ఫ మూడేళ్లలో 280 గ్రాముల బంగారు
ఆభరణాల చోరీ
ఫ ఇద్దరు చైన్ స్నాచర్ల అరెస్ట్
కాకినాడ క్రైం: కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లో చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను గురువారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ వివరాలను ఎస్పీ బిందుమాధవ్ వెల్లడించారు. కాకినాడ పర్లోవపేటకు చెందిన లంకా దొరబాబు, పెదపూడి మండలం కాండ్రేగులకు చెందిన మందపల్లి వీర్రాజు కలిసి, రెండు జిల్లాల్లో రూ.40 లక్షల విలువైన 280 గ్రాముల బంగారు ఆభరణాలను చోరీ చేశారు. చెడు అలవాట్లకు బానిసలై, సులువుగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో వీరు మూడేళ్లలో కాకినాడ గాంధీనగర్, గోకులం, సర్పవరం, రాయుడుపాలెం, సామర్లకోట, పెద్దాపురం, రామచంద్రపురం ప్రాంతాల్లో చోరీలకు పాల్పడ్డారు. బైక్ మీద వచ్చి ఆయా ప్రాంతాల్లో వృద్ధ మహిళల మెడలో నుంచి బంగారు ఆభరణాలు లాక్కెళ్లిపోయేవారు. ఈ నేపథ్యంలో గట్టి నిఘా పెట్టిన పోలీసులకు నిందితులు చిక్కారు. కాకినాడలోని ఎస్.అచ్యుతాపురం గ్రామంలో ఉన్న ఓ లేఅవుట్లో వీరు ఉండగా రూరల్ సీఐ చైతన్య కృష్ణ ఆదేశాలతో ఇంద్రపాలెం ఎస్ఐ ఈ నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుంచి 280 గ్రాముల బంగారు ఆభరణాలను రికవరీ చేశారు.


