
జనతంత్రం
ఆంధ్రప్రదేశ్‌లోని తోతాపురి మామిడి రైతుల హాహాకారాలు ఆ రాష్ట్ర సరిహద్దుల్ని దాటి ప్రతిధ్వనిస్తున్నాయి. కిలోకు పన్నెండు రూపాయలు కనీస ధరగా నిర్ణయించిన ప్రభుత్వం కార్యాచరణపై మాత్రం ముసుగేసింది. ఫలితంగా రెండు రూపాయలకు కూడా కొనే నాథుడు లేక రైతులు మామిడి కాయల్ని రోడ్లపై పారబోస్తున్న దృశ్యాలు దర్శనమిచ్చాయి.
పారబోయడానికి మనసొప్పని రైతులు రవాణా ఖర్చులు వచ్చినా చాలని హైదరాబాద్ వంటి దూర ప్రాంత మార్కెట్లకు తరలించిన ఉదంతాలు కోకొల్లలు. తీవ్రమైన నష్టాల్లో కూరుకుపోతున్న ఈ పరిస్థితుల్లో పసిబిడ్డల్లా పెంచుకున్న చెట్లను నరికేయాలో, చేతిలో వున్న కొడవలితో మెడనే నరుక్కోవాలో అర్థం కావడం లేదంటూ ఒక రైతు వాట్సప్‌లో పెట్టిన మెసేజ్ కంటతడి పెట్టించింది.
ఇదొక్క మామిడి రైతుల ఆక్రందనే కాదు. ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రైతులందరి ఉమ్మడి ఆవేదన ఇదే. జగన్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు క్వింటాల్‌కు 24 వేలు పలికిన ధర ఇప్పుడు గరిష్ఠంగా ఏడు వేలు దాటకపోవడంతో మిర్చి రైతు కుదేలయ్యాడు. పత్తి ధర పదివేల నుంచి ఐదు వేలకు అంటే సగానికి సగం పడిపోయింది. అప్పుడు 18 వేల దాకా దక్కించుకున్న పొగాకు ఇప్పుడు గరిష్ఠంగా 6 వేలకు పడిపోయింది.
పసుపు, కందులు, మినుములు, వేరుశనగ, మొక్కజొన్న, పెసలు, ఉల్లిపాయలు, టమాటా, మామిడిపళ్ళు, అరటి, బొప్పాయి, డ్రాగన్ ఫ్రూట్ వగైరా వ్యవసాయ ఉత్పత్తుల ధరలన్నీ సగానికి పడిపోయాయి. ఆనాటి జగన్ ప్రభుత్వం ప్రత్యేకంగా ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి ధరలు పతనమవకుండా మార్కెట్‌లో జోక్యం చేసుకునే విధానాన్ని అవలంబించడం సత్ఫలితాలనిచ్చి మంచి ధరలు లభించాయి. రైతన్నకు దరహాసాన్నిచ్చాయి.
చంద్రబాబు ప్రభుత్వం ఆ బాధ్యతను వదిలేసింది. మొత్తంగా వ్యవసాయ రంగానికి సంబంధించినంత వరకు ఈ ప్రభుత్వం కాడి పారేసింది. జగన్‌మోహన్‌రెడ్డి ఇస్తున్న రైతు భరోసా కంటే అధికంగా ఇస్తానని హామీ ఇచ్చి వరసగా రెండో యేడు కూడా ఎగనామం పెట్టింది. వ్యవసాయ రంగం ఈ ప్రభుత్వ ప్రాధాన్యత క్రమంలో లేదు. తొలిసారి అధికారంలోకి వచ్చినప్పుడే కేంద్రం కట్టాల్సిన పోలవరాన్ని అడిగి తెచ్చుకొని తన కమీషన్ల ప్రాధాన్యాన్ని ఆ ప్రభుత్వం చాటి చెప్పుకున్నది. రెండోసారి అదే ప్రాధాన్యతను అమరావతి రూపంలో నిలబెట్టుకొన్నది. క్వాంటమ్ వ్యాలీ, డీప్ టెక్నాలజీ, ఏఐ వగైరాలన్నీ అమరావతి హైప్ కోసం కైపెక్కించడం తప్ప ఆచరణాత్మకమైన మాటలు కావనే అభిప్రాయం బలంగా వినిపిస్తున్నది.
క్వాంటమ్ వ్యాలీకి అవసరమయ్యే ఎకో సిస్టమ్ అమరావతికి అందుబాటులోకి రావడమనేది ఒక సుదూర స్వప్నమే తప్ప ప్రభుత్వం చెబుతున్నట్టు ఐదేళ్లలో ఐదు లక్షల ఉద్యోగాలు కల్పించే స్థితి అసంభవమని నిపుణులు చెబుతున్నారు. మధ్యతరగతిని మభ్యపెట్టడానికి యువతకు జోల పాడటానికి ఇటువంటి పదజాలాన్ని వెదజల్లడం బాబు కాకస్‌కు వెన్నతో పెట్టిన విద్య. ఈ జోలపాటల మాటున అమరావతిలో జరుగుతున్న అసలు కార్యక్రమమేమిటో చాలామందికి అర్థమైంది.
అమరావతి పేరుతో ఇప్పటికే తెచ్చిన అప్పులే కాదు, ఇంకా అవసరమైన అప్పులు తీర్చడానికి భూములు అమ్ముతామనీ, అదో సెల్ఫ్ ఫైనాన్స్ కేపిటలనీ చెబుతూ వచ్చారు. తొలుత సమీకరించిన భూముల్లో రైతుల వాటా తీసేయగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అవసరాలకు పోనూ మిగిలిన భూముల అమ్మకంతో తెచ్చిన అప్పులు తీర్చడం సాధ్యం కాదనే మాట వినిపిస్తున్నది. ఈ తత్వం బోధపడినందువల్లనే ప్రపంచ బ్యాంకు వాళ్లు ఈ మధ్య ప్రభుత్వానికి తాఖీదులు పంపారట! మీరు అమ్మబోయే భూములెన్ని? ఎప్పటిలోగా అమ్ముతారు? వాటి ద్వారా ఎంత డబ్బు సమీకరిస్తారో చెప్పండని వారు అడుగుతున్నారని సమాచారం.
ఇప్పుడు కొత్తగా 45 వేల ఎకరాల భూసేకరణ ప్రయత్నాలకు రైతులు ముందుకు రాకపోవడంతో ప్రభుత్వంలో కలవరం మొదలైనట్టు కనిపిస్తున్నది. కాకస్ పరంగా ఎంత సంపాదించుకున్నా ప్రభుత్వపరంగా మాత్రం అమరావతి ప్రాజెక్టు ఒక నిరర్థక ఆస్తిగానే మిగిలిపోయే ప్రమాదముందనే హెచ్చరికలు వినబడుతున్నాయి.
పోలవరం – బనకచర్ల ప్రాజెక్టు పేరుతో ఈ మధ్యకాలంలో బాబు ప్రభుత్వం చేస్తున్న హడావుడి కూడా కమీషన్ల స్టార్టప్ కథేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 80 వేల కోట్లతో చేపట్టే ఈ ప్రాజెక్టు రాష్ట్రంలో గేమ్ ఛేంజర్ కాబోతున్నదని ఆయన చెబుతున్నారు.
ఈ ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలపై రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన నివేదికలో పేర్కొన్న సమాచారం ప్రకారం, ఇది పూర్తయితే ఏడు లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకూ, ఇంకో 23 లక్షల ఎకరాల స్థిరీకరణకూ ఉపయోగపడుతుంది. జలయజ్ఞంలో భాగంగా ప్రారంభించి చాలావరకు పూర్తయి పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ఇంకో 14 వేల కోట్లు సరిపోతుందనీ, ఈ పని చేస్తే కూడా అంత ఆయకట్టు అందుబాటులోకి వస్తుందనీ చెబుతున్నారు.
అటువంటప్పుడు ఏది తొలి ప్రాధాన్యత కావాలి? 14 వేల కోట్లతో పెండింగ్ పనులు పూర్తి చేయడమా? 80 వేల కోట్లతో కొత్త ప్రాజెక్టును తలకెత్తుకోవడమా? గోదావరి వరద జలాలను ఉపయోగించుకోవాలన్న ఆలోచన ఆ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా అవసరమే కావచ్చు. ఈ ఆలోచన కూడా వాస్తవానికి గత ప్రభుత్వంలో వచ్చినదే.
కానీ సత్వరం పూర్తి కావలసిన ప్రాజెక్టులకు పైసా విదల్చకుండా చేపట్టిన ఈ నిర్హేతుకమైన ప్రాధాన్యతాక్రమం దేన్ని సూచిస్తుంది? భారీ ప్రాజెక్టుతో భారీ కమీషన్ల దురాశతోనే ఈ రకమైన ఎంపిక చేసుకున్నారంటే తప్పవుతుందా? రాష్ట్రంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర ఇప్పించలేకపోయిన ప్రభుత్వం, ఉన్న ఊరిలోనే కల్తీలేని విత్తనాలు, ఎరువులు అందుబాటులోకి తెస్తున్న ఆర్‌బీకేలను మూసి పారేసిన ప్రభుత్వం రైతన్నల కన్నీరు తుడవడానికి భారీ ప్రాజెక్టులను సంకల్పించిందంటే నమ్మశక్యమేనా?
ఆలూ లేదు, చూలూ లేదు అన్నట్టుగా బాబు ఈ ప్రాజెక్టును పూర్తిచేసే అవకాశమే లేనప్పటికీ దీనిపై తెలంగాణలోని అధికార ప్రతిపక్షాలు సిగపట్లకు దిగడం ఒక విశేషం. చంద్రబాబుతో సాన్నిహిత్యం కారణంగానే ఆయన ప్రతిపాదనకు రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం చెప్పలేదని బీఆర్‌ఎస్ ఆరోపించింది. దీనిపై గత కొన్ని వారాలుగా తీవ్రస్థాయిలో వాదోపవాదాలు జరుగుతున్నాయి. ఈ పంచాయితీలో బీఆర్‌ఎస్ వాదానిదే పైచేయిగా ఉన్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
దానికి ఇతరత్రా కారణాలు కూడా కొన్ని దోహదపడి ఉండవచ్చు. ప్రెస్‌మీట్లలో కాదు, అసెంబ్లీలో చర్చిద్దాం రండని తాజాగా కాంగ్రెస్ మంత్రులు సవాల్ విసురుతున్నారు. పదిహేనేళ్లు ముఖ్యమంత్రిగా ఉండి ఏ ప్రాజెక్టునూ పూర్తిచేసిన రికార్డు లేని చంద్రబాబు చిటికెల పందిరిని ఆంధ్ర ప్రజలెవరూ పట్టించుకోకపోయినా తెలంగాణలో అది మంట పుట్టించడం విశేషం.
ఒకపక్క అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాల రూపంలో భారతీయ రైతును బలిపీఠమెక్కించే సూచనలు పొడసూపుతున్నాయి. వాణిజ్య ఒప్పందం కోసం అమెరికా విధించిన మూడు మాసాల గడువు ఈ నెల తొమ్మిదో తేదీతో ముగిసిపోనున్నది. ఈలోగా భారత్‌తో కనీసం మినీ ఒప్పందమైనా జరగాలని ట్రంప్ పట్టుపడుతున్నారు. రెండు దేశాల ప్రతినిధుల మధ్య గత వారం రోజులుగా చర్చోపచర్చలు జరుగున్నాయి.
జన్యుమార్పిడి సోయాచిక్కుడు, మొక్కజొన్నలను, యాపిల్స్‌ను, డెయిరీ ఉత్పత్తులను తక్కువ సుంకాలతో భారత మార్కెట్‌లోకి అనుమతించాలని అమెరికా డిమాండ్ చేస్తున్నది. వందల ఎకరాల భారీ కమతాల్లో పూర్తిగా యంత్రాల సాయంతో, దాదాపు యాభై శాతం సబ్సిడీ ఇస్తున్న ప్రభుత్వం దన్నుతో చౌకగా వచ్చే అమెరికా వ్యవసాయ ఉత్పత్తులు తక్కువ సుంకాలతోనే మళ్లీ మార్కెట్‌లోకి ప్రవేశిస్తే భారతీయ రైతు తట్టుకోగలడా? పైగా భారతీయ వ్యవసాయ రంగంలోకి, ఫుడ్ చెయిన్‌లోకి జన్యుమార్పిడి ఉత్పత్తులను అనుమతించకపోవడం భారత్ విధానంగా ఉంటూ వస్తున్నది.
ఫుడ్ చెయిన్ పరిధిలోకి రాదనే కారణంతో పత్తిలోకి ఇప్పటికే జన్యుమార్పిడి విత్తనాలు ప్రవేశించాయి. రేపోమాపో కుదరనున్న మినీ వాణిజ్యం ఒప్పందంతో ఏం జరగనున్నదని దేశం ఆసక్తిగా ఎదురుచూస్తున్నది. అమెరికా విధించే గడువుకంటే తమకు దేశ ప్రయోజనాలే ముఖ్యమని ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ ఇంటర్వ్యూలో వాణిజ్య–పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ ఘంటాపథంగా చెప్పారు.
శనివారం నాటి పత్రికలో వచ్చిన ఈ ఇంటర్వ్యూలో ‘మన వ్యవసాయ రంగానికి నష్టం కలిగించే ఎటువంటి ఒప్పందాన్ని చేసుకోబోమ’ని ఆయన చెప్పారు. మొక్కజొన్న ఉత్పత్తిలో టాప్ ఫైవ్‌లో ఉన్న బిహార్ అసెంబ్లీ ఎన్నికల ముంగిట్లో ట్రంప్ ప్రతిపాదనలు అంగీకరించడం బీజేపీకి కూడా ఆత్మహత్యా సదృశమే.
వాణిజ్య చర్చల్లో పాల్గొంటున్న అధికారుల భోగట్టాగా పేర్కొంటూ బ్లూమ్‌బర్గ్ లాంటి వార్తా సంస్థలు మరో కథనాన్ని చెబుతున్నాయి. కేవలం పశువుల దాణా కోసం, పౌల్ట్రీ దాణా కోసం ఉపయోగపడే విధంగా మొక్కజొన్న, సోయా చిక్కుళ్ల ఉప ఉత్పత్తులను అనుమతించే మినీ ఒప్పందం కుదిరే అవకాశముందని ఈ కథనాల సారాంశం.
మినీ రవ్వ రూపంలో వచ్చినంత మాత్రాన అది జన్యుమార్పిడి పంట కాకుండా పోతుందా? పశువుల దాణా, కోళ్ల దాణాలోకి ప్రవేశిస్తే అది ఫుడ్ చెయిన్‌లో భాగం కాకుండా పోతుందా అనేవి చర్చనీయాంశాలు. రెండుమూడు రోజుల్లో జరిగే మినీ ఒప్పందం అనంతరం, మూడు నాలుగు నెలల్లో జరిగే పూర్తి స్థాయి ఒప్పందం అనంతరం మాత్రమే ఈ అంశంపై ఒక స్పష్టత వస్తుంది. ప్రస్తుతానికి దాణా రూపంలో ప్రవేశించినా, ఒంటె గుడారంలోకి కాళ్లు జాపితే ఏం జరుగుతుందో భవిష్యత్తులో అదే జరుగుతుంది.
చంద్రబాబు వంటి వ్యవసాయ వ్యతిరేక విధానాలు అనుసరించే పాలకుల కారణంగా పాతికేళ్ల కిందటే మన రైతులు ఉరితాళ్లు పేనుకున్నారు. ఇప్పుడు కొడవళ్లు మెడపైకి చేర్చుకుంటున్నారు. భవిష్యత్తులో అమెరికా జన్యుమార్పిడి పంట ఉత్పత్తులు భారత మార్కెట్‌లోకి ప్రవేశిస్తే వ్యవసాయం దండగన్న బాబు జోస్యం నిజమవుతుంది. ఈ విషయంలో నిజంగానే ఆయన విజనరీగా నిలబడిపోతారు.
వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com