మానవహక్కులు–భాష్యాలు

Sakshi Editorial Article On Narendra Modi Comment Over Human Rights Violations

మానవహక్కులను కొందరు రాజకీయ దృక్కోణంలోనుంచి చూస్తున్నారని...అందువల్ల దేశ ప్రతిష్ఠ దెబ్బతింటున్నదని ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం చేసిన వ్యాఖ్యపై విస్తృతంగానే చర్చ నడుస్తోంది. ఒకచోట ఏ చిన్న ఘటన జరిగినా మానవ హక్కుల ఉల్లంఘనగా అభివర్ణించే కొందరు ఆ మాదిరి ఘటనలే మరోచోట చోటుచేసుకుంటే మౌనంవహిస్తారన్నది ఆయన ఆరోపణల సారాంశం. ప్రధాని ప్రస్తావించిన అంశాలను బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్‌ పాత్ర మరికొంత విశదీకరించారు. కాంగ్రెస్‌ నేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ తమను తాము దళిత హక్కుల చాంపియన్లుగా చెప్పుకుంటూ రాజస్థాన్‌లోనూ, కొన్ని ఇతర రాష్ట్రాలలోనూ దళితులపై సాగుతున్న అత్యా చార ఘటనల విషయంలో మాత్రం మౌనం పాటిస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్‌కు కొత్త కావొచ్చు గానీ... మన దేశంలోనూ, వేరే దేశాల్లోనూ హక్కుల సంఘాలు ఏదో ఒక దశలో పక్షపాత ఆరోప ణలు ఎదుర్కొన్న సందర్భాలున్నాయి. ఈ క్రమంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పౌరహక్కుల సంఘంలో చీలిక కూడా వచ్చింది. అధికార, విపక్షాల నడుమ సాగే వ్యాగుద్ధాల్లో ఇది వినబడటం తాజా పరిణామం. ఈమధ్య ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్‌ ఖేడిలో రైతు ఉద్యమనేతలను పట్టపగలు వాహనంతో ఢీకొట్టి హత్య చేసిన ఉదంతంపై ఆందోళన చేస్తున్న కాంగ్రెస్‌ ఈ నెల 1, 7 తేదీల్లో రాజస్థాన్‌లో దళితులపై అత్యంత అమానుషంగా జరిగిన దాడి ఘటనలను మరుగుపరుస్తున్నదని బీజేపీ చేసిన వ్యాఖ్య కొట్టిపారేయదగ్గది కాదు. ఈ ఉదంతాల్లో కేసులు నమోదుచేశామని, నిందితు లను అరెస్టు చేశామని రాజస్థాన్‌ పోలీసులు చెబుతున్నా అక్కడ తరచుగా దళితులపై, మైనారిటీలపై సాగుతున్న దాడులను నిలువరించలేకపోవటం ఆ రాష్ట్ర ప్రభుత్వ అసమర్థతే.

ఏటా డిసెంబర్‌ 10న మానవ హక్కుల పరిరక్షణ దినోత్సవాన్ని జరుపుకోవాలని 1948లో ఐక్య రాజ్యసమితి పిలుపునిచ్చింది. దారిద్య్రం అత్యంత అమానుషమైన మానవ హక్కుల ఉల్లంఘనగా  ప్రకటించింది. తర్వాత ఆ సంస్థ ఆధ్వర్యంలో అనేక మార్గదర్శకాలు రూపొందుతూ వచ్చాయి. ఈలోగా హక్కులు కాలరాసే ప్రభుత్వాల తీరుపై పలు దేశాల్లో ఉద్యమాలు బయల్దేరాయి. పాలకు లపై ఒత్తిళ్లు అధికమయ్యాయి. మన దేశంలో 60వ దశకం చివరిలో హక్కుల ఉద్యమాలు మొగ్గతొడి గాయి. దక్షిణాఫ్రికాలో జాత్యహంకార ప్రభుత్వ ఆగడాలు, బోస్నియా, రువాండా, బురుండీ, అంగోలా వంటిచోట్ల సాగిన నరమేథాలు, తూర్పు యూరప్‌ దేశాల్లో హక్కుల ఉల్లంఘనలు ప్రపంచ వ్యాప్తంగా అందరినీ ఆలోచింపజేశాయి. ఆ తర్వాతే ప్రపంచ దేశాలన్నీ వ్యవస్థాగతమైన, తటస్థమైన మానవ హక్కుల సంఘాలు ఏర్పాటు చేసుకోవాలని 1991లో పారిస్‌లో జరిగిన మానవహక్కుల సదస్సు పిలుపునిచ్చింది. దీన్ని 1993లో ఐక్యరాజ్య సమితి కూడా ధ్రువీకరించాక అనేక దేశాల్లో మానవ హక్కుల సంఘాలు ఏర్పాటయ్యాయి. అయితే ఇవి ఆచరణలో సామాన్య ప్రజానీకానికి  పెద్దగా ఉపయోగపడిన దాఖలా లేదు. వీటికి నామమాత్ర అధికారాలులిచ్చి, లాంఛనప్రాయం చేసిన ప్రభుత్వాలే ఇందుకు కారణం. ఆ సంఘాలకు చేసే నియామకాలు కూడా అసంతృప్తినే మిగులుస్తున్నాయి.

మన దేశంలో శాసన, కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థల పరంగా జరిగే లోటుపాట్లను వేలెత్తి చూపేందుకు, సామాన్యులకు ఊరటనిచ్చేందుకు ఏర్పాటైనా యేటా ఈ సంఘాలు ఇచ్చే నివే దికలనూ, వివిధ సందర్భాల్లో ఇవి చేసే సిఫార్సులనూ ప్రభుత్వాలు సరిగా పట్టించుకోవడంలేదు. వాటి అమలుకు తిరిగి న్యాయ స్థానాలను ఆశ్రయించాల్సివస్తోంది. మానవ హక్కుల సంఘాలు చేసే సిఫార్సులు అమలుపరిచి తీరవలసినవా కాదా అనే అంశంపై చాన్నాళ్లుగా అయోమయం ఉంది. మానవ హక్కుల సంఘాల అధికారాలు, విచారణలు న్యాయపరమైన కార్యకలాపాలుగానే పరిగణిం చాలని, వాటికి సివిల్‌ కోర్టులకుండే అధికారాలుంటాయని సుప్రీంకోర్టు వేరే సందర్భంలో చెప్పినా పరిస్థితి  పెద్దగా మారలేదు. మానవహక్కుల సంఘాలు చేసే సిఫార్సులకు  మానవహక్కుల చట్టం సెక్షన్‌ 18 ఇస్తున్న భాష్యంపై ఇన్నేళ్లయినా సుప్రీంకోర్టుతోసహా దేశంలోని ఏ న్యాయస్థానమూ సంది గ్ధతకు తావులేని విధంగా తీర్పులు వెలువరించలేదు.  ఈ ఏడాది ఫిబ్రవరిలో మద్రాస్‌ హైకోర్టు ఫుల్‌ బెంచ్‌ ఆ పని చేసింది.  సెక్షన్‌ 18 మానవ హక్కుల సంఘాలకు తిరుగులేని అధికారాలిస్తోందని తేల్చిచెప్పింది. ఈ చట్టం మరింత ప్రభావవంతంగా ఉండేందుకు తగిన సవరణలు అవసరమని సూచించింది. దానిపై కేంద్రం ఇంతవరకూ దృష్టి పెట్టిన దాఖలాలు లేవు.

మానవ హక్కుల సంఘం సంస్థాపక దినోత్సవంనాడు ఆ సంఘాల పటిష్టతపై చర్చ జరిగితే, వాటికి విస్తృతమైన అధికారాలు కల్పించే దిశగా చర్యలుంటే బాగుండేది. సుప్రీంకోర్టు ఆదేశిస్తే తప్ప లఖింపూర్‌ ఖేడి ఘటనలో ప్రధాన బాధ్యుడని ఆరోపణలొచ్చిన కేంద్ర మంత్రి కుమారుణ్ణి యూపీ పోలీసులు అరెస్టు చేయలేని దుస్థితి నెలకొన్న ప్రస్తుత వాతావరణంలో ఆ సంఘాల బలోపేతాన్ని కోరుకోవడం దురాశే కావొచ్చు. మీ ఏలుబడిలోని రాష్ట్రాల్లో ఉల్లంఘనల తీవ్రత ఎక్కువా... మా ఏలుబడి ఉన్నచోట్ల ఉల్లంఘనల తీవ్రత ఎక్కువా అని రాజకీయ పక్షాలు వాదులాడుకుంటే, సవాళ్లు విసురుకుంటే, మానవ హక్కులకు ఎవరికి వారు సొంత భాష్యాలు చెప్పుకుంటే నిజంగానే అంతర్జాతీయంగా దేశ ప్రతిష్ఠ మసకబారుతుంది. ముఖ్యంగా మానవహక్కుల సంఘం సంస్థాపక దినోత్సవంనాడు అలాంటి వాదనలు అప్రస్తుతం. అందుకు బదులు మానవహక్కుల పటిష్టతకు సమష్టిగా ఏం చేయాలన్న అంశంపై దృష్టి పెడితే సాధారణ పౌరులకు మేలు కలుగుతుంది. 

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top