
శాసనసభలు ఆమోదించి పంపే బిల్లులపై రాష్ట్రపతి లేదా గవర్నర్లు నిర్దిష్ట కాలవ్యవధిలో నిర్ణ యాన్ని ప్రకటించాలనీ, లేనట్టయితే వాటిని ఆమోదించినట్టుగా భావించవచ్చని గత నెలలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మరోసారి కోర్టు మెట్లెక్కింది. ఈ తీర్పుపై కేంద్రప్రభుత్వం తాజాగా రాష్ట్రపతి ద్వారా సుప్రీం కోర్టు అభిప్రాయాన్ని కోరింది. నిజానికి, ఆ తీర్పు ఇటీవల రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. సాక్షాత్తూ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌కడ్ దానిపై విరుచుకు పడ్డారు. ‘ఈమధ్య ఒక తీర్పు ఏకంగా రాష్ట్రపతికే ఆదేశాలు జారీచేసింది. జడ్జీలే సూపర్ పార్లమెంటుగా వ్యవహరిస్తు న్నారు. ప్రజాస్వామ్య శక్తులే లక్ష్యంగా దాడి జరుగుతోంది’ అంటూ విమర్శించారు. కీలకాంశాలపై రాజ్యాంగ న్యాయస్థానాలు వెలువరించే అసాధారణ తీర్పులు ఒక్కోసారి అసాధారణ పరిణా మాలకు దారి తీస్తాయి.
తమ శాసనసభ ఆమోదించి పంపిన బిల్లుల్ని గవర్నర్ ఆర్.ఎన్. రవి ఎటూ తేల్చకుండా దీర్ఘకాలం పెండింగ్‌లో ఉంచుతున్నారని ఆరోపిస్తూ తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన వ్యాజ్యంలో జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ ఆర్. మహదేవన్‌లతో కూడిన ఇద్దరు న్యాయ మూర్తుల ధర్మాసనం ఈ సంచలన తీర్పు వెలువరించింది. అసెంబ్లీలు ఆమోదించి పంపిన బిల్లులు నెలల తరబడి, ఏళ్ల తరబడి గవర్నర్ల వద్ద పెండింగ్‌లో వుండిపోవటం తమిళనాడు సమస్య మాత్రమే కాదు... విపక్షాల ఏలుబడిలో వున్న కొన్ని ఇతర ప్రభుత్వాల పరిస్థితి సైతం ఇలాగేవుంది. భిన్న సందర్భాల్లో సుప్రీంకోర్టు పలు ఆదేశాలు జారీ చేస్తూనే వచ్చింది.
విస్తృత ప్రజా ప్రయోజనాలు ఇమిడివున్న అంశాల్లో వివరణ కోరడానికీ లేదా సందేహ నివృత్తికీ, రాష్ట్రాలమధ్య తలెత్తే వివాదాల్లో అభిప్రాయం కోరడానికీ ‘ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్’ రూపంలో కేంద్రప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానం ముందు వ్యాజ్యం దాఖలు చేస్తుంది. రాజ్యాంగంలోని 143(1) అధికరణ కింద వున్న ఈ అధికారాన్ని అరుదైన సందర్భాల్లో మాత్రమే కేంద్రం వినియోగించుకుంటుంది. ఈ తీర్పుద్వారా సుప్రీంకోర్టు తన అధికార పరిధిని దాటిందన్నది ప్రభుత్వ ఉద్దేశం. ఈ నివేదనలో 14 ప్రశ్నలు లేవనెత్తారు.
రాష్ట్రాల శాసనసభలు ఆమోదించిన బిల్లులు తమ పరిశీలన కొచ్చినప్పుడు రాష్ట్రపతి లేదా గవర్నర్లు ఏం చేయాలో రాజ్యాంగంలోని 200, 201 అధికరణలు నిర్దేశిస్తున్నాయి. వాటిననుసరించి బిల్లుల్ని ఆమోదించే లేదా తోసిపుచ్చే అధికారం వుంటుంది. 200 అధికరణ ప్రకారం బిల్లు గవర్నర్ పరిశీలనకొచ్చినప్పుడు ‘సాధ్యమైనంత త్వరగా’ దానిపై అభిప్రా యాన్ని ప్రకటించాలంటున్నది. దాన్ని నిరాకరించాక తిరిగి అదే రూపంలో రెండోసారి బిల్లు వచ్చిన ప్పుడు గవర్నర్ తన ఆమోదాన్ని పెండింగ్‌లో వుంచరాదని చెబుతోంది. రెండోసారి వచ్చిన బిల్లును గవర్నర్ రాష్ట్రపతి పరిశీలనకు పంపినపక్షంలో ఏం చేయాలో 201 అధికరణ సూచిస్తోంది.
ఆమో దానికి లేదా తిరస్కారానికీ అందులో నిర్దిష్టమైన వ్యవధిని సూచించటం లేదన్నది ‘ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్’ ప్రస్తావిస్తోంది. అలాంటప్పుడు గవర్నర్లయినా, రాష్ట్రపతైనా మూణ్ణెల్లలోగా బిల్లులపై తమ నిర్ణయం ప్రకటించాలని, లేనట్టయితే వాటిని ఆమోదించినట్టే భావించాలని సుప్రీంకోర్టు ధర్మాసనం ఏ ప్రాతిపదికన నిర్ణయిస్తుందని ప్రశ్నిస్తోంది. పైగా ఇలాంటి ఆదేశాలు రాజ్యాంగ ధర్మాసనం ఇవ్వాలి తప్ప ఇద్దరు సభ్యుల ధర్మాసనం ఇవ్వొచ్చునా అనే సందేహాన్నీ వ్యక్తం చేసింది.
మన రాజ్యాంగ నిర్మాతలు రాజ్యాంగాన్ని ఒక దార్శనిక పత్రంగా రూపొందించారు తప్ప మనల్ని మనం ఎలా పరిపాలించుకోవాలో... దేన్ని ఏవిధంగా ఆచరించాలో సూచించే నిబంధనల పత్రంగా తయారుచేయలేదు. కనుకనే ఆచరణలో ఎదురయ్యే సమస్యల్ని దృష్టిలో వుంచుకుని దానికి భాష్యం చెప్పుకోవటం, సవరించుకోవటం తప్పటం లేదు. మన కార్యనిర్వాహక వ్యవస్థ ఈ 75 ఏళ్ల ప్రస్థానంలో రాజ్యాంగానికి వందకుపైగా సవరణలు తీసుకురావాల్సి వచ్చిందంటేనే ఆసంగతి తెలుస్తోంది. ఇక సర్వోన్నత న్యాయస్థానం భిన్న సందర్భాల్లో వెలువరించిన తీర్పుల ద్వారా వివిధ అధికరణల విస్తృతిని పెంచింది. వీటన్నిటికీ రాజ్యాంగస్ఫూర్తే గీటురాయి.
మన దేశంలో పటి ష్ఠమైన సహకార సమాఖ్య వ్యవస్థ ఉండాలని రాజ్యాంగం ఆశించింది. కేంద్ర ప్రతినిధులుగా రాష్ట్రాల్లో గవర్నర్లు ఏం చేయాలో, రాష్ట్రపతి ఎలా వ్యవహరించాలో రాజ్యాంగంలోని అధికరణలు చెబుతున్నాయి. తమ ఆచరణ దేశంలో సహకార సమాఖ్య వ్యవస్థ పరిఢవిల్లాలని చెప్పే రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా ఉంటున్నదో లేదో పరిశీలించుకోవాల్సిన అవసరం గవర్నర్లకుంది.
ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికయ్యే ప్రభుత్వాలు ప్రజలకిచ్చిన వాగ్దానాలకు అనుగుణంగా ఒక చర్యకు ఉపక్రమించినప్పుడు దాన్ని ఉద్దేశపూర్వకంగా అడ్డుకోవటం ఏ రకంగా సబబవుతుంది?ఇందువల్ల కేవలం ఒక రాజకీయపక్షం ఆధ్వర్యంలోని ప్రభుత్వాన్ని పనిచేయకుండా నిరోధించటం మాత్రమే కాదు... ప్రజలిచ్చిన రాజకీయ అధికారాన్ని గుర్తించ నిరాకరించటం కూడా! ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా రాజ్యాంగ పరిధిని దాటి, మందబలంతో దేశ భద్రతకు ముప్పు కలిగించే నిర్ణయాలు తీసుకుంటే వాటిని ఆపడాన్ని ఎవరూ ప్రశ్నించరు.
కానీ ప్రజాహితం, వారి సంక్షేమం, భద్రత కోరి చేసే బిల్లుల్ని కూడా పెండింగ్‌లో వుంచటం ఏం సబబు? గవర్నర్లు తమవద్దకొచ్చే బిల్లుల్ని అకార ణంగా పెండింగ్‌లో వుంచటం సారాంశంలో రాజకీయ సమస్య. కనీసం దీన్ని గవర్నర్లవరకూ పరి మితం చేసి రాష్ట్రపతి ప్రమేయాన్ని నివారించి వుంటే బాగుండేది. కానీ రాష్ట్రపతి దగ్గర సైతం బిల్లులు పెండింగ్‌లో పడటం వల్ల సమస్య మరింత జటిలమైంది. తాజా నివేదనను పరిశీలించబోయే రాజ్యాంగ ధర్మాసనం ఈ విషయంలో ఏం చెబుతుందో వేచిచూడాలి.