కూటమి నేతలకు ఓటుతో బుద్ధి చెప్పాలి | - | Sakshi
Sakshi News home page

కూటమి నేతలకు ఓటుతో బుద్ధి చెప్పాలి

Oct 16 2026 12:06 AM | Updated on Oct 16 2026 12:06 AM

ప్రత్తిపాడు: సూపర్‌ సిక్స్‌ హామీలతో ప్రజలను వంచించిన టీడీపీ, దాని మిత్రపక్షాలకు ఓటుతో బుద్ధి చెప్పాలని సీపీఐ (ఎంఎల్‌) లిబరేషన్‌ రాష్ట్ర కార్యదర్శి బుగత బంగార్రాజు పిలుపునిచ్చారు. ప్రత్తిపాడులోని పార్టీ కార్యాలయంలో గురువారం జిల్లా కమిటీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ముఖ్యఅతిథిగా విచ్చేసిన బంగార్రాజు మాట్లాడుతూ రెండున్నరేళ్ల పాలనలో ఒక్క పింఛన్‌ గానీ, గృహం గానీ మంజూరు చేయని కూటమి నేతలను నిలదీయాలని పిలుపునిచ్చారు. కూటమికి ఓటేసి మరోసారి మోసపోవద్దని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా ఐదు జెడ్పీటీసీ, 20 ఎంపీటీసీ స్థానాలకు తమ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తారన్నారు. జిల్లా కమిటీ సభ్యుడు మానుకొండ లచ్చబాబు అధ్యక్షతన జరిగిన ఈసమావేశంలో నాయకులు కె.జనార్ధన్‌, గొడుగు సత్యనారాయణ, జె.రాజబాబు, తాడి నాగేశ్వరరావు, ఎస్‌.రాజామణి, పి.లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

గోదావరిలో చేపల మృత్యువాత

రాజోలు: వశిష్టా గోదావరి తీరం వెంబడి రాజోలు నుంచి సఖినేటిపల్లి వైపు పలు చోట్ల చనిపోయిన చేపలు తేలియాడుతున్నాయి. చేపలు అధిక సంఖ్యలో చనిపోవడంపై మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గోదావరిలో కలుషిత వ్యర్థాల కారణంగా చేపలు చనిపోతున్నాయని ఆరోపిస్తున్నారు. గోదావరి ఏటిగట్టు వెంబడి ఉన్న రిసార్ట్స్‌ మురుగు నీరు, వ్యర్థాలతో పాటు నర్సాపురంలోని ఒక ఫ్యాక్టరీ నుంచి వచ్చే వ్యర్థాలు గోదావరి నీటిలో కలసి పోవడంతో, వాటి ప్రభావం మత్స్య సంపదపై పడుతోందని మత్స్యకార సంఘ నాయకుడు నాగిడి ఏడుకొండలు తెలిపారు. అలాగే రాజోలు పట్టణంలో సేకరించిన చెత్తను గోదావరి ఏటిగట్టు వెంబడి వేయడంలో గోదావరి నీరు కలుషితం అవుతోందన్నారు. అధికారులు స్పందించి గోదావరిలోకి ఎలాంటి కలుషిత వ్యర్థాలు కలవకుండా చర్యలు తీసుకుని మత్స్యసంపదను రక్షించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

కొండముచ్చుల దాడిలో తండ్రీ కొడుకులకు గాయాలు

గండేపల్లి: కొండముచ్చుల దాడిలో తండ్రీ కొడుకులకు గాయాలయ్యాయి. బాధితులు, స్థానికుల కథనం ప్రకారం.. గండేపల్లి మండలం మల్లేపల్లి కొత్తూరు సెంటర్‌లోని రామాలయం సమీపంలో ఇంటి గదిలో ఉన్న నంద్యాల ఏడుకొండలుపై కొండముచ్చులు దాడికి ప్రయత్నించాయి. వెంటనే అతడి కుమారుడు రమేష్‌ వాటిని అడ్డుకునే ప్రయత్నం చేశాడు. దీంతో అవి తండ్రీ కొడుకులపై దాడి చేసి, గాయపరిచాయి. గమనించిన బంధువులు బాధితులను జెడ్‌.రాగంపేట సీహెచ్‌సీకి తరలించగా వైద్యులు చికిత్స అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement