ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి | - | Sakshi
Sakshi News home page

ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి

Nov 30 2026 12:11 AM | Updated on Nov 30 2026 12:11 AM

రాజమహేంద్రవరం సిటీ: నగరపాలక సంస్థ ఎన్నికల ఓట్ల లెక్కింపును పారదర్శకంగా, వేగవంతంగా, అత్యంత సజావుగా పూర్తి చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అదనపు ఎన్నికల అధికారి, కమిషనర్‌ రాహుల్‌ మీనా తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ గ్రేటర్‌ రాజమహేంద్రవరంలో మొత్తం 72 డివిజన్ల పరిధిలోని 491 పోలింగ్‌ స్టేషన్లలో పోలైన ఓట్లను సకాలంలో లెక్కించేందుకు విస్తృతమైన ఏర్పాటు చేపట్టినట్టు ఆయన తెలిపారు. ఇందుకోసం 180 కౌంటింగ్‌ టేబుళ్లను సిద్ధం చేసి, 1100 మంది శిక్షణ పొందిన సిబ్బంది, అధికారులను నియమించినట్టు తెలిపారు. పోటీ చేస్తున్న అభ్యర్థులు, వారి తరఫున నియమితులైన ఏజంట్లు సోమవారం ఉదయం 6.30 గంటల సమయానికి స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్దకు చేరుకోవాలని సూచించారు.

ఉర్సు ఉత్సవాలు ప్రారంభం

అమలాపురం టౌన్‌: స్థానిక ముస్లిం వీధిలోని దర్గా వద్ద సయ్యద్‌ హజరత్‌ ఖాజాబాబా 69వ ఉర్సు ఉత్సవాలు ఆదివారం సాయంత్రం నుంచి ప్రారంభమయ్యాయి. పట్టణంలోని ముస్లింలే కాకుండా ఇతర ప్రాంతాలకు చెందిన ముస్లింలు ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు. దర్గా నుంచి గుర్రంపై తీసిన గంధాన్ని ఉంచి పుర వీధుల్లో ఊరేగారు. బ్యాండ్‌ మేళాలు, పాటలతో ఊరేగింపు సాగింది. దర్గా నుంచి ప్రారంభమైన ఊరేగింపు ముస్లింవీధి, హైస్కూల్‌ సెంటర్‌, గడియారం స్తంభం మీదుగా సాగింది. ఈ ఉత్సవాలు సోమ, మంగళవారాల్లో కూడా జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. కోనసీమ ముస్లిం వెల్ఫేర్‌ అసోసియేషన్‌, సయ్యద్‌ హజరత్‌ ఖాజాబాబా వారి ఉర్సు యువజన కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో ఉత్సవాలు జరుగుతున్నాయి.

గుర్తులు మార్చేశారని ఆందోళన

కొత్తపల్లి: అధికారులు కేటాయించిన గుర్తుతో ప్రచారం చేసుకుంటే.. తీరా పోలింగ్‌ కేంద్రం వద్ద అభ్యర్థులను తెలిపే నోటీసు బోర్డులో గుర్తులు మార్చేశారంటూ ఓ అభ్యర్థిని ఆందోళన చేశారు. కొత్తపల్లి ఎస్సీ పేటలోని ఎంపీపీ పాఠశాలలో 12వ వార్డుకు సంబంధించి పోలింగ్‌ కేంద్రాన్ని నిర్వహించారు. ఈ పోలింగ్‌ కేంద్రం వద్ద ‘గౌను’ గుర్తు కేటాయించిన కుమ్మరి రత్నం పేరు పక్కన ప్రెషర్‌ కుక్కర్‌ గుర్తు రాయడమేమిటంటూ ఆందోళన చేశారు. పోలింగ్‌ ముగిసిన అనంతరం సిబ్బందిని, బ్యాలెట్‌ బాక్స్‌లను తరలించకుండా ఆమె అడ్డుకున్నారు. రీ పోలింగ్‌ నిర్వహించాలని పట్టుబట్టారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ నేపథ్యంలో పోలింగ్‌ కేంద్రం వద్దకు జాయింట్‌ కలెక్టర్‌ అపూర్వ భరత్‌ చేరుకున్నారు. తామిద్దరం ప్రచారం చేసుకున్న గుర్తుల ప్రకారమే విజయాన్ని కేటాయించాలని ఆయా అభ్యర్థులు జేసీకి వినతిపత్రం అందజేశారు. అదేవిధంగా విజయాన్ని కేటాయిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

హరహర.. శివశంకర

సామర్లకోట: స్థానిక పంచారామ క్షేత్రం బాలాత్రిపుర సుందరీ సమేత కుమారామ భీమేశ్వరస్వా మి ఆలయం కార్తిక మాసం మూడో ఆదివారం కావడంతో కిటకిటలాడింది. హరహర మహదేవ శంభో శంకరా అంటూ భక్తుల స్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. స్వామివారికి అభిషేక పూజలను ఈఓ బళ్ల నీలకంఠం, ట్రస్టు బోర్డు చైర్మన్‌ కంటే జగదీష్‌ మోహనరావు ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు ప్రారంభించారు. అమ్మవారికి కుంకుమార్చనలు చేశారు. కాలభైరవ స్వామి ఆలయం, ధ్వజస్తంభం, రావిచెట్టు, జమ్మి చెట్టు, మారేడు చెట్టు, ఆలయ ప్రాంగణంలోని తులసి మొక్క వద్ద మహిళలు కార్తిక దీపాలు వెలిగించారు. ఆలయానికి రూ.2,500 చెల్లించిన భక్తులు ఉదయం నుంచి సాయంత్రం వరకు లక్షపత్రి పూజలు చేశారు. వారిచే రాత్రి ఏర్పాటు చేసిన జ్యోతిర్లింగార్చన ఆకట్టుకుంది. ఆలయ పండితులు వేమూరి సోమేశ్వరశర్మ, అళ్లకి రాజగోపాలశర్మ పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement