మాదిరే అభిప్రాయాలు మార్చుకుని ఆయనకు మద్దతునిస్తున్నారు. ట్రంప్ విధానం అద్భుతమైనదంటూ పొగుడుతున్నారు. ఉక్రె యిన్‌కు అందించదల్చుకున్న ఆయుధాలను ట్రంప్ నాటోకు విక్రయిస్తున్నారని, అందువల్ల అమె రికా నష్టపోయేదేమీ వుండదని వీరి వాదన. యూరప్ దేశాలు ఇటీవల రక్షణ బడ్జెట్లను విపరీతంగా పెంచాయి. ఆ డబ్బంతా అమెరికా ఖజానాకు చేరుతుందన్నది రిపబ్లికన్ల అంచనా.
ట్రంప్ అన్నంత పనీ చేస్తారని నమ్మడానికి ఎవరూ సిద్ధంగా లేరు. ఇప్పుడున్న వైఖరి సెప్టెంబర్ నాటికి వుంటుందనటానికి లేదు. తాను అధ్యక్షుడయ్యాక కలవటానికొచ్చిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీని వైట్‌హౌస్‌లో తీవ్రంగా అవమానించి, యుద్ధోన్మాదిగా చిత్రించిన ట్రంప్ ఆర్నెల్లయ్యేసరికి ఆ పాత్ర తానే పోషించటానికి సిద్ధపడ్డారు. ట్రంప్ చెబుతున్న ప్రకారం రష్యా దారికి రాకపోతే ఆ దేశంతో వాణిజ్యం నెరపే దేశాలపై కూడా వంద శాతం సుంకాలు విధించాలి.
అంటే రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న మన దేశంతోపాటు ఏటా 25,000 కోట్ల డాలర్ల మేర దిగుమతులు చేసుకుంటున్న చైనాపై కూడా చర్యలుండాలి. మన మాటెలావున్నా ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో రెండో స్థానంలో వున్న చైనాతో నేరుగా యుద్ధానికి దిగటంతో సమానం. పిపీలక ప్రాయమైన ఉక్రెయిన్ కోసం ట్రంప్ ఇంత వివాదానికి దిగుతారా అన్నది ప్రశ్నార్థకం. పైగా అమెరికా మిత్ర దేశాలైన ఈయూ, జపాన్ సైతం రష్యాతో ఇప్పటికీ గణనీయంగా వాణిజ్య లావాదేవీలు సాగిస్తున్నాయి.
లక్ష్మణ రేఖల్ని గీయటంలో ట్రంప్‌ను మించినవారు లేరు. అధికసుంకాల విధింపు హెచ్చరిక ఏమైందో కనబడుతూనే వుంది. దాన్ని వరసగా పొడిగించుకుంటూ పోతున్నారు. ప్రస్తుతానికి వచ్చే నెల 1వ తేదీ తాజా డెడ్‌లైన్. అసలు పదవిలోకి వచ్చేముందే ‘నేను అధ్యక్షుడినైన రెండు వారాలకల్లా రష్యా–ఉక్రెయిన్ లడాయి ఆగితీరాలి’ అని హెచ్చరించిన విషయం ఎవరూ మరిచిపోరు.
ఉక్రెయిన్‌ను అడ్డుపెట్టుకుని ఏదోవిధంగా రష్యాను అదుపు చేయటానికి శ్రమిస్తున్న నాటో కూటమి ఎలాగైతేనేం ట్రంప్ అంతరంగాన్ని పట్టుకుని, ఆయన అభిప్రాయాన్ని మార్చగలిగింది. మొన్నటివరకూ తిట్టిన నోరే మెచ్చుకునేలా చేసింది. కానీ ఇదెంత కాలం? నిజానికి ‘వేల కోట్ల డాలర్ల విలువైన ఆయుధాలు నాటోకు అందిస్తాం. మొండికేస్తున్న రష్యాను దారికి తెస్తాం’ అంటూ ట్రంప్ సోమవారం చేసిన ప్రకటన నాటోను లోలోన వణికిస్తోంది. కొత్తగా తాము పెంచుకున్న రక్షణ కేటాయింపులన్నీ అమెరికా ఆవిరి చేస్తుందన్న భయం వాటిని వేధిస్తోంది.
పైగా అవసరమైన ఆయుధాలు అందించటం రోజుల్లో, నెలల్లో పూర్తయ్యేది కాదు. అమెరికా, యూరప్ దేశాల దగ్గ రున్న ఆయుధాలన్నిటినీ వినియోగించినా రష్యాపై తక్షణ ఆధిక్యత అసాధ్యం. కొత్తగా ఆయుధాల ఉత్పత్తి మొదలై నాటో కూటమికి చేరటానికి సంవత్సరాలు పట్టొచ్చు. యూరప్ దేశాల్లో వున్న ఆయుధ పరిశ్రమ పరిమాణం చిన్నది. అమెరికా ఒక్కటే లక్ష్యాన్ని పూర్తి చేయటం అంత సులభం కాదు. వాణిజ్యం వరకూ చూస్తే రష్యా నుంచి అమెరికా దిగుమతులు ఎక్కువేమీ కాదు. అవి 300 కోట్ల డాలర్లు మించవని నిపుణులు చెబుతున్నారు. వాటిలో అమెరికాకు ఎంతో అవసరమైన ఎరు వులు, ఇనుము, ఉక్కు, యురేనియంలున్నాయి.
ఇప్పటికే మూడేళ్లుగా ఆర్థిక ఆంక్షలు ఎదుర్కొంటున్న రష్యా కొత్తగా నష్టపోయేది కూడా వుండదు. కానీ రష్యాతో వాణిజ్య లావాదేవీలున్న దేశాలను గణనీయంగా దెబ్బతీసేందుకు అవకాశం వుంటుంది. కానీ అది ఆచరణ సాధ్యమేనా? ఈ చర్యలన్నీ అమలైతే రష్యా స్పందన గురించి ట్రంప్ ఆలోచించినట్టు లేరు. ఆ పర్యవసానా లను ఎదుర్కొనగలిగే శక్తిసామర్థ్యాలు అమెరికాకు లేవు. ఇప్పటికే పీకల్లోతు రుణ భారంతో కుంగు తున్న అమెరికా ఆర్థిక వ్యవస్థ ఈ యుద్ధంలో వేలుపెడితే మరింత దిగజారుతుంది. ఏరికోరి ఈ విపత్తు తెచ్చుకోవటానికి ట్రంప్ సిద్ధపడకపోవచ్చు. అయితే రష్యాకు ఆయన విధించిన గడువులో ఒక మతలబుంది.
మరో యాభై రోజులకల్లా వేసవి ముగిసి, హిమ పాతం మొదలై రష్యాకు ఇబ్బందులెదురవుతాయి. ఇప్పటికే స్వాధీనమైన తూర్పు ఉక్రెయిన్ ప్రాంతాలు నిలబెట్టుకోవటం మినహా అది చేయగలిగేది వుండదు. ఎటూ యుద్ధం జోరు తగ్గుతుంది గనుక దాన్ని తన ఘనతగా చెప్పు కోవటమే ట్రంప్ ఆంతర్యమని నిపుణులంటున్న మాట కొట్టివేయదగ్గది కాదు. యుద్ధాన్ని అంతం చేయటానికి దాన్ని మరింత తీవ్రతరం చేస్తామనటం తెలివితక్కువైనా కావాలి... మూర్ఖత్వమైనా కావాలి. ట్రంప్ వ్యవహార శైలి దేనికి దగ్గరగా వున్నదో త్వరలో తేలిపోతుంది.