ముడి చమురు మహా యుద్ధం!

Sakshi Editorial On Crude Oil

చమురు విపణి చరిత్రలో తొలిసారిగా ఒక పక్క అమెరికా, చైనా, జపాన్, భారత్, దక్షిణా కొరియా, బ్రిటన్‌లు. మరోపక్క సౌదీ అరేబియా సారథ్యంలోని ‘పెట్రోలియం ఎగుమతి దేశాల సమాఖ్య’ (ఒపెక్‌) ప్లస్‌. ఒకవైపు ప్రపంచమంతటా పెరుగుతూ, మూడేళ్ళ అత్యధికానికి చేరిన ముడి చమురు ధరలకు పగ్గం వేయడానికి ఉత్పత్తి, సరఫరాలు పెంచాలంటున్న అమెరికా తదితర ఆసియా దేశాలు. మరోవైపు పెడచెవిన పెడుతున్న ఒపెక్‌ ప్లస్‌ సభ్యులు. అందుకే, 50 మిలియన్‌ బ్యారళ్ళ ఆయిల్‌ అమెరికా, 5 మిలియన్‌ బ్యారళ్ళు భారత్‌ తమ అత్యవసర నిల్వల నుంచి విడుదల చేస్తామంటూ ప్రకటించడం కీలక పరిణామం.

కొన్ని ఆసియా దేశాలు కలిసొస్తున్నాయి. ధరలు తగ్గి, ద్రవ్యోల్బణం అదుపు కావడం కోసమే ఇలా రిజర్వుల నుంచి ఆయిల్‌ను విడుదల చేస్తు్తన్నట్టు దేశాల మాట. కానీ, ఈ నిర్ణయంతో ఆశించినట్టు చమురు ధరలు తగ్గుతాయా అన్నది ప్రశ్న. పైగా, ఒపెక్‌ ప్లస్‌ దేశాల వ్యతిరేక కూటమి అన్నట్టుగా మారిన ఈ చమురు వినియోగ దేశాల చర్యకు ‘ఒపెక్‌’ ప్లస్‌ నుంచి ప్రతిచర్య తప్పకపోవచ్చు. వ్యూహ ప్రతివ్యూహాల మధ్య అక్షరాలా ఇది ముడి చమురు యుద్ధమే!  

దీనికి దారి తీసిన పరిస్థితులు అనేకం. కరోనా తారస్థాయికి చేరినవేళ చమురు సరఫరాలను ‘ఒపెక్‌’ ప్లస్‌ దేశాలు తగ్గించాయి. ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడంతో, చమురు డిమాండ్‌ పెరిగింది. ఆయిల్‌ ధరలేమో ఈ ఏడాది 50 శాతానికి పైగా పెరిగాయి. ద్రవ్యోల్బణం భారమైంది. ఈ పరిస్థితుల్లో ఉత్పత్తి పెంచి, త్వరితగతిన మునుపటి స్థాయికి సరఫరాలు తీసుకురమ్మని ఒపెక్‌ ప్లస్‌ను వివిధ దేశాలు కోరాయి. అయినా లాభం లేకపోయింది.

దాంతో, కలసికట్టుగా చమురు ధరకు చెక్‌ చెప్పడానికి అమెరికా అభ్యర్థనతో ఇతర దేశాలూ కదిలాయి. మునుపెన్నడూ లేనంత అత్యధికంగా అమెరికా విడుదల చేస్తున్న నిల్వలు ఈ డిసెంబర్‌ మధ్య నుంచి చివరిలోగా మార్కెట్‌లోకి రానున్నాయి. దీని వల్ల అంతర్జాతీయ ఆయిల్‌ మార్కెట్‌ నిలకడగా మారుతుందన్నది ఆశ. 

నిజానికి, చమురు సంక్షోభం తలెత్తిన 1973–74లో స్వతంత్ర సంస్థ ‘ఇంటర్నేషనల్‌ ఎనర్జీ ఏజెన్సీ’ (ఐఈఏ) ఏర్పాటైంది. 30 సభ్యదేశాల ఈ సంస్థ అప్పటి నుంచి ఆర్థిక సంపన్న దేశాల పక్షాన ప్రపంచవ్యాప్త ముడిచమురు సరఫరాలను పర్యవేక్షిస్తోంది. ఈ ఏజెన్సీ ఏర్పాటయ్యాక ఇప్పటిలా కొన్ని దేశాలు కలిసి ఓ సమన్వయంతో అత్యవసర నిల్వల నుంచి ఆయిల్‌ విడుదల గతంలో మూడేసార్లు జరిగింది.

అవి – 1991లో గల్ఫ్‌ యుద్ధం, 2005లో కత్రినా – రీటా తుపాన్లతో మెక్సికో గల్ఫ్‌లో చమురు వసతులు దెబ్బతిన్న సందర్భం, 2011లో లిబియాలో యుద్ధంతో చమురు సరఫరాకు అంతరాయం ఏర్పడిన సమయం! ఇప్పుడిది నాలుగోసారి. క్రిస్మస్‌ సెలవులు దగ్గర పడుతున్న అమెరికాలో ఇంధనం సగటున గ్యాలన్‌ 3.41 డాలర్లు పలుకుతోంది. 2014 నుంచి ఇదే అత్యధికం. గ్యాసోలిన్‌ రేటూ గత ఏడాది కన్నా 1.29 డాలర్లు పెరిగింది. అనేక సవాళ్ళతో ప్రతిష్ఠ దెబ్బతిన్న బైడెన్‌కు.. ఈ ప్రయాణాల సీజన్‌లో సగటు అమెరికన్ల కోసం నిల్వల విడుదల తప్పలేదు. 

ప్రపంచ చమురు వినియోగంలో అమెరికా, చైనాల తర్వాత మూడో స్థానం భారత్‌దే. తర్వాతి స్థానాలు జపాన్, దక్షిణ కొరియాలవి. ప్రపంచవ్యాప్తంగా రోజుకు 99 మిలియన్‌ బ్యారళ్ళ చమురు సరఫరా అవుతుంది. వీటన్నిటి అత్యవసర నిల్వలు కలిపినా, 15 రోజుల ప్రపంచ సరఫరాకే సరి. వీటిలో అత్యధికంగా 714 మిలియన్‌ బ్యారళ్ళ అత్యవసర నిల్వలున్నవి అమెరికా వద్దే! 39 మిలియన్‌ బ్యారళ్ళ నిల్వలు మన దగ్గరున్నాయి. ఇంధన ధరలు తగ్గేందుకు నిల్వలను విడుదల చేయాలని మునుపెన్నడూ లేని రీతిలో అమెరికా గత వారం అభ్యర్థించింది.

ఆ ప్రతిపాదనను భారత్‌ మొదట ప్రశ్నించింది. చివరకు రోజువారీ దేశీయ వినియోగానికి సమానమైన మొత్తంలో 5 మిలియన్‌ బ్యారళ్ళ నిల్వల విడుదలకు సై అంది. ప్రతీకాత్మకమే అయినా, ఈ చర్య వల్ల మనకు లాభం కన్నా నష్టమనే వాదనా ఉంది. ఇక ప్రపంచంలో అతి పెద్ద చమురు దిగుమతిదారు చైనా. తమ దేశంలో ఆయిల్‌ ధరకు కళ్ళెం వేయడానికి ఈ ఏడాది ఇప్పటికే చాలాసార్లు నిల్వలు విడుదల చేసింది. వివరాలు వెల్లడించనప్పటికీ, తాజా కలసికట్టు ప్రయత్నానికీ బాసటగా నిలుస్తానంటోంది.

1100 బిలియన్‌ బ్యారళ్ళ నిల్వలున్న ఒపెక్‌ ప్లస్‌కు, మరెన్నో లక్షల బ్యారళ్ళ మిగులు ఉత్పత్తి సామర్థ్యం ఉంది. అయినా సరే, డిమాండ్‌కు తగ్గట్టు ఉత్పత్తి పెంచడం లేదు. యూరప్‌లోని తాజా లాక్డౌన్లు సహా అనిశ్చిత పరిస్థితులను సాకుగా చూపుతోంది. ఉత్పత్తిని తగ్గించి, ధరలు పెరిగేలా చేస్తోందనే అనుమానానికీ తావిచ్చింది. ఇక తప్పక... ‘ప్రపంచ చమురు విపణి వేదికపై మీరే కాదు.. మేమూ ఉన్నామ’న్నట్టు ఒపెక్‌ ప్లస్‌కు కొన్ని దేశాలు పరోక్షంగా సవాలు విసిరినట్టయింది. డిసెంబర్‌ 2న సమావేశమయ్యే ఒపెక్‌ ప్లస్‌ దీనికెలా స్పందిస్తుందో, పరిణామాలెలా ఉంటాయో చూడాలి. 

ఇప్పటికైతే నిల్వల విడుదల ప్రకటన ప్రభావం లేదు. బుధవారం ఆయిల్‌ ధరలు వారంలోకెల్లా గరిష్ఠానికి చేరాయి. ఒకవేళ రేపు ధరలు తగ్గినా, అదీ తాత్కాలికమే. సరఫరాల్లో సమస్యలు తలెత్తితే తట్టుకోవడానికని పెట్టుకున్న నిల్వలతో అధిక ధరలను నియంత్రించాలనుకోవడం చురకత్తితో పెనుయుద్ధం చేయాలనుకోవడమే! తాజా చమురు పోరుతో అమెరికా, సౌదీ అరేబియా సంబంధాలూ మరింత దెబ్బతినవచ్చు. కానీ ఇప్పటికీ భయపెడుతున్న కరోనా నుంచి కొన్ని దేశాలు, ఆర్థిక మందగమనం నుంచి మిగతా దేశాలు బయటపడడమే ప్రస్తుతం కీలకం! ఒపెక్‌ చేతిలో ఆటబొమ్మ కాకూడదంటే, సౌరశక్తి లాంటి తరగని ఇంధన వనరుల వైపు మళ్ళడమే ఎప్పటికైనా శరణ్యం!! 

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top