దేశం... ధనవంతుల భోజ్యం?

Sakshi Editorial On Oxfam International Report

బలవంతుడిదే రాజ్యం అని లోకోక్తి. కానీ, ఇప్పుడు ధనవంతుడిదే రాజ్యం. ఈ సమకాలీన సామాజిక పరిస్థితి కళ్ళ ముందు కనిపిస్తున్నదే అయినా, తాజాగా లెక్కలతో సహా వెల్లడైంది. ప్రభుత్వేతర సంస్థ ‘ఆక్స్‌ఫామ్‌ ఇంటర్నేషనల్‌’ తన తాజా ప్రపంచ సంపద నివేదికలో ససాక్ష్యంగా కుండబద్దలు కొట్టింది. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సు తొలి రోజు సోమవారం ఆక్స్‌ఫామ్‌ విడుదల చేసిన ఈ నివేదికలోని అంశాలు ఉలిక్కిపడేలా చేస్తున్నాయి.

కరోనా కాలం నుంచి ప్రపంచమంతటా ఆర్థిక అంతరాలు బాగా పెరిగాయన్న వాదన అక్షరాలా నిజ మని రుజువు చేస్తున్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమై, నిరుద్యోగం పెరిగిన వేళ ప్రపంచంలోనూ, భారత్‌లోనూ సంపద అంతా కొద్దిమంది చేతుల్లోనే పోగుపడుతుండడం ఆందోళనకరం. 

2020 నుంచి కొత్తగా సమకూరిన 42 లక్షల డాలర్లలో మూడింట రెండు వంతుల సంపద ప్రపంచంలోని ఒకే ఒక్క శాతం అపర కుబేరుల గుప్పెట్లో ఉంది. మిగతా ప్రపంచ జనాభా సంపాదించిన సొమ్ముకు ఇది దాదాపు రెట్టింపు అనే నిజం విస్మయపరుస్తుంది. మన దేశానికొస్తే అగ్రశ్రేణి ఒక్క శాతం మహా సంపన్నుల చేతిలోనే 2012 నుంచి 2021 మధ్య జరిగిన సంపద సృష్టిలో 40 శాతానికి పైగా చేరింది.

ఇక, దేశ జనాభాలో అడుగున ఉన్నవారిలో సగం మంది వాటా మొత్తం 3 శాతమే. కరోనా వేళ ధనికులు మరింత ధనవంతులయ్యారు. కరోనాకు ముందు భారత్‌లో 102 మంది బిలి యనీర్లుంటే, ఇప్పుడు వారి సంఖ్య 166కు పెరిగింది. కరోనా నుంచి గత నవంబర్‌కు దేశంలో శత కోటీశ్వరుల సంపద 121 శాతం పెరిగింది. మరోమాటలో నిమిషానికి 2.5 కోట్ల వంతున, రోజుకు రూ. 3,068 కోట్లు వారి జేబులో చేరింది. కనివిని ఎరుగని ఈ తేడాలు కళ్ళు తిరిగేలా చేస్తున్నాయి. 

అలాగే, సంపన్నుల కన్నా, పేద, మధ్యతరగతి వారిపైనే అధిక పన్ను భారం పడుతోందన్న మాట ఆగి, ఆలోచించాల్సిన విషయం. భారత్‌లో జీఎస్టీ ద్వారా వస్తున్న ఆదాయంలో 64 శాతం జనాభాలోని దిగువ సగం మంది నించి ప్రభుత్వం పిండుతున్నదే.

అగ్రస్థానంలోని 10 శాతం ధనికుల ద్వారా వస్తున్నది 4 శాతమే అన్న మాట గమనార్హం. ఇవన్నీ సముద్రంలో నీటిబొట్లు. భారతదేశం శరవేగంతో కేవలం సంపన్నుల రాజ్యంగా రూపాంతరం చెందుతోందన్న అంచనా మరింత గుబులు రేపుతోంది. ధనికుల దేవిడీగా మారిన వ్యవస్థలో దళితులు, ఆదివాసీలు, ముస్లిమ్‌లు, మహిళలు, అసంఘటిత కార్మికుల లాంటి అణగారిన వర్గాల బాధలకు అంతమెక్కడ?

అర్ధాకలితో అలమటిస్తున్నవారికీ, మధ్యతరగతికీ మెతుకు విదల్చడానికి సందేహిస్తున్న పాలకులు జేబు నిండిన జనానికి మాత్రం గత బడ్జెట్‌లోనూ కార్పొరేట్‌ పన్నుల్లో తగ్గింపు, పన్ను మినహాయింపులు, ఇతర ప్రోత్సాహకాలు ఇవ్వడం విడ్డూరం. ధనికులకు పన్ను రాయితీలిస్తే, వారి సంపద క్రమంగా దిగువవారికి అందుతుందనేది ఓ భావన. అది వట్టి భ్రమ అని ఆక్స్‌ఫామ్‌ తేల్చేసింది.

కొద్దిరోజుల్లో కొత్త బడ్జెట్‌ రానున్న వేళ పెరుగుతున్న ఆర్థిక అంతరాన్ని చక్కదిద్దడానికి సంపద పన్ను విధించాలంటోంది. పేద, గొప్ప తేడాలు ఇప్పుడు ఎంతగా పెరిగాయంటే, భారత్‌లో అగ్రస్థానంలో నిలిచిన తొలి 10 మంది కుబేరులపై 5 శాతం పన్ను వేసినా చాలు. దాంతో దేశంలో పిల్లలందరినీ మళ్ళీ బడి బాట పట్టించవచ్చు. 

దేశంలోకెల్లా మహా సంపన్నుడైన గౌతమ్‌ అదానీ సంపద నిరుడు 2022లో 46 శాతం మేర పెరిగింది. దేశంలోని అగ్రశ్రేణి 100 మంది అపర కుబేరుల సమష్టి సంపద ఏకంగా 66 వేల కోట్ల డాలర్లకు చేరింది. అదానీ ఒక్కరికే 2017 – 2021 మధ్య చేకూరిన లబ్ధిపై 20 శాతం పన్ను వేస్తే, రూ. 1.79 లక్షల కోట్లు వస్తుంది. దాంతో దేశంలోని ప్రాథమిక పాఠశాల టీచర్లలో 50 లక్షల పైమందికి ఏడాదంతా ఉపాధినివ్వవచ్చని ఆక్స్‌ఫామ్‌ ఉవాచ.

ఈ అంచనాలు తార్కికంగా బాగున్నా, ఆచరణాత్మకత, గత అనుభవాలను కూడా గమనించాలి. సంపద పన్ను సంగతే తీసుకుంటే, మనదేశంలో 1957లోనే దాన్ని ప్రవేశపెట్టారు. కానీ, భారీ ఎగవేతలతో లాభం లేకపోయింది. అసమానతలూ తగ్గలేదు. చివరకు, సంపద పన్ను వసూళ్ళతో పోలిస్తే, వాటి వసూలుకు అవుతున్న ఖర్చు ఎక్కువుందంటూ 2016–17 బడ్జెట్‌లో అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ దాన్ని ఎత్తేశారు. అందుకే, మళ్ళీ సంపద పన్ను విధింపు ఆలోచనపై సమగ్రంగా కసరత్తు అవసరం. 

పన్నుల వ్యవస్థలో మార్పులు తేవాలి. కాకుంటే, భారత్‌ లాంటి దేశంలో మధ్యతరగతిని పక్కనపెడితే, మహా సంపన్నులపై ఏ పన్ను వేసినా, అడ్డదోవలో దాన్ని తప్పించుకొనే పనిలో ఉంటారనేది కాదనలేని వాస్తవం. కాబట్టి, భారీ పన్నుల ప్రతిపాదన కన్నా దేశ సామాజిక – ఆర్థిక విధానంలో వారిని భాగం చేయడం లాంటి ఆలోచనలు చేయాలి. విద్య, వైద్యం, ప్రాథమిక వసతి సౌకర్యాల కల్పనల్లో ఈ కుబేరుల సంపదను పెట్టేలా చూడాలి. 

దారిద్య్ర నిర్మూలనకు కార్పొరేట్‌ అనుకూలత కన్నా సామాన్య ప్రజానుకూల విధానాలే శరణ్యం. స్త్రీ, పురుష వేతన వ్యత్యాసాన్నీ నివారించాలి. కార్పొరేట్‌ భారతావనిలో సీఈఓలు ఓ సగటు మధ్యశ్రేణి ఉద్యోగితో పోలిస్తే 241 రెట్ల (కరోనాకు ముందు ఇది 191 రెట్లు) ఎక్కువ జీతం సంపాదిస్తున్న వేళ... సత్వరం ఇలాంటి పలు దిద్దుబాటు చర్యలు అవసరం.

గత 15 ఏళ్ళలో 41 కోట్లమందిని దారిద్య్ర రేఖకు ఎగువకు తెచ్చామని లెక్కలు చెప్పి, సంబరపడితే చాలదు. ఇప్పటికీ అధికశాతం పేదసాదలైన ఈ దేశంలో ఆర్థిక అంతరాలు సామాజిక సంక్షోభానికి దారి తీయక ముందే పాలకులు విధానపరమైన మార్పులు చేయడమే మార్గం. 

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top