తెలుగు ఖ్యాతి ప్రపంచవ్యాప్తి | Sakshi Editorial On Telugu Nation | Sakshi
Sakshi News home page

తెలుగు ఖ్యాతి ప్రపంచవ్యాప్తి

Published Mon, Sep 20 2021 12:01 AM | Last Updated on Mon, Sep 20 2021 2:46 AM

Sakshi Editorial On Telugu Nation

తెలుగు ప్రపంచం రెండు తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాదు. దేశంలోని ఇతర రాష్ట్రాల నుంచి సైతం ఖండఖండాంతరాల వరకు విస్తరించిన ఘనత గలది మన తెలుగుజాతి. తొలి తరాల్లో విదేశాలకు వెళ్లిన తెలుగు ప్రముఖులు ఖండాంతరాలలో మన ఖ్యాతిపతాకాన్ని ఎగురవేశారు. విదేశాల్లో స్థిరపడ్డ మన తెలుగువారు ఇప్పుడు కూడా అదే పరంపరను కొనసాగిస్తున్నారు. ఇప్పుడు అమెరికాలోని తెలుగువాళ్లు సొంత విశ్వవిద్యాలయ ప్రాంగణాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. ఐదేళ్ల కిందట ప్రారంభమైన సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం శాన్‌వాకిన్‌ జిల్లా పరిధిలోని ట్రేసీ పట్టణానికి చేరువలో అరవైఏడు ఎకరాల సువిశాల స్థలంలో ప్రపంచస్థాయి విద్యాప్రాంగణ నిర్మాణాన్ని తలపెట్టింది. దీనికి సీనియర్‌ కాలేజ్‌ అండ్‌ యూనివర్సిటీ కమిషన్‌ గుర్తింపు లభించడం విశేషం. తెలుగు ప్రజలు గర్వించదగిన పరిణామం ఇది. 

ఖండాంతరాలలో తెలుగువారి కీర్తపతాక రెపరెపలకు దోహదపడిన తొలితరం ప్రముఖులను ఈ సందర్భంగా గుర్తుచేసుకోవాలి. ముఖ్యంగా తెలుగునేలకు వెలుపలి నుంచి కృషి కొనసాగించిన మహానుభావులను తలచుకోవాలి. రష్యాలో పనిచేస్తూ ఉప్పల లక్ష్మణరావు, ఇంగ్లండ్‌లో పనిచేస్తూ గూటాల కృష్ణమూర్తి గత శతాబ్దిలోనే తెలుగు వెలుగులను విదేశాలకు విస్తరించారు. వృక్షశాస్త్రవేత్తగా జగదీశ్‌చంద్ర బోస్‌ వద్ద పరిశోధనలు కొనసాగించిన ఉప్పల లక్ష్మణరావు, కమ్యూనిజం వైపు ఆకర్షితులై రష్యా వెళ్లారు. రష్యన్‌ నుంచి తెలుగులోకి దాదాపు నలభైకి పైగా పుస్తకాలను అనువదించారు. రష్యన్‌–తెలుగు నిఘంటువును నిర్మించారు. స్వాతంత్య్రోద్యమ నేపథ్యంలో రాసిన ‘అతడు–ఆమె’ నవల, ‘బతుకు పుస్తకం’ ఆత్మకథ సహా పలు రచనలు ఉప్పల స్థానాన్ని తెలుగు సాహిత్యంలో చిరస్థాయిగా నిలిపాయి. ఇక ఇంగ్లిష్‌ సాహిత్యం చదువుకున్న  గూటాల కృష్ణమూర్తి ‘లండన్‌ టైమ్స్‌’ పత్రికలో గుమస్తా ఉద్యోగం కోసం లండన్‌ చేరుకున్నారు. అక్కడే పీహెచ్‌డీ పూర్తి చేసి, ఇన్నర్‌ లండన్‌ ఎడ్యుకేషనల్‌ అథారిటీ సర్వీస్‌లో చేరి, వివిధ కళాశాలల్లో అధ్యాపకుడిగా పనిచేశారు. మహాకవి శ్రీశ్రీ చేతిరాతతో ‘మహాప్రస్థానం’ ముద్రించడమే కాకుండా, ఆయన స్వయంగా చదివిన ‘మహాప్రస్థానం’ ఆడియో టేపును రికార్డు చేశారు. ఉప్పల, గూటాల ఇద్దరూ తెలుగునేలకు వెలుపల ఒడిశాలో పుట్టి పెరిగిన వారే! 

ఉప్పల లక్ష్మణరావు బరంపురంలో, గూటాల కృష్ణమూర్తి పర్లాకిమిడిలో పుట్టారు. ఒడిశాలోని ఈ రెండు పట్టణాలూ అప్పట్లో ఒకే జిల్లాలో–గంజాం జిల్లాలో ఉండేవి. పర్లాకిమిడి ఇప్పుడు గజపతి జిల్లా కేంద్రమైంది. తెలుగునేలకు వెలుపల ఉన్న ఈ రెండు పట్టణాలూ ఆధునిక తెలుగు భాషా సాహిత్యాల్లోని కీలకమైన మలుపులకు కేంద్రస్థావరాలుగా నిలిచాయి. వ్యావహారిక భాషోద్యమ సారథి గిడుగు రామమూర్తి పర్లాకిమిడి కేంద్రంగానే తన ఉద్యమాన్ని కొనసాగించారు. తెలుగు పత్రికారంగంలో వాడుక భాషను ప్రవేశపెట్టిన ఘనత గిడుగువారి శిష్యుడు తాపీ ధర్మారావుకు దక్కుతుంది. తాపీవారు బరంపురంలోని ఖల్లికోట కళాశాలలో గణితశాస్త్ర అధ్యాపకుడిగా కొన్నాళ్లు పనిచేశారు. తన మిత్రుడు దేవరాజు వెంకట కృష్ణారావుతో కలసి బరంపురంలో ‘వేగుచుక్క గ్రంథమాల’ను స్థాపించారు. దేవరాజు వెంకట కృష్ణారావు తెలుగులో తొలి డిటెక్టివ్‌ నవల ‘వాడే వీడు’ రచించారు. తెలుగునేలకు వెలుపల పురుడు పోసుకున్న వ్యావహారిక భాషోద్యమం, డిటెక్టివ్‌ సాహిత్యం తర్వాతికాలంలో తెలుగు భాషా సాహిత్యాలపై చూపిన ప్రభావం సామాన్యమైనది కాదు. తెలుగులో తొలి డిటెక్టివ్‌ నవలా రచయితగా మాత్రమే కాదు, గళ్లనుడికట్టు పదప్రహేళిక సృష్టికర్తగా కూడా దేవరాజు వెంకట కృష్ణారావు సాధించిన ఘనత చిరస్మరణీయం. 

తెలుగునేలకు వెలుపల దేశంలోని పలు రాష్ట్రాల్లోనూ, వివిధ దేశాల్లోనూ తెలుగువాళ్లు భాషా సాంస్కృతిక సంఘాలను ఏర్పాటు చేసుకుని, భాషా సాంస్కృతిక పరిరక్షణ కోసం ఇతోధికంగా కృషి చేస్తున్నారు. తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, పశ్చిమబెంగాల్‌ వంటి రాష్ట్రాల్లో తెలుగు భాషా సాంస్కృతిక సంస్థలు నేటికీ క్రియాశీలకంగానే పనిచేస్తున్నాయి. అమెరికా, యూరోప్, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, గల్ఫ్, తూర్పు, ఆగ్నేయాసియా దేశాల్లోనూ తెలుగువారు తమ ఉనికిని చాటుకుంటూనే ఉన్నారు. మయన్మార్‌లో కొద్ది దశాబ్దాలుగా పరిస్థితులు అస్తవ్యస్తంగా మారాయి గానీ, బ్రిటిష్‌ హయాంలో తెలుగువాళ్లు గణనీయమైన సంఖ్యలోనే అక్కడకు వలస వెళ్లేవారు. అప్పట్లో అది బర్మా. దాని రాజధాని రంగూన్‌. తెలుగువాళ్లు రంగూన్‌నే ‘రంగం’గా పిలుచుకునేవారు. ఇప్పటికీ వ్యాప్తిలో ఉన్న ఆనాటి జానపద గేయాల్లోనూ, సామెతల్లోనూ వినిపించే ‘రంగం’ రంగూనే! అప్పట్లో బర్మాలో మూడు తెలుగు దినపత్రికలు నడిచేవంటే ఇప్పటి తరానికి నమ్మశక్యం కాదు గానీ, అది వాస్తవ చరిత్ర.

తెలుగు రాష్ట్రాలకు దూరంగా మనుగడ సాగిస్తున్న తెలుగు ప్రజలు, తమ ప్రాంతాల్లోని ప్రభుత్వాల సహకారం ఉన్నా, లేకున్నా, తమ భాషా సంస్కృతులను కాపాడుకోవడానికి తమ శాయశక్తులా కృషిని కొనసాగిస్తూనే ఉన్నారు. తెలుగు భాషలో విద్యాబోధనకు అవకాశాలు లేని ప్రాంతాల్లో తమ పిల్లలు కనీసం తెలుగు మాటలనైనా మరచిపోకుండా ఉండేందుకు స్వచ్ఛందంగా తెలుగు బడులు సైతం నిర్వహిస్తున్నారు. మన దేశంలోని పలు రాష్ట్రాల్లోనే కాకుండా, తెలుగువారు ఉండే కొన్ని దేశాల్లో ఇలాంటి పరిస్థితులు ఉంటే, మరికొన్ని దేశాల్లోని విశ్వవిద్యాలయాలు ఎంతో ఉదారంగా తెలుగు బోధన, పరిశోధనలకు ఆస్కారం కల్పిస్తుండటం విశేషం. విదేశాల్లో సొంత విశ్వవిద్యాలయ ప్రాంగణాన్ని ఏర్పాటు చేసుకున్న ఘనతను తమిళులు మనవాళ్ల కంటే ముందే సాధించారు. ఏదేమైతేనేం, సిలికానాంధ్ర విశ్వవిద్యాలయ ప్రాంగణం ద్వారా తెలుగు అంతర్జాతీయ భాషగా వెలుగొందగలదని ఆశించవచ్చు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement